Supreme Court: ఫిరాయింపులపై సుప్రీంకు బీఆర్‌ఎస్
ABN , Publish Date - Jan 17 , 2025 | 03:28 AM
ఎన్నికల్లో తమ పార్టీ తరపున గెలిచి కాంగ్రె్‌సలోకి ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేలా అసెంబ్లీ స్పీకర్‌కు ఆదేశాలివ్వాలని కోరుతూ బీఆర్‌ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

పార్టీ మారిన పది మందిపై 4 వారాల్లో నిర్ణయం తీసుకునేలా స్పీకర్‌ను ఆదేశించాలని పిటిషన్లు
కడియం, దానం, తెల్లంలపై ఎస్‌ఎల్‌పీ దాఖలు
మిగిలిన ఏడుగురికి వ్యతిరేకంగా రిట్ పిటిషన్
న్యూఢిల్లీ, జనవరి 16(ఆంధ్రజ్యోతి): ఎన్నికల్లో తమ పార్టీ తరపున గెలిచి కాంగ్రె్‌సలోకి ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేలా అసెంబ్లీ స్పీకర్‌కు ఆదేశాలివ్వాలని కోరుతూ బీఆర్‌ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ పార్టీ తరపున న్యాయవాది మోహిత్‌రావు ఈ మేరకు పిటిషన్లను దాఖలు చేశారు. ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివా్‌సరెడ్డి, ఎం.సంజయ్‌కుమార్, గూడెం మహిపాల్‌రెడ్డి, అరికెపూడి గాంధీ, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్‌లపై రిట్ పిటిషన్, కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్‌లపై స్పెషల్ లీవ్ పిటిషన్(ఎ్‌సఎల్పీ)ను వేసింది. ఎస్‌ఎల్పీలో హైకోర్టు ఆదేశాలు, ఫిరాయింపులపై స్పీకర్‌కు చేసిన ఫిర్యాదులు, ఇతర అంశాలను జత చేశారు. రిట్ పిటిషన్‌లో.. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్‌కు ఫిర్యాదు చేసి 9 నెలలైనా ఏ చర్యలూ తీసుకోలేదని ప్రస్తావించారు.
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై హైకోర్టు తీర్పు వచ్చి 6 నెలలు గడుస్తున్నా స్పీకర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని.. కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. ఫిరాయింపులకు సంబంధించి గతంలో కేశం మేఘాచంద్ర కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని బీఆర్‌ఎస్ కోరింది. పార్టీ మారిన 10 మందిపై 4 వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. అనర్హతపై స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శికి సూచించాలని కోరింది. కాగా, ఎమ్మెల్యేల ఫిరాయింపులపై సుప్రీంకోర్టులో పిటిషన్ల దాఖలుకు మాజీ మంత్రి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు బుధవారమే ఢిల్లీ వచ్చారు. పిటిషన్లపై న్యాయవాదులతో చర్చించారు.