Share News

BJP: కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లది ఒకే ఎజెండా..

ABN , Publish Date - Feb 03 , 2025 | 04:51 AM

బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందంటూ ధర్నాలు, ఆందోళనలు చేసే కాంగ్రెస్‌, బీఆర్‌ఎ్‌సలది ఒకే ఎజెండా అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ విమర్శించారు.

BJP: కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లది ఒకే ఎజెండా..

  • పదేళ్లలో కేంద్ర సాయంపై చర్చకు సిద్ధమా..?

  • బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ సవాల్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందంటూ ధర్నాలు, ఆందోళనలు చేసే కాంగ్రెస్‌, బీఆర్‌ఎ్‌సలది ఒకే ఎజెండా అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ విమర్శించారు. పదేళ్ల యూపీఏ హయాంలో ఉమ్మడి ఏపీకి ఇచ్చిన నిధులు, మోదీ ప్రభుత్వం పదేళ్లలో తెలంగాణకు ఇచ్చిన నిధులపై చర్చకు సిద్ధమా అని సీఎం రేవంత్‌, కేసీఆర్‌, కేటీఆర్‌లకు సవాల్‌ విసిరారు. యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన కేసీఆర్‌.. తెలంగాణకు ఏం ఒరగబెట్టారని ప్రశ్నించారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో లక్ష్మణ్‌ మీడియాతో మాట్లాడారు. మోదీ ప్రభుత్వం తెలంగాణకు టెక్స్‌టైల్‌ పార్కు, గిరిజన వర్సిటీ, రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ, పసుపు బోర్డు, ఎయిమ్స్‌ వంటి ఎన్నో ప్రతిష్ఠాత్మక సంస్థలను మంజూరు చేసిందని తెలిపారు.


రీజినల్‌ రింగ్‌రోడ్డుకు వందశాతం నిధులు ఇస్తోందని. రూ.వెయ్యి కోట్లతో స్మార్ట్‌సిటీలను అభివృద్ధి చేస్తోందని, రాష్ట్రంలో లక్షా 10వేల కోట్లతో జాతీయ రహదారులను నిర్మిస్తోందని పేర్కొన్నారు. పదేళ్లలో బడ్జెట్‌తో సంబంధం లేకుండా కేంద్రం చేపట్టిన ప్రాజెక్టుల్లో ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమేనని చెప్పారు. రీజినల్‌ రింగ్‌రోడ్డు భూ సేకరణకు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చేతకావడం లేదని విమర్శించారు. పసుపు బోర్డు ఏర్పాటు చేసి నెల కూడా కాలేదని, దానికి కూడా నిధులు వస్తాయని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడెక్కడ విమానాశ్రయాలు అవసరమో సర్కారు ప్రతిపాదనలు పంపించాలని లక్ష్మణ్‌ కోరారు.

Updated Date - Feb 03 , 2025 | 04:51 AM