Share News

BC Bill: కేంద్రానికి బీసీ బిల్లులు

ABN , Publish Date - Apr 12 , 2025 | 03:38 AM

రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన రెండు బీసీ బిల్లులు రాష్ట్రపతి ఆమోదం నిమిత్తం కేంద్రానికి చేరినట్టు తెలిసింది.

BC Bill: కేంద్రానికి బీసీ బిల్లులు

  • న్యాయ సలహా తర్వాత పంపిన గవర్నర్‌

  • మార్చి 17న బిల్లులకు అసెంబ్లీ ఆమోదం

  • విద్య, ఉపాధి, స్థానిక సంస్థల ఎన్నికల్లో

  • బీసీలకు 42ు కల్పించేలా రూపకల్పన

  • సుప్రీంకోర్టు ఆదేశాలకు భిన్నంగా

  • 50ు దాటనున్న రిజర్వేషన్లు

  • కేంద్రం వెంటనే ఆమోదిస్తుందా, ఎలా స్పందిస్తుందన్న దానిపై ఆసక్తి

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన రెండు బీసీ బిల్లులు రాష్ట్రపతి ఆమోదం నిమిత్తం కేంద్రానికి చేరినట్టు తెలిసింది. రాష్ట్రంలో బీసీలకు విద్య, ఉపాధి, స్ధానిక ఎన్నికల్లో రిజర్వేషన్లను 42శాతానికి పెంచుతూ ప్రభుత్వం గత నెల 17న శాసనసభలో రెండు బిల్లులను ప్రవేశపెట్టగా.. అన్ని పార్టీల మద్దతుతో ఆమోదం పొందడం తెలిసిందే. అనంతరం ప్రభుత్వం ఈ రెండు బిల్లులను గవర్నర్‌కు పంపింది. మొత్తం రిజర్వేషన్లు 50శాతం దాటకూడదన్న సుప్రీంకోర్టు ఆదేశాలున్న నేపథ్యంలో.. గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ఈ రెండు బిల్లులపై న్యాయ నిపుణుల సలహా తీసుకున్నారు. అనంతరం రెండు రోజుల క్రితం ఈ బిల్లులను కేంద్రానికి పంపినట్టు సమాచారం. బీసీ బిల్లులకు కేంద్ర ఆమోదం కోసం రాష్ట్రంలోని అన్ని పక్షాలు ఉమ్మడిగా వెళ్లి ప్రధాని మోదీని కలుద్దామని అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్న సంగతి తెలిసిందే.


కేంద్రం ఎలా స్పందిస్తుందన్న దానిపై ఆసక్తి

రాష్ట్రంలో బీసీ బిల్లుల నేపథ్యంలో.. బీసీలకు 42శాతం, ఎస్సీలకు 15శాతం, ఎస్టీలకు 10శాతం మొత్తం రిజర్వేషన్లు 67శాతానికి చేరుతాయి. సుప్రీంకోర్టు నిర్దేశించిన 50శాతం గరిష్ఠ రిజర్వేషన్ల పరిమితి దాటిపోతుంది. ఈ క్రమంలో బీసీ బిల్లులకు కేంద్రం ఆమోదం లభిస్తుందా, లేదా అనేది ఆసక్తిగా మారింది. గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బీసీల రిజర్వేషన్లను 37శాతానికి పెంచుతూ ఆమోదించిన బిల్లును కేంద్రానికి పంపింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం దాన్ని ఉపసంహరించుకుంది. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో కాంగ్రెస్‌ ప్రకటించిన విధంగా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుకోసం కసరత్తు చేపట్టింది. వివిధ సంఘాలతో చర్చలు జరిపింది. కులగణన నిర్వహించింది. రాష్ట్రంలో బీసీలు 56.36 శాతం ఉన్నట్టు నిర్ధారించింది. బీసీలకు విద్య, ఉపాధి రంగాల్లో 42 శాతం రిజర్వేషన్ల కోసం ఒక బిల్లు, స్ధానిక సంస్ధల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించేలా మరో బిల్లు రూపొందించింది. వీటిని శాసనసభ, మండలిలో ప్రవేశపెట్టి ఆమోదం పొందింది.


ఎస్సీ వర్గీకరణకు ఇప్పటికే ఆమోదం..

రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన బిల్లును గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ పాస్‌ చేశారు. ఎస్సీ ఉప కులాలను మూడు విభాగాలుగా విభజించి మొత్తం 15శాతం రిజర్వేషన్లను వాటి మధ్య పంచుతూ ఆ బిల్లును రూపొందించారు. గవర్నర్‌ ఆమోదంతో డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.


ఇవి కూడా చదవండి..

సింహానికి చుక్కలు చూపించిన తేనెటీగలు..

సిట్‌ కస్టడీకి ‘కల్తీ నెయ్యి’ నిందితులు

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Apr 12 , 2025 | 03:38 AM