Share News

Rajendranagar: వృద్ధ దంపతుల దారుణ హత్య!

ABN , Publish Date - Jun 07 , 2025 | 05:19 AM

రాజేంద్రనగర్‌లో ఘోరం జరిగింది. అపురూపంగా కట్టుకున్న ఇంట్లోకి మారిన నెలరోజుల్లోనే వృద్ధ దంపతులు దారుణహత్యకు గురయ్యారు.

Rajendranagar: వృద్ధ దంపతుల దారుణ హత్య!

  • ఫిజియోథెరఫీ కోసం వచ్చామంటూ వాచ్‌మన్‌కు చెప్పి ఇంట్లోకి వెళ్లిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు

  • హత్యలు వారిపనే? మృతదేహాలపై కత్తిపోట్లు

  • హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లో ఘటన

రాజేంద్రనగర్‌, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): రాజేంద్రనగర్‌లో ఘోరం జరిగింది. అపురూపంగా కట్టుకున్న ఇంట్లోకి మారిన నెలరోజుల్లోనే వృద్ధ దంపతులు దారుణహత్యకు గురయ్యారు. గుర్తుతెలియని దుండగులు ఇంట్లోకి చొరబడి వారిని విచక్షణారహితంగా పొడిచి చంపారు. రాజేంద్రనగర్‌ సర్కిల్‌ జనచైతన్య ఫేజ్‌-2లోని అబ్రిజ్‌ రెసిడెన్సీ అపార్ట్‌మెంట్‌లో ఈ దారుణ ఘటన జరిగింది. హతులు.. ఆ అపార్ట్‌మెంట్‌ యజమాని షేక్‌ అబ్దుల్లా (70), ఆయన భార్య రిజ్వానా (65). నెలక్రితం వరకు ఈ దంపతులు రెడ్‌హిల్స్‌లో నివాసం ఉండేవారు. షేక్‌ అబ్దుల్లా ఎస్బీఐలో మేనేజరుగా ఉద్యోగ విరమణ చేశారు. రిజ్వానా ఓ ప్రైవేటు కాలేజీలో హెడ్‌ ఆఫ్‌ ది ఇనిస్టిట్యూట్‌గా పనిచేసి రిటైరయ్యారు. జనచైతన్య ఫేజ్‌-2లో ఐదు వందల గజాల స్థలం కొనుగోలు చేసి ఐదంతస్తుల భవనాన్ని నిర్మించుకున్నారు. నెల రోజుల క్రితమే వారు ఇంట్లోకి మారారు. షేక్‌ అబ్దుల్లా దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారిలో ఇద్దరు అమెరికాలో, మరో ఇద్దరు లండన్‌లో ఉంటున్నారు.


గురువారం సాయంత్రం ఐదింటికి ఫిజియోథెరపీ చేయడానికి వచ్చామంటూ తలకు క్యాప్‌, ముఖానికి మాస్క్‌ ధరించి ఓ వ్యక్తి.. బురఖా ధరించి ఓ మహిళ షేక్‌ అబ్దుల్లా ఇంట్లోకి వెళ్లినట్లు వాచ్‌మన్‌ చెప్పాడు. దంపతుల హత్య వారిపనేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గురువారం రాత్రి 8గంటలకు వాచ్‌మన్‌ ఫోన్‌ చేసినా వృద్ధ దంపతులు తీయకపోవడంతో నిద్రపోయి ఉంటారని అతడు భావించాడు. మర్నాడు పదిగంటలకు వాచ్‌మన్‌ మంచినీళ్లు తెచ్చుకునేందుకు పైకి వెళ్లి చూడగా ఇంటి తలుపులు తీసి ఉన్నాయి. అనుమానించిన అతడు అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉండే వారిని అప్రమత్తం చేయడంతో వారు పోలీసులకు సమాచారమిచ్చారు. వారొచ్చి చూడగా రిజ్వానా బెడ్‌మీద, షేక్‌ అబ్దుల్లా ఇంటి గడప వద్ద విగతజీవులుగా కనిపించారు. షేక్‌అబ్దుల్లా పొట్టలో ఏడు కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇంట్లో బీరువా తెరిచి ఉంది. ఆస్తి తాలూకు జిరాక్స్‌ పత్రాలు చిరిగిపోయి చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. దుండగులు దొంగతనం చేసేందుకు వచ్చి హత్యచేసి ఉంటారా? పథకం ప్రకారం హత్య చేసేందుకే వచ్చారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని డీసీపీ చింతమనేని శ్రీనివాస్‌ చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తహశీల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వోపై దాడి.. స్వల్ప గాయాలు

బనకచర్లపై ఘాటుగా స్పందించిన మంత్రి ఉత్తమ్

For AndhraPradesh News And Telugu News

Updated Date - Jun 07 , 2025 | 05:19 AM