Telangana: కనీసం నోటీసు కూడా ఇవ్వలేదు.. సుప్రీంను ఆశ్రయించిన బీఆర్ఎస్..
ABN , Publish Date - Jan 16 , 2025 | 02:58 PM
బీఆర్ఎస్‌లో గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ న్యాయపరమైన పోరాటం చేస్తుంది. తాజాగా, ఇందుకు సంబంధించి..

ఢిల్లీ: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 10 మంది ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసి 9 నెలలు అవుతున్నా.. స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్ లకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ SLP దాఖలు చేసింది. మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా రిట్ పిటిషన్ దాఖలు చేసింది.
నోటీసు కూడా ఇవ్వలేదు..
రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చి ఆరు నెలలు పూర్తి అయినా.. ఇప్పటికీ స్పీకర్ ఎలాంటి చర్యలకు ఉపక్రమించ లేదని సర్వోన్నత నాయ్యస్థానం దృష్టికి తీసుకెళ్లింది. కనీసం నోటీసు కూడా ఇవ్వలేదని పిటిషన్‌లో పేర్కొంది. గతంలో కేశం మేఘా చంద్ర కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని బీఆర్ఎస్ కోరింది. ఎమ్మెల్యేలపై ఆయా పార్టీలు ఇచ్చే పిర్యాదులపై స్పీకర్ మూడు నెలల్లో నిర్ణయం ప్రకటించాలని కేశం మేఘా చంద్ర కేసులో సుప్రీం ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా తెలంగాణ స్పీకర్ నిర్ణయం తీసుకోవడం లేదని బీఆర్ఎస్ తెలిపింది. నాలుగు వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది.