KTR For By Elections: ఉప ఎన్నికలొస్తాయి సిద్ధం కండి
ABN , Publish Date - Aug 01 , 2025 | 04:07 AM
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ మూడు నెలల్లోగా చర్యలు తీసుకోవాంటూ సుప్రీం కోర్టు గురువారం ఇచ్చిన
పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు.. సుప్రీం తీర్పుపై హర్షం
కాంగ్రెస్ రాజకీయానికి తీర్పు చెంపపెట్టని వ్యాఖ్య
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరతారా రాహుల్?: హరీశ్‌రావు
హైదరాబాద్, చేర్యాల, జూలై 31 (ఆంధ్రజ్యోతి): పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ మూడు నెలల్లోగా చర్యలు తీసుకోవాంటూ సుప్రీం కోర్టు గురువారం ఇచ్చిన తీర్పుపై బీఆర్‌ఎస్ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. సుప్రీం తీర్పు కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెంపదెబ్బ అని వ్యాఖ్యానించాయి. రాష్ట్రంలోని పది నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు వస్తాయని, ఆ స్థానాల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించేందుకు సిద్ధం కావాలని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తమ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సుప్రీంకోర్టు తీర్పుపై ఓ ప్రకటన ద్వారా హర్షం వ్యక్తం చేసిన కేటీఆర్.. కొందరు ప్రజాప్రతినిధులు అడ్డదారులు తొక్కినంత మాత్రాన ప్రజాస్వామ్య వ్యవస్థ నాశనం కాదని సుప్రీం తీర్పు నిరూపించిందని పేర్కొన్నారు. స్పీకర్ పదవిని అడ్డంపెట్టుకొని కాంగ్రెస్ చేసిన రాజ్యాంగ వ్యతిరేక ఫిరాయింపుల రాజకీయానికి సుప్రీం తీర్పు చెంపదెబ్బ అని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పును గౌరవించి ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు విధించాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పుతో రానున్న మూడు నెలల్లో 10 నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు వస్తాయని భావిస్తున్నామన్నారు. కాగా, ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన నిజాయితీని నిరూపించుకోవాలని కేటీఆర్ ఈ సందర్భంగా కోరారు. పార్టీ మారితే ఆటోమేటిక్‌గా అనర్హత వర్తించాలని ‘పాంచ్‌న్యాయ్’ పేరును వల్లించిన రాహుల్ గాంధీ.. రాజ్యాంగ వ్యతిరేక చర్యలను అడ్డుకుని తన చిత్తశుద్ధిని చాటుకోవాలన్నారు. పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మరో పార్టీలో చేరితే తప్పుబడుతున్న రాహుల్ గాంధీ.. తెలంగాణలో పార్టీమారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరతారా? అని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. సుప్రీం తీర్పుపై ఎక్స్‌లో హర్షం వ్యక్తం చేసిన హరీశ్.. 52వ రాజ్యాంగ సవరణ ద్వారా దివంగత రాజీవ్ గాంధీ ప్రవేశపెట్టిన ఫిరాయింపుల నిరోధక చట్ట ప్రకారం ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని రాహుల్ గాంధీ ప్రతిపాదించాలని డిమాండ్ చేశారు. కాగా, సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్న బీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర.. సుప్రీంకోర్టు ఆదేశాలను స్పీకర్ పాటిస్తారనే ఆశాభావం వ్యక్తం చేశారు. సుప్రీం తీర్పు భవిష్యత్తులో పార్టీ ఫిరాయింపులకు అడ్డుకట్టగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. ఇక, సుప్రీంకోర్టు తీర్పుతోనైనా కాంగ్రెస్ పార్టీ కళ్లు తెరుచుకొని ప్రజాస్వామ్య పద్ధతులు పాటించాలని, ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసి ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. కాగా, ఉప ఎన్నికలు ఎలా వస్తాయి అధ్యక్షా? అంటూ ముఖ్యమంత్రినన్న అధికార మదంతో రేవంత్ రెడ్డి శాసనసభలో చేసిన వ్యాఖ్యలకు విరుద్ధంగా సుప్రీం కోర్టు తీర్పునివ్వడం చెంపపెట్టులాంటిదని అసెంబ్లీలో బీఆర్‌ఎస్ విప్ కేపీ వివేకానంద పేర్కొన్నారు. ఉప ఎన్నికలు ఎలా వస్తాయో సుప్రీం కోర్టు చెప్పిందని వివేకానంద వ్యాఖ్యానించారు.
స్పీకర్ నిర్ణయం తీసుకోకుంటే కోర్టు ధిక్కరణే బీఆర్‌ఎస్ న్యాయవాది మోహిత్ రావు
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మూడు నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే అది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని బీఆర్‌ఎస్ తరఫున సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది మోహిత్ రావు అన్నారు. ఎమ్మెల్యేలు విచారణను ఆలస్యం చేయడాన్ని స్పీకర్ కార్యాలయం అనుమతించకూడదని, ఒకవేళ ఎమ్మెల్యేలు ఆలస్యం చేస్తే తీవ్రంగా పరిగణించాలని కూడా సుప్రీంకోర్టు తెలిపిందని చెప్పారు. గతంలో చాలా కేసుల్లో ఎన్నికలు సమీపించినప్పుడు చర్యలు తీసుకున్న విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లామని వివరించారు. వాటి ఆధారంగానే ప్రస్తుతం ఈ కేసు విషయంలో ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్‌లా ఉండొద్దని సూచనలు ఇచ్చిందన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ పర్యటన.. ప్రశాంతి రెడ్డి రియాక్షన్
జగన్ జైలుకు వెళ్తారా అంటే.. లోకేష్ ఏమన్నారంటే..
For More Telangana News And Telugu News