Bhatti Vikramarka: పోలీసు క్వార్టర్లపై ప్రతిపాదనలు పంపండి
ABN , Publish Date - Feb 23 , 2025 | 04:10 AM
రాష్ట్రంలో పోలీసు క్వార్టర్లను నిర్మించాల్సిన అవసరం ఉందని, ఎక్కడెక్కడ అవసరాలున్నాయో వెంటనే ప్రతిపాదనలు పంపాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క పోలీసు శాఖను ఆదేశించారు.

పోలీసు శాఖ బడ్జెట్‌పై సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పోలీసు క్వార్టర్లను నిర్మించాల్సిన అవసరం ఉందని, ఎక్కడెక్కడ అవసరాలున్నాయో వెంటనే ప్రతిపాదనలు పంపాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క పోలీసు శాఖను ఆదేశించారు. పోలీసు శాఖ బడ్జెట్ ప్రతిపాదనలపై సచివాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతి పౌరుడూ సురక్షితంగా జీవించాలని, దానికి తగినట్లు పోలీసు శాఖ భద్రత ప్రజలకు కల్పించాలని, ఆ శాఖ అవసరాలను పరిష్కరిస్తామని చెప్పారు. వాతావరణం, ఉపాధి అవకాశాల నేపథ్యంలో హైదరాబాద్‌కు, రాష్ట్రానికి వలసలు పెరుగుతున్నాయని, ఈ దృష్ట్యా పటిష్టమైన భద్రత కల్పించడంలో పోలీసు శాఖ సిద్ధం కావాలని సూచించారు.
కాగా, కాంగ్రెస్ ద్వారానే సామాజిక న్యాయం జరుగుతుందని, దేశంలో బీసీ జనాభాను ఇప్పటివరకు శాస్త్రబద్ధంగా తేల్చలేదని, కానీ.. తెలంగాణ ప్రభుత్వం మొదటిసారిగా తేల్చిందని భట్టి అన్నారు. బీసీ కుల గణనను ఏ సర్వేతోనూ పోల్చలేరని, 2011లో జరిగిన జనగణనలో కేవలం ఎస్సీ, ఎస్టీ, ఇతర జనాభా లెక్కలనే వెల్లడించారని చెప్పారు. శనివారం ప్రజాభవన్‌లో జరిగిన బీసీ నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాము చేపట్టిన బీసీ కుల గణన వివరాలను ఆయా వర్గాల ప్రయోజనం కోసం వినియోగిస్తామని ఆయన చెప్పారు.