Share News

Miss World 2025: అందాల బొమ్మలు.. కన్నీటి చెమ్మలు!

ABN , Publish Date - May 26 , 2025 | 05:04 AM

మహిళల ప్రాణాలను హరించే ఆటవిక ఆచారాలను భరించింది ఓ వనిత. అదృష్టవశాత్తు బతికిన ఆమె.. కొండంత ధైర్యం తెచ్చుకుంది. ఆ దేశంలో మహిళల మాన, ప్రాణాలను దెబ్బతీసేలా ఉన్న మూఢాచారాలపై పోరాటాన్ని ప్రారంభించింది.

Miss World 2025: అందాల బొమ్మలు.. కన్నీటి చెమ్మలు!

  • ఏడేళ్ల వయసులోనే బాలికలకు సున్తీ.. ఆ దురాచారంపై పోరు

  • 16 ఏళ్లకే అత్యాచారం బారిన.. హక్కుల కోసం ఆరాటం

  • ఊహ తెలియనప్పుడే లైంగిక వేధింపులు.. వాటిపై పోరాటం

  • మిస్‌ వరల్డ్‌ పోటీదారుల్లో ఒక్కొక్కరిదీ ఒక్కో విషాద గాఽథ

  • విశ్వవేదికపై తమ వాణి వినిపించిన సుందరీమణులు

హైదరాబాద్‌ సిటీ, మే 25 (ఆంధ్రజ్యోతి): మహిళల ప్రాణాలను హరించే ఆటవిక ఆచారాలను భరించింది ఓ వనిత. అదృష్టవశాత్తు బతికిన ఆమె.. కొండంత ధైర్యం తెచ్చుకుంది. ఆ దేశంలో మహిళల మాన, ప్రాణాలను దెబ్బతీసేలా ఉన్న మూఢాచారాలపై పోరాటాన్ని ప్రారంభించింది. పదహారేళ్లకే అత్యాచారానికి గురైంది మరో మహిళ.. కొన్నేళ్ల తర్వాత ఆ క్షోభ నుంచి బయటపడిన ఆమె.. తమ దేశంలో బాలికల పట్ల జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా పనిచేస్తోంది. తెలిసీ తెలియని వయసులోనే లైంగిక వేధింపులు ఎదుర్కొంది ఓ బాలిక. కాస్త వయసు వచ్చేసరికి తమ దేశంలో ఇలాంటివి సర్వసాధారణంగా జరుగుతున్నాయనే విషయం ఆమెను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. ఇలాంటి వాటిని రూపుమాపాలనే లక్ష్యంతో ఒక సంస్థను ప్రారంభించి ప్రజలను చైతన్యం చేస్తోంది. పైన చెప్పిన అతివలు ఎవరో సామాన్య మహిళలు కాదు.. మిస్‌ వరల్డ్‌ కిరీటం కోసం పోటీ పడుతున్న సుందరీమణులు. ప్రస్తుతం అందాల పోటీల్లో మెరుస్తున్న అనేక మంది జీవితంలో ఈ స్థాయికి రావడానికి ఎన్నో కష్టాలు, వేధింపులను ఎదుర్కొన్నారు. అలాంటి కొంత మంది అతివల ఆవేదనాభరిత గాథలు వారి మాటల్లోనే..


రేపటిని మార్చగలం..

నిన్నటిని మార్చలేం. కానీ, ప్రయత్నిస్తే రేపటిని మార్చగలం. ఆ ప్రయత్నమే నేను చేస్తున్నాను. మాది సోమాలియా. కూడు, గూడు కోసం మా అమ్మనాన్నలు, నేను ఒంటెపై తిరుగుతూనే ఉండేవాళ్లం. మా దురదృష్టం, మేం ఎక్కడ ఉన్నా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించేవారు. అలా తిరుగుతూ చివరకు బ్రిటన్‌ వెళ్లి స్థిరపడ్డాం. అయినా, సోమాలియా అమ్మాయిగా ఆ దేశంలో బాలికల దుస్థితిని మార్చడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. సోమాలియాతో పాటు ఆఫ్రికా, మధ్య ప్రాశ్చ దేశాల్లో ఫిమేల్‌ జెనిటల్‌ మ్యుటిలేషన్‌(ఎ్‌ఫజీఎం)(ఆడవాళ్లకు సున్తీలాంటిది(ఖత్నా) ఓ దురాచారంగా కొనసాగుతోంది. సోమాలియాలో 98ు మంది మహిళలకు ఇది జరిగింది. మిగిలిన వారికి ఎందుకు కాలేదంటే, వారింకా ఆ వయసుకు రాలేదంతే. ఆ బాధితుల్లో నేనూ ఒకరిని. చాలా మందికి ఈ ఎఫ్‌జీఎం అంటే ఏమిటో తెలియదు. అలాంటి వారికోసమే నా అనుభవం చెప్పాలనుకుంటున్నాను. అప్పుడు నాకు ఏడేళ్ల వయసు. నేను ఆరు బయట ఆడుకుంటుండగా ఓ గదిలోకి తీసుకువెళ్లి బట్టలన్నీ విప్పేశారు. అక్కడ ముగ్గురు ఆడవాళ్లు నా కోసమే బ్లేడ్లు, కత్తెరలతో వేచి చూస్తున్నారు. వారేమీ డాక్టర్లు కాదు. వైద్య పరంగా శిక్షణ కూడా తీసుకోలేదు. వారు నా జననేంద్రియంపై చర్మాన్ని పూర్తిగా తొలగించారు. లోపలి చర్మం కూడా కొంత తీసేశారు. అరుస్తూనే ఉన్నాను. పట్టించుకునే వారే లేరు. పైగా నోర్మూసుకో.. అయిపోయింది.. ధైర్యం గా ఉండు.. ఇది జరుగుతున్నందుకు గర్వపడు.. ఇది మన సంప్రదాయం.. అంటూ చెప్పారు. కోత పూర్తయిన తర్వాత మందపాటి దారంతో కుట్టేశారు. కేవలం, మూత్రం, రక్తం పోవడానికి ఓ సన్నటి ద్వారం మాత్రమే ఉంచారు. నన్ను ఓ చీకటి గదిలో కాళ్లు చేతులు కట్టేసి వదిలేశారు. ఏడుస్తూనే ఉన్నాను. నేను బతికిబయటపడ్డానంటే అది నా అదృష్టం. ఎందుకంటే, ఈ ప్రక్రియ తర్వాత చాలా మంది బాలికలు చనిపోతారు కూడా. మా అమ్మ, బామ్మ అందరూ ఈ ఎఫ్‌జీఎం చేయించుకున్న వారే. ఆడవారికి ఈ బాధలు తప్పవనే వారు చెప్పేది. ఇది సంప్రదాయం, పాటించాలనే చెబుతుంటారు. అదెలా..? మూఢాచారాలు ఇంకెం త కాలం. అందుకే నేను పోరాటాన్ని ప్రారంభించాను. పర్యవసానాలు ఎలా ఉంటాయో తెలుసు. అయినా ఫౌండేషన్‌ను ప్రారంభించాను. చిన్నారుల శరీరం, ఆత్మను దెబ్బతీసేలా సంప్రదాయాలు ఉండకూడదు. మహిళలకూ హక్కులుంటాయని, వారి శరీరంపై వారికి నియంత్రణ ఉండాలనే ‘ఫిమేల్‌ ఇనీషియేటివ్‌ ఫౌండేషన్‌’ ప్రారంభించాను. నేను పడిన బాధలు మరే బాలికా పడకూడదనే పోరాటం సాగిస్తున్నాను.

- మిస్‌వరల్డ్‌ సోమాలియా, జైనాబ్‌ జామా


పదహారేళ్లప్పుడు రేప్‌కు గురయ్యాను

మనం చిన్నతనంలో ఎలా ఉన్నామన్నది కాదు.. యుక్త వయసుకు వచ్చాక మన ఆశలు, ఆశయాలను చేరుకోగలిగామా..? మనం కోరుకున్న జీవితాన్ని పొందగలిగామా..? అన్నది ప్రశ్నగానే మిగిలిపోతుంది. మరీ ముఖ్యంగా ఆఫ్రికా దేశాల్లో. నేను పుట్టి పెరిగిందంతా జాంబియాలోనే. యుక్తవయసుకు వచ్చాకే ఈ ప్రపంచం ఎలా ఉంటుందో తెలిసింది. నాకు 16 ఏళ్లు వచ్చేసరికి నాలోని స్వేచ్ఛను లాగేసుకున్నారు. పదహారేళ్లకే పెళ్లి చేశారు. పదహారేళ్లకే మానభంగానికీ గురయ్యాను. ఇన్నేళ్లుగా ఆ క్షోభను భరిస్తూనే గడిపేశాను. ఎందుకంటే, నాకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడే శక్తి నాకు లేదు. ఈ రోజు ఆ శక్తిని పొందగలిగాను. అందుకే ఎనిమిదేళ్ల తర్వాత ఈ సంఘటన గురించి చెబుతున్నాను. ఎందుకంటే, నేను జాంబియాలో అభాగ్యుల ప్రతిబింబంగా భావిస్తున్నాను. వారి కలలు కూడా ఛిద్రమయ్యాయి. వారిని కలల తీరాలకు చేర్చాలన్నదే నా ప్రయత్నం. మన నుంచి ఏదైనా తీసుకోగలరమో కానీ, విద్య, నైపుణ్యాలను మాత్రం తీసుకువెళ్లలేరు. చాలా మంది చెబుతుంటారు, ఈ ప్రపంచాన్ని ఎవరూ మార్చలేరని. నిజమే, మనం పరిపూర్ణత కోసం వెంపర్లాడుతున్నాం కానీ, మనం చెప్పాల్సిన కథనం మార్చాల్సి ఉంది. విద్యతోనే జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం మనకు శక్తినిస్తుంది. ఆ శక్తే మనం కోరుకున్న సమాజానికి నాంది పలుకుతుంది. దానికోసమే నా తపనంతా.

- మిస్‌ వరల్డ్‌ జాంబియా, ఫెయిత్‌ బ్వాల్యా


లైంగిక వేధింపులపై పోరాడుతున్నా..

23.jpg

మా దేశంలో పిల్లలపై లైంగిక వేధింపులు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఒక్క పనామాలో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ ఘటనలు పెరుగుతున్నాయి. అయినప్పటికీ ఏ ఒక్కరూ మాట్లాడటం లేదు. ఈ తరహా వేధింపులు నేనూ ఎదుర్కొన్నాను. నిజానికి ఈ వేధింపుల బారిన పడ్డానని కూడా తెలియని వయసులో నేను ఆ అనుభవాన్ని ఎదుర్కొన్నాను. ఈ తరహా లైంగిక వేధింపుల పట్ల అవగాహన కల్పిస్తే ఎన్నో ప్రాణాలను కాపాడవచ్చు. అందుకే ఫన్‌డియాంగ్‌ యునిడోస్‌ (యునైటెడ్‌ ఫర్‌ చిల్డ్రన్‌) ఫౌండేషన్‌ అధికార ప్రతినిధిగా ఈ అంశాల పట్ల అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాను. నాకు తెలిసి మనలో చాలామంది ఏదో ఒక వయసులో లైంగిక వేధింపుల బారిన పడిన వారే. అది మనకు ఊహ తెలిసినప్పుడు కావచ్చు లేదంటే అంతకంటే ముందు కావచ్చు. అది ఎందుకు తెలియదంటే, నిశ్శబ్దం. దీని గురించి చర్చించడానికి ఎవరూ ఇష్టపడకపోవడం. ఆ నిశ్శబ్దాన్ని చేధించాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే, మన సమాజంలో అతిపెద్ద సమస్య ఈ లైంగిక వేధింపులు. ఈ తరహా వేధింపుల గురించి మాట్లాడటం కష్టమే, కానీ, ఎక్కడో ఓ చోట ముగింపు పలకాలంటే, మాట్లాడాల్సిందే.

- మిస్‌వరల్డ్‌ పనామా, కరోల్‌ రోడ్రిగ్జ్‌


లింగ వివక్షకు వ్యతిరేకంగా గళమెత్తాను..

25.jpg

మిస్‌ వరల్డ్‌ గెలుస్తానా..? లేదా..? అన్నది అప్రస్తుతం. కానీ, తరతరాలుగా మహిళలు తీర్చిదిద్దుతున్న ఓ మహిళగా విశ్వ వేదికపై నా వాణిని వినిపించాలనుకున్నాను. మన అమ్మ, అమ్మమ్మ అందరూ తమ బాధను ఓ శక్తిగా మలచుకున్నారు. వారే తనను ఈ రోజు మీ ముందు ఇలా నిలిపారు. వారు ఎన్నో ఆకలి రాత్రులు గడిపారు. వారు తిన్నా తినకపోయినా నా కడుపు నింపేవారు. వారు మేల్కొన్నప్పటికీ నేను తనవితీరా నిద్రపోయే అవకాశం కల్పించేవారు. అయినప్పటికీ అకస్మాత్తుగా, ఓ రాత్రి వేళ తలుపులు గట్టిగా కొట్టిన శబ్దాలు.. తర్వాత మూగ రోదనలు. నాకేమీ అర్ధమయ్యేది కాదు. పొద్దుట చూసే సరికి అంతా నిశ్శబ్దం.. అది గృహ హింస. ఇక్కడ ప్రేమకూ నియమాలుంటాయి. భద్రతకు మాత్రం ఎలాంటి హామీ ఉండదు. అప్పుడే నేను అనుకున్నాను మహిళలకూ సాధికారిత కల్పించాలని. లింగ పరమైన వివక్షకు వ్యతిరేకంగా గళమెత్తాను. ఇంటి నుంచే మార్పు మొదలవ్వాలని మా సొంత పట్టణంలో ఈ కార్యక్రమం ప్రారంభించాను. ప్రతి మహిళకూ ఈ ప్రపంచంలో రక్షణ ఉందనే భావన కల్పించాలి. అదే నా ప్రయత్నం.

- మిస్‌ వరల్డ్‌ జమైకా, తజే లౌరికా బెన్నెట్‌


వివక్ష, వేధింపులపై పోరాడుతున్నా

25.jpg

సంగీతం మొదలు స్కేటింగ్‌, మోడలింగ్‌, మిలటరీ, టీచర్‌.. ఇప్పుడు మిస్‌ వరల్డ్‌ స్వీడన్‌.. ఎన్నో రంగాల్లో ప్రతిభ చాటాను. కానీ, ఓ అమ్మాయిగా నా జీవితం ఏమైనా మారిందా..? లేనే లేదు. అదే వివక్ష, వేధింపులు. 14 ఏళ్లప్పుడే నా కెరీర్‌ ప్రారంభమైంది. స్వీడిష్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ వాలెంటరీ డిఫెన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రైనింగ్‌లో కెరీర్‌ ప్రారంభమైంది. మగవారితో పోలిస్తే 10 రెట్లు ఎక్కువగా నేను కష్టపడాలని వెంటనే అర్థమైంది. ఎందుకంటే అమ్మాయిని. అయితే అదంతా కూడా స్వీడిష్‌ నేవీతో కలిసి యూరప్‌ అంతటా తిరిగినంత వరకే. అప్పుడే పురుషాధిక్య సమాజంలో ఓ మహిళకు ఏం కావాలో అర్థమైంది. ఆ నౌకలో 36 మంది సిబ్బంది ఉంటే ముగ్గురమే మహిళలం. ఓ రోజు మా కమాండింగ్‌ ఆఫీసర్‌ నన్ను పక్కకు లాక్కెళ్లి బలవంతం చేయబోయాడు. అప్పుడు నా వయసు 17 ఏళ్లు. అప్పుడే అనుకున్నాను నేను కాకపోతే ఇంకెవరు మార్పు తీసుకువస్తారని. అప్పుడే స్వీడిష్‌ సాయుధ దళాలలో అధికారాన్ని ఎంతగా దుర్వినియోగం చేస్తున్నారో ఓ పరిశోధనా వ్యాసం రాశాను. అలాగే ‘బూట్స్‌ టు హీల్స్‌’ అంటూ నా కథనే ఓ పుస్తకంగానూ రాయబోతున్నాను. నా లాంటి అమ్మాయిల రక్షణ కోసమే స్వీయ రక్షణ తరగతులను ప్రారంభించాను. పురుషాధిక్య సమాజంలో మహిళలు తమను తాము రక్షించుకోవాలంటే, లింగ సమానత్వం కావాలంటే ఇది తప్పనిసరి.

- మిస్‌ వరల్డ్‌ స్వీడన్‌, ఇసాబెల్‌ ఆస్‌


ఆదివాసీ ఆత్మ గౌరవ ప్రతీక..

26.jpg

కెనడా నుంచి ఓ ఆదివాసీ మహిళ మిస్‌వరల్డ్‌ వేదిక పైకి రావడం ఇదే తొలిసారి. ఇది నాకెంతో సంతోషాన్ని కలిగించే అంశం. నేను కెనడాలోని మారుమూల ప్రాంతంలో ఆదివాసీ తెగలో పుట్టాను. జనాభా మహా అయితే 600 ఉంటుంది. కెనడాలో మా తెగ అమ్మాయిలు, మహిళలు ఎదుర్కొనే కష్టాలు వర్ణనాతీతం. నేను దాదాపు 12సార్లు హత్య చేయబడి ఉండాలి. ఇప్పటికీ మా జాతి ప్రజలు కెనడాలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరీ ముఖ్యంగా రెసిడెన్షియల్‌ స్కూల్‌ వ్యవస్థ కారణంగా. మా ఇళ్ల నుంచి బలవంతంగా పిల్లలను తీసుకువెళ్లి ఈ స్కూల్స్‌లో చేర్పిస్తారు. మా భాష, సంస్కృతి అన్నింటినీ నాశనం చేస్తున్నారు. దాదాపు పదివేలకు పైగా మా జాతి ప్రజల సమాధులు ఈ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో ఉండి ఉంటాయి. మా ఆంటీ, అంకుల్‌ సమాధులు కూడా దానిలో భాగం. ఇవన్నీ చూస్తూ పెరిగిన నాకు అమ్మే స్ఫూర్తి. మనం పడే బాధకు కూడా ఓ మహోన్నత కారణం ఉండాలని ఆమె నూరిపోశారు. క్షమాగుణం గురించి తెలిపారు. ఇవే నన్ను ధైర్యంగా ముందుకు వెళ్లేందుకు, మా ఇంటిని ఓ వసతి గృహంలా మార్చేందుకు ప్రోత్సహించాయి. మేము ఓ 15 మంది పిల్లలకు వసతి కల్పించడంతో పాటుగా వారి జీవితాల్లో మార్పు తీసుకువచ్చాము. మిస్‌ వరల్డ్‌ పోటీలకు రావడానికి కారణం కూడా ఓ మహోన్నత లక్ష్యం కోసమే. మా జాతి సాధికారతకు కృషి చేయడానికి ఇక్కడి వరకూ వచ్చా. ‘రీ కనెక్టింగ్‌ విత్‌ రిబ్బన్స్‌’ అంటూ ఓ ప్రాజెక్టును ప్రారంభించాను. మా తెగలో రిబ్బన్‌ స్కర్ట్స్‌ ధరించడం సంప్రదాయం. ఈ ప్రాజెక్టుకు 10వేల డాలర్ల వరకు నిధులను సేకరించాను. ఒకవేళ మిస్‌ వరల్డ్‌ కిరీటం గెలిస్తే, అది ఓ చరిత్ర కావొచ్చు కానీ, ఇతరులు ఆ బాటలో నడిచేలా నేను మార్గం వేయలేకపోతే అది నిష్ఫలమేగా.

- ఎమ్మా మారిసన్‌, మిస్‌ వరల్డ్‌ కెనడా


చావు అంచుల వరకూ వెళ్లా..

26.jpg

కేమాన్‌ ఐల్యాండ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌లో ఉద్యోగిగా నేను అన్ని కార్యక్రమాలనూ నిర్వహిస్తుంటాను. మరీ ముఖ్యంగా యువత సమాజంలో మిళితమయ్యేందుకు తోడ్పడే రీతిలో ఈ కార్యక్రమాలుంటాయి. వారికి నైపుణ్యాలను నేర్పిస్తుంటాను. నేనో బాడీ బిల్డర్‌ను. జిమ్‌లో లేకపోతే ఓ మంచి పుస్తకంతో ఉంటా. లిటరేచర్‌ అభ్యసించిన నేను జర్నలి్‌స్టగానూ సేవలనందించాను. ఇవేవీ చేయనప్పుడు గాయనిని. ముఖ్యంగా కరావోకే. మా నగరంలో కరావోకే రాణిగా నాకు పేరుంది. అయితే ఇవన్నీ ఓ వైపు మాత్రమే. నేను డిప్రెషన్‌(కుంగుబాటు) బాధితురాలిని. కేమాన్‌ ద్వీపంలో ప్రతి ముగ్గురు విద్యార్థుల్లో ఒకరు తమ జీవితాలను అర్ధంతరంగా ముగిస్తున్నారు. అంతేనా, 13ు మంది ఆ ప్రయత్నాలను చేస్తున్నారు. నేను కూడా వారిలో ఒకరిని. పదహారేళ్ల్ల వయసులో యాంగ్జైటీ(ఆందోళన), డిప్రెషన్‌ బాధితురాలిని. నా చుట్టూ మనుషులు ఉండేవారు, కానీ ఒంటరిగానే భావించేదాన్ని. నేను అందరినీ చూసి నవ్వేదాన్ని. కానీ, లోలోపల ఏడుస్తూనే ఉండేదాన్ని. ఎన్నో నిద్రలేని రాత్రులు. జీవితమంతా విషాదమేనా అని భావిస్తున్న వేళ కుటుంబసభ్యులు అందించిన తోడ్పాటు, చికిత్స నన్ను ఆ ఆందోళనల నుంచి బయటపడేసింది. మన నిశ్శబ్దం మన జీవితాలకు ముగింపు పలకవచ్చేమో, ఆ నిశ్శబ్దాన్ని చేధిస్తేనే వెలుగులు ప్రసరిస్తాయి అన్న ఆలోచన నేను కొత్త జీవితాన్ని ప్రారంభించడానికీ కారణమైంది. ఒకప్పుడు నేను మా దేశంలోని ఎంతోమంది డిప్రెషన్‌ బాధితులలో ఒకరిని. ఇప్పుడు శారీరకంగా, మానసికంగానూ యువత ఫిట్‌గా ఉండేలా తోడ్పడుతున్నాను.

- జాడా రామూన్‌, మిస్‌ కేమాన్‌ ఐల్యాండ్‌


ఇవి కూడా చదవండి

Shashi Tharoor: పార్టీ కోసమే పని చేస్తున్నా.. క్లారిటీ ఇచ్చిన శశిథరూర్

ponnam prabhakar: తల్లిదండ్రులు వారి పిల్లలను శక్తి మేర చదివించాలి: పొన్నం

Updated Date - May 26 , 2025 | 05:59 AM