Share News

CM Revanth Reddy : భారీ వర్షాలున్నాయ్‌.. జాగ్రత్త!

ABN , Publish Date - Aug 17 , 2025 | 04:50 AM

రాష్ట్రంలో భారీ వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశించారు.

CM Revanth Reddy : భారీ వర్షాలున్నాయ్‌.. జాగ్రత్త!

  • అన్ని శాఖల అధికారులు, సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలి

  • లోతట్టు ప్రాంతాల ప్రజలను సహాయక శిబిరాలకు తరలించాలి

  • సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశాలు

హైదరాబాద్‌, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో భారీ వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. ప్రాణ, ఆస్తి నష్టం చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నిజామాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, వికారాబాద్‌, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందన్న వాతావరణ శాఖ సూచనల మేరకు సీఎం శనివారం ఉదయం ఉన్నతాధికారులతో మాట్లాడారు. వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాల్లో ఎస్డీఆర్‌ఎఫ్‌, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను ముందుగానే మోహరించామని, వారు కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు చేపడతారని తెలిపారు. జిల్లా అధికారులు లోతట్టు ప్రాంతాల్లోని కుటుంబాలను సహాయక శిబిరాలకు తరలించాలని ఆదేశించారు.


నీటి పారుదల శాఖ అధికారులు, సిబ్బంది రిజర్వాయర్లు, చెరువులు, కుంటల నీటి మట్టాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ నీటి విడుదలపై ముందుగానే కలెక్టర్లు, క్షేత్ర స్థాయి సిబ్బందికి సమాచారం ఇవ్వాలన్నారు. రోడ్లపై నీరు నిలిచిన ప్రాంతాల్లో, లోలెవల్‌ బ్రిడ్జిలు, కాజ్‌వేలపై నుంచి రాకపోకలు పూర్తిగా నిషేధించాలని పోలీసులు, రెవె న్యూ అధికారులు వాటి సమీపంలో బారికేడ్లు ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని సూచించారు. వరద నీరు నిలిచి అంటువ్యాధులు ప్రబలే ప్రమాదమున్నందున పారిశుధ్య పనులు చేపట్టాలని ఆదేశించారు. వైద్యారోగ్య శాఖ అవసరమైన చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. రెవెన్యూ, విద్యుత్తు, పంచాయతీరాజ్‌, ఆర్‌ అండ్‌ బీ, వైద్యారోగ్య, పురపాలక, పోలీస్‌, అగ్నిమాపక శాఖలు, ఎస్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సమన్వయంతో సాగాలని సూచించారు. కాగా, భారీ వర్షాల నేపథ్యంలో ఆర్‌ అండ్‌ బీ శాఖలోని సిబ్బందికి సెలవులు రద్దు చేయాలని అధికారులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తృటిలో తప్పిన ప్రమాదం.. విమాన ప్రయాణికులు సురక్షితం

రాహుల్ గాంధీ ఆరోపణలు.. ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

మరిన్ని తెలంగాణ వార్తలు, తెలుగు వార్తలు చదవండి..

Updated Date - Aug 17 , 2025 | 04:50 AM