HCA Scam: హెచ్‌సీఏ కేసులో ముగిసిన నిందితుల విచారణ
ABN , Publish Date - Jul 23 , 2025 | 06:24 AM
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హెచ్‌సీఏలో నిధుల దుర్వినియోగం
మల్కాజిగిరి కోర్టులో హాజరుపరిచిన సీఐడీ
హెచ్‌సీఏ ఎన్నికల్లో బ్యూరోక్రాట్ల ఓట్లపై సీఐడీ వివరణ
హైదరాబాద్, జూలై 22 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)లో నిధుల దుర్వినియోగం, ఫోర్జరీ పత్రాలతో అధ్యక్షుడి ఎన్నిక తదితర అంశాలపై నమోదైన కేసులో.. నిందితుల కస్టడీ మంగళవారంతో ముగిసింది. ఆరు రోజుల పాటు నిందితులను సీఐడీ ప్రశ్నించిన విషయం తెలిసిందే..! మంగళవారం సాయంత్రం జగన్‌మోహన్‌రావుతో పాటు.. శ్రీనివాసరావు, సునీల్ కాంతే, రాజేందర్ యాదవ్, కవితకు గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించి, మల్కాజిగిరి కోర్టులో హాజరుపరిచారు. నిందితులకు 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్‌కు తరలిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై విచారణను మల్కాజిగిరి కోర్టు బుధవారానికి వాయిదా వేసింది. కవితను చంచల్‌గూడ మహిళా జైలుకు, మిగతా నిందితులను చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించారు. మరోవైపు.. జగన్‌మోహన్‌రావు హెచ్‌సీఏ అధ్యక్షుడిగా అక్రమ మార్గంలో ఒకేఒక్క ఓటు తేడాతో ఎన్నిక అవ్వడానికి సాయపడ్డ వారి వివరాలను సీఐడీ గుర్తించినట్లు సమాచారం. అక్రమ మార్గాల్లో జగన్ గెలిచేలా తెరవెనక ఉండి కృషి చేసిన వారికి సీఐడీ త్వరలో నోటీసులు జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఎన్నిక విషయంలో ఇప్పటికే తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గురవారెడ్డి పలుమార్లు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే..! అందుకు సంబంధించిన ఆధారాలను అందజేస్తూ.. సీఐడీతోపాటు, ఈడీకి ఫిర్యాదు చేశారు. కాగా.. హెచ్‌సీఏ ఎన్నికల్లో 23 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఓట్లు వేశారని, దర్యాప్తు అధికారులు వీరికి నోటీసులు జారీ చేయనున్నట్లు వచ్చిన వార్తలపై సీఐడీ అదనపు డీజీ చారుసిన్హా వివరణ ఇచ్చారు. పలు క్ల్లబ్‌లు, వాటికి అనుసంధానంగా ఉన్న సంస్థల నిబంధనలు తెలియకుండా బ్యూరోక్రాట్లు ఓట్లు వేశారని ఆరోపణ చేయడం అసమంజసమని పేర్కొన్నారు. ఏ బ్యూరోక్రాట్‌కు కూడా తన వ్యక్తిగత హోదాలో హెచ్‌సీఏ ఎన్నికల్లో ఓటు హక్కు ఉండదని స్పష్టం చేశారు. క్లబ్‌లతో వారికి ఉన్న అనుబంధం మేరకు ఓటు హక్కు వస్తుందని గుర్తుచేశారు. హెచ్‌సీఏ కేసు విచారణలో కొత్త అంశాలు వెలుగులోకి వస్తే.. తామే మీడియాకు వెల్లడిస్తామని పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కోర్టును ఆశ్రయించిన మహిళ.. సీజేఐ ఆసక్తికర వ్యాఖ్యలు
ధన్‌ఖఢ్ రాజీనామా వెనుక నితీష్‌ను తప్పించే కుట్ర.. ఆర్జేడీ ఆరోపణ
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి