Organ Donation: అవయవదానం చేసేవారు దేవుళ్లే!
ABN , Publish Date - Aug 31 , 2025 | 04:18 AM
అవయవదానం చేసేవారు దేవుళ్లతో సమానం అని సినీ నటుడు చిరంజీవి అన్నారు. దేవుడు ఎక్కడో లేడని.. మంచి మనసులో, దానగుణంలో ఉంటాడని..
ఒకరు కన్నుమూస్తూ 8 మందికి ప్రాణం పోయొచ్చు
స్టార్ లివర్ టాక్‌ఎక్స్ సదస్సులో సినీ నటుడు చిరంజీవి
హైదరాబాద్ సిటీ, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): అవయవదానం చేసేవారు దేవుళ్లతో సమానం అని సినీ నటుడు చిరంజీవి అన్నారు. దేవుడు ఎక్కడో లేడని.. మంచి మనసులో, దానగుణంలో ఉంటాడని.. అవయవ దానంతో ఇతరులకు ప్రాణదానం చేసేవారిలోనూ ఉంటాడని పేర్కొన్నారు. అవయవదానానికి ముందుకు రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మాదాపూర్‌లో స్టార్ హాస్పిటల్ నిర్వహించిన స్టార్ లివర్ టాక్‌ఎక్స్-2025 సదస్సుకు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ‘లైఫ్ ఆఫ్టర్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్: హ్యాండ్‌బుక్ ఫర్ హెల్తీ లివింగ్’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడారు. ఒక మనిషి తుదిశ్వాస విడుస్తూ అవయవదానం ద్వారా 8మందికి ప్రాణదానం చేయొచ్చునన్నారు.
అవయవదానం గురించి అవగాహన పెరగాల్సిన అవశ్యకత ఉందని అభిప్రాయపడ్డారు. స్టార్ హాస్పిటల్స్ గ్రూప్ ఎండీ డాక్టర్ గోపిచంద్ మన్నం మాట్లాడుతూ మన దేశంలో ఇటీవలి కాలంలో కాలేయ వ్యాధుల సంఖ్య పెరుగుతోందని వాటి పట్ల అవగాహన కల్పించేందుకు ఓ బుక్‌లెట్ తీసుకొస్తున్నామని చెప్పారు. డాక్టర్ రవీంద్రనాఽథ్ మాట్లాడుతూ స్టార్ లివర్ టాక్ ఎక్స్ విశేషాలను వెల్లడించారు. కార్యక్రమంలో లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అండ్ హెచ్‌పీబీ సర్జరీ డైరెక్టర్, సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ మెట్టు శ్రీనివాస్ రెడ్డి, రేలా ఇనిస్టిట్యూట్ అండ్ మెడికల్ సెంటర్ చైర్మన్ డాక్టర్ మొహమ్మద్ రేలా, స్టార్ హాస్పిటల్ గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రమేశ్ గూడపాటి తదితరులు పాల్గొన్నారు. ’