Kaushik Reddy: బెదిరింపు కేసులో ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డికి ముందస్తు బెయిల్ నిరాకరణ
ABN , Publish Date - Jun 18 , 2025 | 05:18 AM
హుజూరాబాద్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి ఒకే కేసుకు సంబంధించి హైకోర్టులో రెండోసారి ఎదురుదెబ్బ తగిలింది. క్వారీ యజమాని మనోజ్‌రెడ్డిని బెదిరించిన కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.

హైదరాబాద్, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): హుజూరాబాద్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి ఒకే కేసుకు సంబంధించి హైకోర్టులో రెండోసారి ఎదురుదెబ్బ తగిలింది. క్వారీ యజమాని మనోజ్‌రెడ్డిని బెదిరించిన కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. క్వారీ నడవాలంటే రూ.50 లక్షలు ఇవ్వాలని ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి బెదిరిస్తున్నారని పేర్కొంటూ క్వారీ యజమాని మనోజ్‌రెడ్డి భార్య కట్టా ఉమాదేవి హనుమకొండ సుబేదారి పోలీసుల కు ఫిర్యాదు చేయడంతో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ కేసును కొట్టేయాలని పేర్కొంటూ కౌశిక్‌రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ కె.లక్ష్మణ్ ధర్మాసనం సోమవారమే కొట్టేసింది. తాజాగా అదే బెదిరింపు కేసులో కౌశిక్ రెడ్డిముందస్తు బెయిల్ ఇవ్వాలని మంగళవారం మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై వాదనలు విన్న అదే ధర్మాసనం ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు నోటీసులు జారీచేస్తూ విచారణను ఈనెల 24కు వాయిదా వేసింది.
ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబుకు ఊరట
పోడు సాగుకోసం అటవీభూములను ఆక్రమించారనే ఆరోపణపై బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబుపై నమోదైన కేసులో దిగువ కోర్టులో ప్రత్యక్ష హాజరు నుంచి హైకోర్టు మినహాయింపు ఇచ్చింది. గ్రామస్థులతో కలిసి అడవిలో చెట్లను నరికేశారని, అటవీ అధికారులను అడ్డుకున్నారంటూ కుమ్రంభీంఆసిఫాబాద్ జిల్లా పెంచికల్‌పేట్ పీఎస్‌లో కేసు నమోదైంది. ప్రస్తుతం నాంపల్లి ప్రజాప్రతినిధుల మేజిస్ట్రేటు కోర్టులో కేసుపై విచారణ జరుగుతోంది.
బండి సంజయ్‌పై ఎన్నికల కేసు కొట్టివేత
కేంద్ర మంత్రి బండి సంజయ్‌కి హైకోర్టులో ఊరట లభించింది. 2021 ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కోడ్ ఉల్లంఘించడంతోపాటు కొవిడ్ సమయంలో ముందస్తు అనుమతి లేకుండా మిర్యాలగూడ నుంచి సూర్యాపేట వరకు 40 వాహనాలతో కాన్వాయ్‌ను వెంట తెచ్చుకున్నారనే ఆరోపణపై కేసు నమోదైంది. కేసు నిరూపితం కాకపోవడంతో దానిని హైకోర్టు మంగళవారం కొట్టివేసింది.
తెలుగు రాష్ట్రాల యాత్రికులకు శుభవార్త
‘గంగా-రామాయణ పుణ్యక్షేత్ర యాత్ర’ రైలు షురూ!
హైదరాబాద్, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): ఆధ్యాత్మిక ఆనందం, భారతీయ సంస్కృతి, వారసత్వాలకు పెద్దపీట వేస్తూ ఐఆర్‌సీటీసీ మరో అద్భుతమైన రైలు యాత్రను ప్రారంభించింది. ‘గంగా- రామాయణ పుణ్యక్షేత్ర యాత్ర’ పేరుతో నిర్వహిస్తున్న భారత్ గౌరవ్ పర్యాటక రైలు రామాయణంలోని పవిత్ర స్థలాలను, గంగా నది తీరాన ఉన్న కొన్ని పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశాన్ని భక్తులకు కల్పిస్తుంది. ఈ రైలు జూన్ 23న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి జూలై 1న తిరిగి చేరుకుంటుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ ఆధ్యాత్మిక పర్యటనలో భక్తులు వారణాసి(కాశీ), అయోధ్య, నైమిశారణ్యం(లక్నో), ప్రయాగ్‌రాజ్(అలహాబాద్) వంటి ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలను సందర్శించవచ్చని చెప్పారు. మరిన్ని వివరాలకు 040-27702407, 9701360701, 9281495845 నెంబర్లను సంప్రదించాలని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌వో ఎ.శ్రీధర్ తెలిపారు.