Share News

Kaleshwaram project: కాళేశ్వరం కేసును సీబీఐకి ఇవ్వాలి

ABN , Publish Date - Aug 30 , 2025 | 12:58 AM

కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి వ్యవహారానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ దర్యాప్తు కోరాలని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

Kaleshwaram project: కాళేశ్వరం కేసును సీబీఐకి ఇవ్వాలి

  • వరద సహాయక చర్యల్లో సర్కార్‌ విఫలం

  • అసెంబ్లీ సమావేశాల్లో నిలదీస్తాం

  • బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

  • కాళేశ్వరం అవినీతి సొమ్మంతా విదేశాలకు!: పాయల్‌ శంకర్‌

హైదరాబాద్‌, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి వ్యవహారానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ దర్యాప్తు కోరాలని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ ప్రాజెక్టులో పెద్దఎత్తున అవినీతి జరిగిందంటూ ఎన్నికల ముందు ఆరోపణలు చేసిన కాంగ్రెస్‌ నేతలు, అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లయినా ఎందుకు నిందితులపై చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, ఆరు గ్యారంటీల అమల్లో వైఫల్యం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే కాంగ్రెస్‌ ప్రభుత్వం రోజుకో అంశాన్ని తెరపైకి తీసుకువస్తోందని మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. శనివారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో శుక్రవారం, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్‌.రాంచందర్‌రావు అధ్యక్షతన తొలిసారిగా ఈ సమావేశం జరిగింది. అనంతరం అసెంబ్లీ ఆవరణలోని పార్టీ శాసనసభాపక్ష కార్యాలయంలో బీజేపీ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. 420 హామీలతో పాటు 6 గ్యారంటీలకు చట్టబద్థత కల్పిస్తామంటూ సీఎం రేవంత్‌ రెడ్డి అ సెంబ్లీ సాక్షిగా చేసిన ప్రకటనను పూర్తిగా విస్మరించారని ఈ సందర్భంగా మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు.


‘ప్రజల సమస్యల నుండి దృష్టి మళ్లించడానికి కొత్త కొత్త అంశాలను తెరపైకి తీసుకువచ్చి నాటకాలతో ప్రజలను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లక్షకోట్ల అవినీతి జరిగిందని గత ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పదేపదే ఆరోపణలు చేసింది. బీఆర్‌ఎస్‌ హయాంలో జరిగిన అవినీతి సొమ్మును రికవరీ చేసి ఆ సొమ్ముతో సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని ప్రస్తుత సీఎం, నాడు టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్‌ రెడ్డి ప్రకటించినప్పటికీ, దాదాపు 2 సంవత్సరాల పాలన గడిచినా ఇప్పటివరకు అవినీతిపరులపై కేసులు నమోదు చేయలేదు. ఒక్క రూపాయి కూడా రికవరీ చేయలేదు’అని ఆరోపించారు. ఉత్తర తెలంగాణాలో భారీ వర్షాలు- వరదలతో అపారనష్టం జరిగిందని ఆయన పేర్కొంటూ సహాయక చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ఈ అంశంపై కూడా అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు.


దోషులకు శిక్షలు ఎప్పుడు?

కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై విచారణ కమిషన్‌ నివేదికకే 20 నెలలు పడితే ఇక దోషులకు ఎప్పుడు శిక్ష పడుతుందని బీజేఎల్పీ ఉప నేత పాయల్‌ శంకర్‌ ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టు అవినీతి వ్యవహారంలో సొమ్మంతా విదేశాలకు తరలిపోయిందని ఆయన ఆరోపించారు. ఈ సొమ్మును వెనక్కి తీసుకురావడం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని దర్యాప్తు సంస్థలకు సాధ్యం కాదని పేర్కొంటూ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్‌ చేస్తున్నట్లు శంకర్‌ చెప్పారు. నామినేటెడ్‌ పదవుల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌లు అమలు చేయడానికి ఏ చట్టాలు అడ్డువస్తున్నాయని ఆయన కాంగ్రె్‌సను ప్రశ్నించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Musi River Effect On Hyderabad: ఉగ్రరూపం దాల్చిన మూసీ.. నగరంలో పలుచోట్ల రాకపోకలు బంద్..

Rain Effect On Roads: భారీ వర్షాలతో 1039 కి.మీ మేర రోడ్లు ధ్వంసం..

Updated Date - Aug 30 , 2025 | 12:58 AM