Share News

BRS: బీఆర్‌ఎస్‌ మహాధర్నా వాయిదా

ABN , Publish Date - Jan 21 , 2025 | 04:31 AM

రైతుల సమస్యలపై నల్లగొండ జిల్లా కేంద్రంలో మంగళవారం బీఆర్‌ఎస్‌ నిర్వహించాలని నిర్ణయించిన మహాధర్నా వాయిదాపడింది.

BRS: బీఆర్‌ఎస్‌ మహాధర్నా వాయిదా

  • పోలీసుల అనుమతి నిరాకరణ

  • హైకోర్టును ఆశ్రయించిన బీఆర్‌ఎస్‌ కేసును 27కు వాయిదా వేసిన కోర్టు

  • రైతు ఆత్మహత్యలపై 9 మందితో బీఆర్‌ఎస్‌ అధ్యయన కమిటీ: కేటీఆర్‌

నల్లగొండ ప్రతినిధి/హైదరాబాద్‌, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): రైతుల సమస్యలపై నల్లగొండ జిల్లా కేంద్రంలో మంగళవారం బీఆర్‌ఎస్‌ నిర్వహించాలని నిర్ణయించిన మహాధర్నా వాయిదాపడింది. బీఆర్‌ఎస్‌ నల్లగొండ జిల్లా విభాగం సోమవారం ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ముఖ్యఅతిథిగా హాజరవ్వాల్సిన మహాధర్నాకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించింది. అయితే.. పోలీసులు అనుమతిని నిరాకరించడంతో వాయిదా నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. కాగా.. ప్రభుత్వం ఈ నెల 21 నుంచి 24 వరకు గ్రామసభలను నిర్వహిస్తోందని, ఆ తర్వాత 26న గణతంత్ర వేడుకలకు బందోబస్తు నిర్వహించాల్సి ఉండడంతో మహాధర్నాకు అనుమతినివ్వలేమని డీఎస్పీ శివరాంరెడ్డి బీఆర్‌ఎస్‌ నేతలకు తెలిపారు. దాంతో బీఆర్‌ఎస్‌ వర్గాలు సోమవారం మధ్యాహ్నం హైకోర్టును ఆశ్రయించాయి.


లంచ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశాయి. మహాధర్నా నిర్వహణకు అనుమతించాలని ఆ పిటిషన్‌లో విజ్ఞప్తి చేశాయి. రైతు భరోసా కింద రూ.15 వేలు ఇస్తామన్న కాంగ్రెస్‌.. అధికారంలోకి వచ్చాక రూ.12 వేలే అని ప్రకటించి మోసం చేసిందని పేర్కొన్నాయి. సీఎం రేవంత్‌మోసపూరిత హామీలకు వ్యతిరేకంగా రైతులకు మద్దతుగా శాంతియుత ధర్నాకు తమ పార్టీ పిలుపునిచ్చిందని వివరించాయి. నిరసన తెలిపే హక్కును రాజ్యాంగం ప్రసాదించిందని, అయితే.. పోలీసులు మహాధర్నాకు నిరాకరించడం అన్యాయమంటూ ఆవేదన వ్యక్తం చేశాయి. ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో పోలీసు లు మహాధర్నాకు అనుమతినివ్వలేదన్నాయి. బీఆర్‌ఎస్‌ తరఫున న్యాయవాది రూపేందర్‌ వాదనలను వినిపించారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం.. తమ వైఖరిని తెలియజేయాలంటూ పోలీసులను ఆదేశిస్తూ.. విచారణను ఈనెల 27కు వాయిదా వేసింది.

Updated Date - Jan 21 , 2025 | 04:31 AM