CBI Telangana: తెలంగాణలోకి మళ్లీ సీబీఐ
ABN , Publish Date - Sep 02 , 2025 | 02:35 AM
గత ప్రభుత్వం నిషేధించిన కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ రాష్ట్రంలోకి మళ్లీ అడుగుపెట్టనుంది. సీబీఐకి సాధారణ అనుమతిని రద్దు చేస్తూ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం జీవో నంబరు 51 జారీ చేసింది...
కాళేశ్వరం ప్రాజెక్టు కేసుతో పునఃప్రవేశం పరిమితులకు లోబడే అనుమతులు!
హైదరాబాద్, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వం నిషేధించిన కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ రాష్ట్రంలోకి మళ్లీ అడుగుపెట్టనుంది. సీబీఐకి సాధారణ అనుమతిని రద్దు చేస్తూ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం జీవో నంబరు 51 జారీ చేసింది. దీంతో సీబీఐ నేరుగా రాష్ట్రంలో కేసులు నమోదు చేసే అవకాశం లేకుండా పోయింది. తాజాగా, కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ కోసం ఈ కేసును సీబీఐకి అప్పగించాలని అసెంబ్లీలో ప్రకటించింది. ఇది సీబీఐకి రాష్ట్రంలోకి తిరిగి ప్రవేశించడానికి మార్గం సుగమం చేసింది. ఈ కేసు కోసం పాత జీవోను పూర్తిగా రద్దు చేస్తారా? లేక కేవలం ఈ ఒక్క కేసు కోసమే ప్రత్యేకంగా అనుమతి ఇస్తారా? అనే చర్చ మొదలైంది. సీబీఐ మాజీ అధికారుల అభిప్రాయం ప్రకారం, పాత జీవోను పూర్తిగా రద్దు చేసే అవకాశం లేదు. ఒక ప్రత్యేక జీవో లేదా నోటిఫికేషన్ ద్వారా కేవలం కాళేశ్వరం కేసు విచారణ కోసం సీబీఐకి అనుమతి ఇవ్వవచ్చని తెలుస్తోంది. ఈ పద్ధతి వల్ల, ప్రభుత్వం అనుమతి ఇచ్చిన కేసులను మాత్రమే సీబీఐ విచారించగలుగుతుంది. ఇతర కేసులు నమోదు చేయాలంటే మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇది సీబీఐ విచారణను పరిమితం చేస్తుంది.
నిషేధం.. నిర్ణయం ఆగస్టులోనే!
రాష్ట్రంలో సీబీఐకి అనుమతి లేదంటూ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2022, ఆగస్టు 30న నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జీవో 51 అమల్లోకి తెచ్చింది. అనూహ్యంగా సరిగ్గా 2025 ఆగస్టు 31న అంటే మూడేళ్లకు మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐకి అనుమతి ఇచ్చింది. అది కూడా గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరంపై విచారణకు అనుమతించడం గమనార్హం.
ఈ వార్తలు కూడా చదవండి..
కేసీఆర్, హరీష్ రావు మధ్యంతర పిటిషన్లపై కొన్ని ఘడియల్లో విచారణ
తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీపై కమిటీ ఏర్పాటు
For More TG News And Telugu News