Share News

C.P. Radhakrishnan: ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్‌

ABN , Publish Date - Aug 18 , 2025 | 03:45 AM

ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎవరన్న దానిపై ఉత్కంఠ వీడింది. మహారాష్ట్ర గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ పేరును బీజేపీ ఖరారు చేసింది. ఆదివారం ఢిల్లీలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది.

C.P. Radhakrishnan: ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్‌

మహారాష్ట్ర గవర్నర్‌ పేరును ఖరారు చేసిన బీజేపీ

  • రాధాకృష్ణన్‌ తమిళనాడుకు చెందిన మాజీ ఎంపీ

  • తెలంగాణ గవర్నర్‌గానూ కొన్నాళ్లు అదనపు బాధ్యతలు

  • ఆరెస్సెస్‌తో సుదీర్ఘకాలంగా అనుబంధం

  • వచ్చే ఏడాది తమిళనాడు శాసనసభ ఎన్నికలు

  • వ్యూహాత్మకంగా ఎంపిక చేసిన కమలం పార్టీ

  • ప్రతిపక్ష పార్టీలు కూడా మద్దతిస్తాయని అంచనా

  • ఇండీ కూటమిలోని డీఎంకే వ్యతిరేకించదనే యోచన

  • తమ అభ్యర్థిపై నేడు నిర్ణయం తీసుకోనున్న విపక్షాలు!

విజయం లాంఛనమే..!

పార్లమెంట్‌ ఉభయ సభల్లో ఉన్న వివిధ ఖాళీలతో కలిపి ప్రస్తుత సభ్యుల సంఖ్య 786. ఇందులో ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో మెజారిటీకి 394 మంది సభ్యుల మద్దతు అవసరం. ప్రస్తుతం లోక్‌సభలో ఎన్డీఏకు 293 మంది, రాజ్యసభలో 129 మంది సభ్యుల మద్దతు ఉంది. ఉభయ సభల్లో కలిపి ఎన్డీఏ బలం 422. ప్రతిపక్ష ఇండియా కూటమికి లోక్‌సభలో 234 మంది, రాజ్యసభలో 79 మంది సభ్యులు.. మొత్తంగా 313 మంది అనుకూలంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో సీపీ రాధాకృష్ణన్‌ విజయం లాంఛనమే కానుంది. మెజారిటీ లేకపోయినా.. తమ వాణి వినిపించాలని ఇండియా కూటమి భావిస్తోంది. ఎన్డీఏ తమ అభ్యర్థిని ప్రకటించిన నేపథ్యంలో ఇండియా కూటమి తరఫున అభ్యర్థి అంశంపై చర్చించేందుకు కూటమి నేతలు సోమవారం ఉదయం సమావేశమవుతారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే ఉప రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవమయ్యేందుకు ప్రతిపక్ష పార్టీలతో చర్చలు జరుపుతామని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు.

న్యూఢిల్లీ, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎవరన్న దానిపై ఉత్కంఠ వీడింది. మహారాష్ట్ర గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ పేరును బీజేపీ ఖరారు చేసింది. ఆదివారం ఢిల్లీలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, అమిత్‌ షాతోపాటు తెలంగాణకు చెందిన కె.లక్ష్మణ్‌ ఈ సమావేశానికి హాజరయ్యారు. సుధీర్ఘంగా చర్చించిన తర్వాత సీపీ రాధాకృష్ణన్‌ పేరుకు పార్లమెంటరీ బోర్డు ఆమోదం తెలిపింది. అనంతరం జేపీ నడ్డా మీడియా సమావేశంలో రాధాకృష్ణన్‌ పేరును ప్రకటించారు.


తమిళనాడుకు చెందిన చంద్రాపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్‌ 1957 మే 4న జన్మించారు. 1993 నుంచి 1998 వరకు ఆర్‌ఎ్‌సఎస్‌ ప్రాంత సంఘచాలక్‌గా పనిచేశారు. కోయంబత్తూరు లోక్‌సభ స్థానం నుంచి రెండుసార్లు బీజేపీ తరఫున ఎంపీగా ఎన్నికయ్యారు. తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగానూ పనిచేశారు. 2016 నుంచి 2019 వరకు ఆలిండియా కాయర్‌ బోర్డు చైర్మన్‌గా సేవలందించారు. 2023 ఫిబ్రవరి 18న ఝార్ఖండ్‌ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. 2024 మార్చి 19 నుంచి జూలై 31 వరకు తెలంగాణ గవర్నర్‌గా, పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. 2024 జూలై 27న మహారాష్ట్ర గవర్నర్‌గా నియమితులై కొనసాగుతున్నారు.


ధన్‌ఖడ్‌ అనూహ్య రాజీనామాతో..

2022లో ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన జగదీప్‌ ధన్‌ఖడ్‌.. అనారోగ్య కారణాలు చూపుతూ ఈ ఏడాది జూలై 21న అనూహ్యంగా పదవికి రాజీనామా చేయడంతో ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఉప రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్‌ విడుదల చేసింది. ఆగస్టు 7న నోటిఫికేషన్‌ ఇవ్వగా, 21 వరకు నామినేషన్లకు అవకాశం కల్పించింది. సెప్టెంబరు 9న పోలింగ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ప్రకటించిన అభ్యర్థికే తమ మద్దతు అని, అభ్యర్థి ఎవరనేదీ ఆయన అభీష్టమేనని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ప్రకటించాయి. ఈ నెల 6న జరిగిన సమావేశంలో టీడీపీ సహా కీలక భాగస్వామ్య పక్షాలన్నీ ఈ మేరకు ప్రకటనలు చేశాయి. అయితే 2026లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అదే రాష్ట్రానికి చెందిన సీపీ రాధాకృష్ణన్‌ను ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాధాకృష్ణన్‌ అభ్యర్థిత్వానికి ప్రతిపక్ష పార్టీల నుంచి కూడా మద్దతు లభిస్తుందని బీజేపీ భావిస్తోంది. విపక్ష ఇండియా కూటమిలో కీలకంగా ఉన్న తమిళనాడులోని అధికార డీఎంకే.. సీపీ రాధాకృష్ణన్‌ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించదని అంచనా వేస్తోంది.


చంద్రబాబు శుభాకాంక్షలు.. రాంచందర్‌రావు హర్షం..

హైదరాబాద్‌/అమరావతి, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్‌ను ఎంపిక చేయడం పట్ల బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ హర్షం వ్యక్తం చేసింది. సుదీర్ఘ అనుభవం కలిగిన రాధాకృష్ణన్‌ ఉప రాష్ట్రపతిగా అందరి మన్ననలు పొందుతారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీయే తరఫున ఎంపికైన సీపీ రాధాకృష్ణన్‌కు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. సీనియర్‌ రాజనీతిజ్ఞుడు, సుదీర్ఘకాలం దేశానికి సేవలందించిన గౌరవప్రదమైన నాయకుడు అయిన సీపీ రాధాకృష్ణన్‌ ఉప రాష్ట్రపతిగా నామినేషన్‌ వేయడాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏయూ మాజీ రిజిస్ట్రార్ల అరెస్ట్‌కు వారెంట్ జారీ

బిహార్ ఎన్నికలు.. కొత్త కుట్ర: ఎంపీ రాహుల్ గాంధీ

Updated Date - Aug 18 , 2025 | 03:45 AM