Yadadri Bhuvanagiri: ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్‌లో పేలుడు
ABN , Publish Date - Jan 05 , 2025 | 04:21 AM
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూర్‌లోని ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్ కంపెనీలో శనివారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒక కార్మికుడు మృతి చెందగా, మరో ముగ్గురు గాయాలపాలయ్యారు.
ఒకరి మృతి, ముగ్గురికి గాయాలు
యాదాద్రి భువనగిరి జిల్లా పెద్దకందుకూర్‌లో ఘటన
యాదగిరిగుట్ట రూరల్, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూర్‌లోని ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్ కంపెనీలో శనివారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒక కార్మికుడు మృతి చెందగా, మరో ముగ్గురు గాయాలపాలయ్యారు. శనివారం ఉదయం 9.45 గంటల ప్రాంతంలో పీఆర్‌డీసీ విభాగం-3లోని (ఎంటీవీ) మెగ్నీషియం, టెఫ్లాన్, వైటాన్ అనే మూడు రసాయన పదార్థాలను (మొత్తం 450 గ్రాములు) కొలిచే సందర్భంలో భారీ పేలుడు సంభవించింది. ఈ సమయంలో విధులు నిర్వహిస్తున్న జనగాం జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రానికి చెందిన మార్క కనకయ్య (54) మృతి చెందగా.. యాదగిరిగుట్ట మండలం రామాజీపేట గ్రామానికి చెందిన మొగిలిపాక ప్రకాష్, వగపల్లి గ్రామానికి చెందిన నర్సింహులు, వేణుగోపాల్ తీవ్రంగా గాయపడ్డారు.
దీంతో హుటాహుటిన వారిని చికిత్స నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్‌స్టేషన్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఎంటీవీ రసాయన పదార్థాలను కొలిచే సందర్భంలో గ్యాస్ ఎనర్జీతో పేలుడు సంభవించిందని కంపెనీ ఆపరేషన్ డైరెక్టర్ దుర్గాప్రసాద్ తెలిపారు. ఈ విభాగంలో 16 మంది పనిచేస్తుండగా.. 10మంది కార్మికులు భోజనానికి బయటికి వచ్చారని, మరో నలుగురు అక్కడే ఉండి విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఘటనపై పూర్తి విచారణ తర్వాత ప్రమాదానికి కారణాలు వెల్లడిస్తామన్నారు. కాగా, మృతిచెందిన కార్మికుడు కనకయ్యకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమారుడు హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తుండగా.. కుమార్తె లండన్‌లో ఉద్యోగం చేస్తున్నారు. కనకయ్య 30 ఏళ్లుగా ఈ కంపెనీలో పని చేస్తున్నాడు.
ఇప్పటివరకు నలుగురి మృత్యువాత..
ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్ కంపెనీని 1985లో స్థాపించారు. నాటి నుంచి ఇప్పటివరకు పలుమార్లు ప్రమాదాలు జరిగాయి. 2011లో పేలుడు సంభవించినప్పుడు ఇద్దరు కార్మికులు, 2019లో మరో కార్మికుడు, ప్రస్తుత ప్రమాదంలో కనకయ్య మృతిచెందారు. దీంతో కార్మికుల్లో కొంత వరకు భయాందోళన మొదలైంది. ఈ కంపెనీ ప్రధానంగా ఎంటీవీని ఉత్పత్తి చేసి భారత రక్షణ దళాలకు సరఫరా చేస్తుంది.
చర్యలు తీసుకుంటాం: బీర్ల అయిలయ్య
ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్‌లో పేలుడువిషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య ఘటనా స్థలానికి చేరుకొని కంపెనీ డైరెక్టర్ దుర్గాప్రసాద్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కంపెనీ కేవలం లాభాలకోసం చూస్తుందే తప్ప కార్మికుల భద్రతను పట్టించుకోకపోవడం సరికాదన్నారు. కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. అనంతరం భువనగిరిలో చికిత్స పొందుతున్న కార్మికులను ఆయన పరామర్శించారు. కాగా పేలుడు విషయం తెలుసుకున్న స్థానిక ఏసీపీ రమే్‌షకుమార్ ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు.