Share News

BJP Protest: సచివాలయం ముట్టడికి బీజేపీ యత్నం

ABN , Publish Date - Aug 23 , 2025 | 05:43 AM

సేవ్‌ హైదరాబాద్‌.. చలో సెక్రటేరియట్‌ పేరుతో బీజేపీ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సచివాలయం ముట్డడికి యత్నించారు.

BJP Protest: సచివాలయం ముట్టడికి బీజేపీ యత్నం

  • అడ్డుకున్న పోలీసులు.. 300 మందికి పైగా అరెస్టు

ఖైరతాబాద్‌, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): సేవ్‌ హైదరాబాద్‌.. చలో సెక్రటేరియట్‌ పేరుతో బీజేపీ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సచివాలయం ముట్డడికి యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఇక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలోని డ్రైనేజీ, కలుషిత నీరు, గుంతల రోడ్లు, విద్యుత్‌ తీగలతో జరుగుతున్న ప్రమాదాలు, విద్యుత్‌ దీపాలు వెలగకపోవడం తదితర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు చలో సెక్రటేరియట్‌కు పిలుపునిచ్చారు. బీజేపీ, బీజేవైఎం, మహిళా మోర్చా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సచివాలయానికి చేరుకుని ముట్టడికి యత్నించారు. పోలీసులు ముందస్తుగానే పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేసి ముట్టడికి యత్నించిన వారిని ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు. బండారు విజయలక్ష్మి ఆధ్వర్యంలో ప్రతినిధి బృందాన్ని సైఫాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్‌ గౌడ్‌, పూసరాజు, మాజీ జిల్లా అధ్యక్షుడు గౌతంరావు, ఎస్సీ మోర్చా నాయకుడు ప్రకాశ్‌ బిస్వాను పోలీసులు అరెస్టు చేశారు. దాదాపు 300 మందికి పైగా బీజేపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని నగరంలోని 9 పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. ఈ నేపథ్యంలో బీజేపీ శ్రేణులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరగడంతో పరిస్థితి కొంత ఉద్రిక్తంగా మారింది.


నేను బీజేపీ కార్యకర్తను కాదు... కాంగ్రెస్‌ ఎంపీ అనుచరుడిని

బీజేపీ శ్రేణుల అరెస్టుల నేపథ్యంలో ఓ హాస్యాస్పద సంఘటన జరిగింది. బీజేపీతో సంబంధం లేని ఓ వ్యకిని బలవంతంగా అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వ్యానులోకి ఎక్కించారు. దాంతో ఆయన వ్యాన్‌ లోపలికి వెళ్లాక నేను బీజేపీ కార్యకర్తను కాదు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఓ ఎంపీ అనుచరుడినని గట్టిగా కేకలు వేయడంతో పోలీసులు ఆయనను బయటకు దించి అరెస్టు చేస్తున్నప్పుడే ఆ విషయం చెప్పవచ్చు కదా అని మందలించి పంపించారు.


ఈ వార్తలు కూడా చదవండి

లైసెన్సు తీసుకున్న కేబుల్ తప్ప ఏవీ ఉంచొద్దు... హైకోర్టు కీలక ఆదేశాలు

అందుకే యూరియా ఆలస్యమైంది

Read Latest Telangana News and National News

Updated Date - Aug 23 , 2025 | 05:43 AM