Bharat Summit 2025: ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఖండిస్తాం
ABN , Publish Date - Apr 27 , 2025 | 03:41 AM
ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న దేశాల చర్యలతోపాటు ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఖండిస్తున్నట్లు భారత్ సదస్సు-2025 ప్రకటించింది.

ప్రజాస్వామ్య, కార్మిక ఉద్యమాలకు మద్దతిస్తాం
భవిష్యత్తు తరాల కోసం శాంతియుత పంథాలో సాగుతాం
ప్రజాస్వామ్యాన్ని నియంతృత్వ ప్రభుత్వాలు దెబ్బతీస్తున్నాయి
గళమెత్తే వారిపై నిఘా పెడ్తున్నయ్
మీడియాను తప్పుదోవ పట్టిస్తూ అబద్ధాల ప్రచారం
భారత్ సదస్సు-2025 తీర్మానం
హైదరాబాద్, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న దేశాల చర్యలతోపాటు ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఖండిస్తున్నట్లు భారత్ సదస్సు-2025 ప్రకటించింది. ప్రపంచంలోని ప్రగతిశీల శక్తులతో కలిసి ప్రజాస్వామ్య, కార్మిక ఉద్యమాలకు ప్రాతినిధ్యం వహిస్తూ సమన్యాయానికి కట్టుబడి ఉంటామని తెలిపింది. స్థిరమైన ప్రగతి, భవిష్యత్తు తరాల కోసం శాంతియుత పంథాలో ముందుకు సాగుతామంటూ తీర్మానం చేసింది. నియంతృత్వ ప్రభుత్వాలు ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తూ.. స్వాతంత్య్ర కాంక్షను నియంత్రిస్తున్నాయని, అబద్ధాలను వాప్తి చేస్తూ, విభజన వాదాన్ని ప్రేరేపిస్తూ పౌరహక్కుల అణచివేతకు పాల్పడుతున్నాయని ఆరోపించింది. ఇలాంటి చర్యల వల్ల అసమానతలు పెరుగుతాయని, నియంతృత్వ ప్రభుత్వాలు విమర్శకులను నియంత్రించడానికి చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నాయని పేర్కొంది. సోషల్ మీడియాతోపాటు సంప్రదాయ మీడియాను తప్పుదోవ పట్టిస్తూ.. విభేదించేవారిపై, హక్కుల కోసం గళమెత్తే వారిపై నిఘాపెడుతున్నాయని తీర్మానంలో భారత్ సదస్సు ఆక్షేపించింది. చట్టాన్ని అనియంత్రిత అధికారంతో కట్టడి చేస్తుండటం అవినీతికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. మైనారిటీలు, శరణార్థులు, వలసదారుల విషయంలో అనుసరిస్తున్న క్రూర విధానంపై ఆందోళ న చెందుతున్నామని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా అణచివేయబడుతున్న ప్రజాస్వామ్య ఉద్యమాలకు అండగా నిలుస్తామని, యుద్ధం కన్నా శాంతిని కోరుకుంటామని పేర్కొంది. రాష్ట్రాల అంతర్గత వ్యవహరాల్లో జోక్యం చేసుకోకుండా, అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలని కోరుకుంటున్నామని స్పష్టం చేసింది. కార్పొరేట్ గుత్తాఽధిపత్యాన్ని, క్రోనీ క్యాపిటలిజాన్ని, ట్యాక్స్ హెవెన్ దేశాల్లో నల్లధనం దాచడాన్ని వ్యతిరేకిస్తామని తెలిపింది. పర్యావరణ పరిరక్షణ, ధరిత్రిని కాపాడుకోవడానికి ప్రపంచదేశాలు తీసుకుంటున్న అన్ని చర్యలకు మద్దతుగా ఉంటామని ప్రకటించింది. సంఘీభావం, అహింస, సత్యం, న్యాయం ద్వారా ఈ వసుధైక కుటుంబంలో అందరికీ సమన్యాయం ఉండాలని కోరుకుంటున్నామని, సమాన అవకాశాలను పెంపొందించడానికి, జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి, తరాల పేద రికాన్ని రూపుమాపడానికి ఆర్థిక విధాన పునర్నిర్మాణం అవసరమని భావిస్తున్నామని వివరించింది.
తలసరి ఆదాయమే అభివృద్ధికి ప్రామాణికమా?
కార్పొరేట్ శక్తులను నియంత్రించాలి: ఆర్థికవేత్త కౌశిక్ బసు
దేశ సంపదను జీడీపీలో లెక్కించి, తలసరి ఆదాయన్ని బట్టి దేశాభివృద్ధిని ప్రకటించి సంబరాలు చేస్తున్నారని ప్రముఖ ఆర్థికవేత్త కౌశిక్ బసు విమర్శించారు. తలసరి ఆదాయమే అభివృద్ధికి ప్రామాణికమా అని ప్రశ్నించారు. ‘ఎకనామిక్ జస్టిస్ ఇన్ అన్‌సెర్టన్ టైమ్స్’పై జరిగిన చర్చలో ఆయన పాల్గొని మాట్లాడారు. వరల్డ్ బ్యాంక్ లెక్కల ప్రకారం అట్టడుగు నుంచి 40 శాతం వర్గం ప్రజల జీవన స్థితిగతులు, వారి తలసరి ఆదాయం పరిగణనలోకి తీసుకుంటే దేశాభివృద్ధి తెలుస్తుందని అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం కొన్ని కార్పొరేట్ శక్తుల ఆధీనంలో ఉందని, ఆ శక్తులను నియంత్రించాల్సిన అవసరముందని అన్నారు. దేశాలు కార్పొరేట్ శక్తులను నియంత్రించినప్పుడే ఆర్థిక సమానత్వాన్ని సాధిస్తాయని ఆయన తెలిపారు. పరిగి ఎమ్మెల్యే రాంమోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. ధనవంతుడు ఇంకా ధనవంతుడవుతుంటే పేదోడు మరింత పేదోడిగా మిగిలిపోతున్నాడని ఆవేదన వ్యక్తంచేశారు.
ఇవి కూడా చదవండి
Butta Renuka: ఆస్తుల వేలం.. వైసీపీ మాజీ ఎంపీకి బిగ్ షాక్
Human Rights Demad: కాల్పులు నిలిపివేయండి.. బలగాలను వెనక్కి రప్పించండి.. పౌరహక్కుల నేతలు డిమాండ్
Read Latest Telangana News And Telugu News