Share News

Bhu Bharati Applications: భూ భారతి దరఖాస్తుల స్వీకరణ పూర్తి

ABN , Publish Date - May 01 , 2025 | 06:24 AM

భూ భారతి చట్టం ప్రయోగాత్మక అమలుకు ఎంపిక చేసిన నాలుగు మండలాల్లో దరఖాస్తుల స్వీకరణ బుధవారంతో పూర్తయింది. కామారెడ్డి, ఖమ్మం, ములుగు, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో 15 రోజుల వ్యవధిలో వేల సంఖ్యలో దరఖాస్తులు అందాయి.

Bhu Bharati  Applications: భూ భారతి దరఖాస్తుల స్వీకరణ పూర్తి

కామారెడ్డి/ఖమ్మం/ములుగు/మహబూబ్‌నగర్‌, ఏప్రిల్‌ 30: భూ భారతి చట్టం ప్రయోగాత్మక అమలుకు ఎంపిక చేసిన నాలుగు మండలాల్లో బుధవారంతో దరఖాస్తుల స్వీకరణ పూర్తయింది. కామారెడ్డి జిల్లా లింగంపేట, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి, ములుగు జిల్లా వెంకటాపూర్‌, నారాయణపేట జిల్లా మద్దూరు మండలాల్లో ఈ నెల 17 నుంచి బుధవారం వరకు నిర్వహించిన సదస్సుల్లో రైతుల నుంచి వివిధ సమస్యలపై వేలల్లో దరఖాస్తులు వచ్చాయి. లింగంపేటలో 3700, నేలకొండపల్లిలో 2,900, వెంకటాపూర్‌లో 4,555, మద్దూరులో 1,341 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. లింగంపేటలో అసైన్డ్‌ భూములు, కొత్త పట్టాదారు పాస్‌ పుస్తకాలకు సంబంధించి ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. నేలకొండపల్లిలో వెయ్యి మందికి పైగా సాదా బైనామా సమస్యలను పరిష్కరించాలని దరఖాస్తు చేసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని పాత పాసు పుస్తకాలు తీసుకుని కొత్తవి ఇవ్వాలంటూ వెంకటాపూర్‌లో 900 మంది రైతులు అర్జీలు పెట్టుకున్నారు. మద్దూరులో అత్యధికంగా సర్వే నెంబర్ల సవరణ కోసం 491 దరఖాస్తులు అందాయి.

Updated Date - May 01 , 2025 | 06:26 AM