ఏపీ, తెలంగాణలో అటల్ భూజల్ యోజన!
ABN , Publish Date - Feb 11 , 2025 | 05:36 AM
భూగర్భ జలాల సుస్థిరతను పెంపొందించేందుకు అమలు చేస్తున్న అటల్ భూజల్ యోజన పథకాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 5 రాష్ట్రాలకు విస్తరించాలని కేంద్రం యోచిస్తోంది.
8,200 కోట్లతో కొత్తగా 5 రాష్ట్రాలలో విస్తరణకు కేంద్రం యోచన
‘జల్ జీవన్’పై స్థాయీ సంఘం నివేదిక
వెనుకబడిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్
సంతృప్తికర జాబితాలో తెలంగాణ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: భూగర్భ జలాల సుస్థిరతను పెంపొందించేందుకు అమలు చేస్తున్న అటల్ భూజల్ యోజన పథకాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 5 రాష్ట్రాలకు విస్తరించాలని కేంద్రం యోచిస్తోంది. ప్రస్తుతం నీటి కొరత ఉన్న 7 రాష్ట్రాల్లో ఈ పథకాన్ని అమలు చేస్తోంది. కొత్తగా ఏపీ, తెలంగాణతో పాటు తమిళనాడు, బిహార్, పంజాబ్ రాష్ట్రాలకు విస్తరించాలని భావిస్తున్నట్టు కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ.. జల వనరుల స్థాయీ సంఘానికి తెలియజేసింది. రూ.8,200 కోట్ల నిధులతో ఈ 5 రాష్ట్రాలలో కేంద్ర ప్రాయోజిత పథకంగా అమలు చేసేందుకు ఆర్థిక శాఖలోని ఖర్చుల విభాగం ప్రాథమిక అనుమతి ఇచ్చిందని వెల్లడించింది. కాగా సోమవారం లోక్‌సభలో బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ సారథ్యంలోని జలవనరుల స్థాయీ సంఘం జల్ జీవన్ మిషన్‌పై నివేదిక సమర్పించింది.
2024 డిసెంబరు నాటికి దేశంలోని అన్ని గ్రామీణ కుటుంబాలకు కొళాయి నీళ్లు ఇవ్వాలన్న జల్ జీవన్ మిషన్ లక్ష్యం... గడువు ముగిసినా నెరవేరలేదని ఆందోళన వ్యక్తం చేసింది. పనితీరు సరిగా లేని రాష్ట్రాలు వాటి లక్ష్యాలు సాధించేందుకు కేంద్రం సాయం చేయాలని కోరింది. జాతీయ సగటుతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఒడిశా, కేరళ, మధ్యప్రదేశ్, జార్ఖండ్, రాజస్థాన్‌లలో పురోగతి తక్కువగా ఉందని వెల్లడించింది. తెలంగాణ, పుదుచ్చేరి, గుజరాత్, పంజాబ్ సహా 11 రాష్ట్రాలు మాత్రమే ‘హర్ ఘర్ జల్’ హోదాను సాధించడంలో సంతృప్తికర స్థాయికి చేరుకున్నాయని పేర్కొంది. ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పురోగతి 53.84 నుంచి 96.42 శాతం వరకు ఉన్నట్టు వెల్లడించింది. ఇటీవల పార్లమెంటులో కేంద్రం సమర్పించిన డేటా ప్రకారం దేశంలో మొత్తం 19.36 కోట్ల గ్రామీణ కుటుంబాలకు గాను 15.40 కోట్ల కుటుంబాలకు (79.50 శాతం) ఈ పథకం వర్తింపజేసింది. జల్ జీవన్ మిషన్ గడువును 2028 వరకు పొడిగిస్తున్నట్టు ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో పేర్కొన్నారు.
జాతీయ టాస్క్‌ఫోర్స్‌కు సిఫారసు
దేశంలో నీటి డిమాండ్, సరఫరా మధ్య అంతరాన్ని తగ్గించేందుకు జాతీయ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని జల వనరుల స్థాయీ సంఘం కోరింది. పెరుగుతున్న జనాభా, పట్టణీకరణ, పారిశ్రామిక వృద్ధి, వాతావరణ మార్పుల దృష్ట్యా నీటి లభ్యత సమస్యగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. నీటికి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో తగినంత లభ్యత కోసం అన్ని ప్రయత్నాలు చేయాలని పేర్కొంది.