Share News

Ramchander Rao: ఖమ్మం, నల్లగొండ మంత్రులు సీఎంను పని చెయ్యనివ్వట్లే!

ABN , Publish Date - Jul 30 , 2025 | 04:29 AM

ఖమ్మం, నల్గగొండ జిల్లాలకు చెందిన మంత్రుల బృందం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని పని చెయ్యనివ్వడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆరోపించారు.

Ramchander Rao: ఖమ్మం, నల్లగొండ మంత్రులు సీఎంను పని చెయ్యనివ్వట్లే!

  • 19 నెలల్లోనే రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత

  • 42 శాతం రిజర్వేషన్‌ బీసీలకు కాదు.. ముస్లింలకు!

  • ఖమ్మంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

  • కమ్యూనిస్టులు బీజేపీలో చేరాలని పిలుపు

  • ఎరువుల పంపిణీపై చర్చకు రావాలని మంత్రి తుమ్మలకు సవాల్‌

ఖమ్మం, జూలై 29 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): ఖమ్మం, నల్గగొండ జిల్లాలకు చెందిన మంత్రుల బృందం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని పని చెయ్యనివ్వడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆరోపించారు. 19 నెలల కాంగ్రెస్‌ పాలనలో రైతు బంధు సహా ఏ సంక్షేమ పథకం సక్రమంగా అమలు కావడం లేదన్నారు. దాంతో ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని పేర్కొన్నారు. ఎరువుల పంపిణీ అంశంలో చర్చకు సిద్ధమా అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు సవాలు విసిరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో మంగళవారం తొలిసారి ఖమ్మం వచ్చిన ఆయన స్థానికంగా నిర్వహించిన కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి బదులుగా కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ రాష్ట్రంలో పాదయాత్రలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన 42 శాతం బీసీ రిజర్వేషన్‌ బీసీలకు కాదని ముస్లిం రిజర్వేషన్‌ అని ఆరోపించారు. ముస్లింలకు బీజేపీ వ్యతిరేకం కాదన్న ఆయన.. ముస్లింలకు 10 శాతం ఈబీసీ రిజర్వేషన్‌, 4 శాతం రిజర్వేషన్‌ అమలులో ఉందని తెలిపారు. బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని, ఆర్డినెన్సు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కేంద్రంపై బురద చల్లుతూ ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు.


హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీలో బీసీల సీట్లలో 32మంది ఎంఐఎం అభ్యర్థులు గెలిచారని, తద్వారా బీసీల రిజర్వేషన్‌ కోటా బీసీలకు దక్కకుండా పోయే పరిస్థితి ఉందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీల పని అయిపోందన్న రాంచందర్‌రావు.. పశ్చిమబెంగాల్‌ నాయకులను స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రంలోని కమ్యూనిస్టు నేతలు బీజేపీలో చేరాలని పిలుపునిచ్చారు. ఖమ్మంను ఒకప్పుడు కమ్యూనిస్టుల గడ్డ అనేవారని, ఇకపై ఖమ్మం బీజేపీ అడ్డా కాబోతుందని తెలిపారు. ఇక, కేంద్ర ప్రభుత్వం ఎరువులు సక్రమంగా సరఫరా చేయడం లేదని జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలని కార్యకర్తలకు సూచన చేశారు. 2024-25లో 9.80 లక్షల మెట్రిక్‌టన్నుల యూరియా రాష్ట్రానికి వచ్చిందని, 2024లో 12.47లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా నిల్వ ఉందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం యూరియా అసలు ధర రూ.1990 ఉంటే బస్తాకు రూ.1423 సబ్సిడీ ఇచ్చిందని, డీఏపీ బస్తా రూ.2440 ఉంటే కేంద్రం రూ.1090 సబ్సిడీ ఇస్తోందన్నారు. ఎరువులు పంపిణీపై తనకు అవగాహన లేదన్న రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. దమ్ముంటే ఎరువులపై తనతో చర్చకు రావాలని సవాలు చేశారు. తాను చెప్పేది అసత్యమైతే బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని, అదే తుమ్మల తప్పయితే ఆయన తన పదవికి రాజీనామా చేయాలని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలని, ఇందుకు నేతలు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి

సుప్రీంకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట

హైదరాబాద్ అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ ఫోకస్

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 30 , 2025 | 04:29 AM