Share News

బీసీలు భళా!

ABN , Publish Date - Feb 07 , 2025 | 03:53 AM

పెద్దపల్లి జిల్లాలో 263 గ్రామ పంచాయతీలున్నాయి. రిజర్వేషన్‌ ప్రకారం బీసీలకు 70 సీట్లు కేటాయించారు. జనరల్‌ స్థానాల్లో మరో 74 మంది బీసీ అభ్యర్థులు గెలుపొందారు.

బీసీలు భళా!

  • రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో కోటాకు మించి ప్రాతినిధ్యం

  • పంచాయతీ, ఎంపీటీసీల్లో 33ు, జడ్పీటీసీల్లో 38.4ు

  • ఎస్టీ తండాలు, పెసా గ్రామాలను తీసేస్తే ఇంకా ఎక్కువ

  • గత పంచాయతీ ఎన్నికల్లో 41.5ు సీట్లలో విజయం

  • కొన్ని జిల్లాల్లో 40ు.. మరికొన్నిచోట్ల 50ు పైగా..

  • 42ు అమలైతే మరింత పెరగనున్న బీసీల ప్రాతినిధ్యం

  • నామినేటెడ్‌ పదవుల్లో బీసీలకు 34ు.. ఏపీ నిర్ణయం

హైదరాబాద్‌, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి జిల్లాలో 263 గ్రామ పంచాయతీలున్నాయి. రిజర్వేషన్‌ ప్రకారం బీసీలకు 70 సీట్లు కేటాయించారు. జనరల్‌ స్థానాల్లో మరో 74 మంది బీసీ అభ్యర్థులు గెలుపొందారు. దాంతో, ఇక్కడ బీసీ సర్పంచుల సంఖ్య 144. అంటే.. గ్రామ పంచాయతీల్లో బీసీ ప్రజా ప్రతినిధులు 54.75 శాతం. ఇదే జిల్లాలో ఎంపీటీసీ స్థానాలు 138 ఉండగా.. వాటిలో బీసీలకు 37 కేటాయించారు. మరో 39 జనరల్‌ స్థానాల్లోనూ బీసీలు విజయం సాధించారు. వెరసి, బీసీ ఎంపీటీసీల సంఖ్య 76కు.. వారి శాతం 55కు చేరింది. జడ్పీటీసీ సీట్లు 13 ఉండగా.. వాటిలో 4 రిజర్వ్‌ చేశారు. మరో రెండు జనరల్‌ సీట్లలో విజయం సాధించారు. జిల్లాలో జడ్పీటీసీల సంఖ్య ఆరుకు.. మొత్తం సీట్లలో వారి శాతం 46.15 శాతానికి చేరింది. ఈ జిల్లాలో అన్ని ఎన్నికల్లో బీసీల ప్రాతినిధ్యం ఎక్కువే. సంగారెడ్డి జిల్లాలో మొత్తం 647 గ్రామ పంచాయతీలు ఉండగా 175 బీసీలకు రిజర్వ్‌ అయ్యాయి. మరో 107 జనరల్‌ స్థానాల్లోనూ వారు విజయం సాధించారు. ఇక్కడ మొత్తం బీసీ సర్పంచుల సంఖ్య 282. అంటే, పంచాయతీల్లో బీసీ సర్పంచుల ప్రాతినిధ్యం 43.58ు. ఎంపీటీసీ స్థానాలు 295 ఉంటే.. వాటిలో బీసీలకు 61 కేటాయించారు. మరో 71 జనరల్‌ స్థానాల్లో గెలవడంతో వారి సంఖ్య 132కి చేరింది. అంటే, ఎంపీటీసీల్లో బీసీల ప్రాతినిధ్యం 44.74 శాతానికి పెరిగింది. ఇక, జిల్లాలోని 25 జడ్పీటీసీలకు 5 బీసీలకు కేటాయించగా.. మరో 3 జనరల్‌ స్థానాల్లో విజయం సాధించారు. జడ్పీటీసీల్లో వారి ప్రాతినిధ్యం 32 శాతానికి చేరింది. ...కొన్ని జిల్లాల్లో బీసీల ప్రాతినిధ్యం ఎక్కువ! మరికొన్ని జిల్లాల్లో తక్కువ! మొత్తంగా మాత్రం రిజర్వేషన్‌ కంటే అధికమే! సర్పంచి నుంచి జడ్పీటీసీ వరకూ ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి! ప్రస్తుతం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల విషయమై పెద్ద చర్చే నడుస్తోంది. కుల గణన తర్వాత బీసీలకు పార్టీపరంగా తాము 42 శాతం రిజర్వేషన్‌ కేటాయిస్తామని అధికార కాంగ్రెస్‌ ప్రకటించింది. అదే కోటాను చట్టపరంగా ఇవ్వాలని బీఆర్‌ఎస్‌, బీజేపీ డిమాండ్‌ చేస్తున్నాయి. రాజకీయ వాదోపవాదాలను పక్కనపెడితే.. అసలు స్థానిక సంస్థల్లో గత ఎన్నికల్లో గెలిచి.. మొన్నటి వరకు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలుగా ఉన్న వారి సంఖ్య ఎంత? వారి ప్రాతినిధ్య శాతం ఎంత? వారికి రిజర్వు చేసిన 23 శాతం మేరకే ఉన్నారా? ఎక్కువ తక్కువ ఏమైనా ఉన్నారా!? అన్న అంశం ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే.. స్థానిక సంస్థల్లో బీసీల ప్రాతినిధ్యంపై ‘ఆంధ్రజ్యోతి’ సమాచారం సేకరించింది. రాష్ట్రంలో 32 జిల్లాల్లోని (హైదరాబాద్‌ మినహా) వివరాలు పరిశీలిస్తే.. బీసీలు తమకు కేటాయించిన రిజర్వేషన్ల కంటే ఎక్కువగానే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాజకీయ చైతన్యంతో వారికి కేటాయించిన 23 శాతం రిజర్వుడ్‌ సీట్లలోనే కాకుండా అనేకచోట్ల జనరల్‌ స్థానాల్లోను గెలుపొందారు. రాజకీయంగా బలోపేతం అయ్యారు. కొన్ని జిల్లాల్లో అయితే, ఇప్పుడు ప్రకటించిన 42 శాతం కంటే కూడా ఎక్కువగానే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరికొన్ని జిల్లాల్లో 50 శాతానికిపైగా స్థానిక సంస్థల్లో బీసీల ప్రాతినిధ్యం కొనసాగుతుండడం గమనార్హం. ఎస్టీ తండాలు, పెసా పంచాయతీలను మినహాయించి లెక్కిస్తే బీసీల ప్రాతినిధ్య శాతం మరికాస్త పెరుగుతుంది. ఇప్పుడు బీసీలకు పార్టీలు 42 శాతం రిజర్వేషన్‌ను అమలు చేస్తే.. క్షేత్రస్థాయిలో వారి ప్రాతినిధ్యం మరికాస్త పెరిగే అవకాశం ఉంది.


పంచాయతీల్లో 41.5 శాతం

గత పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 41.5 శాతం స్థానాల్లో బీసీలు విజయం సాధించారు. రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ లెక్కల ప్రకారం.. గత ఎన్నికలనాటికి రాష్ట్రంలో 12,751 గ్రామ పంచాయతీలున్నాయి. వీటిలో ఎస్టీ తండాలు 1,177, పెసా చట్టం (షెడ్యూల్డ్‌ ఏరియాలో ఉన్న పంచాయతీలు 1,281) పోను మిగిలిన వాటిలో 23 శాతం రిజర్వేషన్ల చొప్పున 2,345 పంచాయతీలను బీసీలకు కేటాయించారు. రాజకీయ చైతన్యం.. ఆర్థికంగా అండదండలు.. స్థానిక పరిస్థితులు.. కారణాలు ఏవైనా తమకు కేటాయించిన స్థానాలతోపాటు పలుచోట్ల జనరల్‌ స్థానాల్లోనూ పోటీ చేసి గెలిచారు. రిజర్వుడ్‌, జనరల్‌ కలిపి రాష్ట్రవ్యాప్తంగా 4,274 పంచాయతీల్లో బీసీలు గెలుపొందారు. అంటే, మొత్తం గ్రామ పంచాయతీల్లో 33 శాతం.. ఎస్టీ తండాలు, పెసా చట్టం కింద ఉన్న గ్రామాలను మినహాయించి లెక్కిస్తే 41.5 శాతం స్థానాల్లో బీసీలు విజయం సాధించినట్లు అయింది. వెరసి, బీసీల కోటా 23 శాతమే అయినా.. దానికి మించి 18.5 శాతం స్థానాల్లో బీసీ అభ్యర్థులు సర్పంచ్‌లుగా గెలిచారు.

ఎంపీటీసీ.. జడ్పీటీసీల్లోనూ

రాష్ట్రంలో 5,781 ఎంపీటీసీ స్థానాలున్నాయి. వీటిలో ఎస్టీ తండాలు, పెసా చట్టం కింద మినహాయించిన తర్వాత 1,224 స్థానాలను బీసీలకు కేటాయించారు. కానీ, బీసీలు జనరల్‌ స్థానాల్లోను పోటీ పడి మరో 998 సీట్లలో విజయం సాధించారు. దీని ప్రకారం.. బీసీలు గెలిచిన ఎంపీటీసీల శాతం దాదాపుగా 38.5 శాతంగా ఉంది. ఎస్టీ తండాలు, పెసా చట్టం కింద మినహాయించిన స్థానాలను తీసేసి మిగిలిన స్థానాల్లో గెలిచిన బీసీల శాతం చూస్తే.. 41-42 శాతం ఉంటుందని అంచనా. ఇక, రాష్ట్రంలో 512 జడ్పీటీసీ స్థానాలు ఉండగా.. వాటిలోనూ బీసీలకు కేటాయించిన 23 శాతం కంటే ఎక్కువగానే గెలుపొందారు. సుమారు 33 శాతం బీసీలు జడ్పీటీసీలుగా పనిచేశారు.


జిల్లాలవారీగా పరిస్థితి ఇదీ..

  • జోగులాంబ గద్వాల జిల్లాలో మొత్తం గ్రామ పంచాయతీలు 255. వీటిలో బీసీలకు 80 స్థానాలు రిజర్వ్‌ చేశారు. వాటితోపాటు జనరల్‌ స్థానాల్లో 55 మంది విజయం సాధించడంతో బీసీ సర్పంచుల సంఖ్య 135కి చేరింది. అంటే, పంచాయతీల్లో బీసీల ప్రాతినిధ్యం 52.94. ఇక, 141 ఎంపీటీసీ స్థానాల్లో బీసీలకు 44 కేటాయించగా.. మరో 30 జనరల్‌ స్థానాలనూ కైవసం చేసుకున్నారు. ఈ జిల్లాలో 52.48 శాతం ఎంపీటీసీ స్థానాల్లో బీసీలదే ప్రాతినిధ్యం. జడ్పీటీసీ స్థానాలు 12 ఉండగా.. బీసీలకు ఐదు రిజర్వ్‌ చేశారు. మరో జనరల్‌ స్థానంలో విజయం సాధించడంతో ఆ సంఖ్య ఆరుకు చేరింది. దాంతో జడ్పీటీసీల్లో బీసీలు 50 శాతం దక్కించుకున్నట్లు అయింది.

  • భూపాలపల్లి జిల్లాలో 240 గ్రామ పంచాయతీలకు 51 బీసీలకు కేటాయించారు. జనరల్‌ స్థానాల్లో పోటీ చేసి 49 చోట్ల విజయం సాధించడంతో బీసీల సంఖ్య 100కి చేరింది. తద్వారా, ఇక్కడి పంచాయతీల్లో బీసీ సర్పంచులు 41.66 శాతానికి చేరారు. ఇక్కడ ఎంపీటీసీ స్థానాలు 102 ఉండగా.. బీసీలకు 23 కేటాయించారు. జనరల్‌ స్థానాల్లో 20 మంది గెలవడంతో వారి సంఖ్య 43కి చేరింది. అంటే, మొత్తం ఎంపీటీసీల్లో బీసీలు 48 శాతం. జడ్పీటీసీ స్థానాలు 11 ఉండగా.. బీసీలకు 2 కేటాయించగా.. జనరల్‌ స్థానాల్లో మరో ఇద్దరు విజయం సాధించారు. దాంతో, సంఖ్యాపరంగా వారి ప్రాతినిధ్యం నాలుగుకి; శాతాల్లో 36.3కి చేరింది.

  • నారాయణపేట జిల్లాలో గ్రామ పంచాయతీలు 280 ఉండగా.. బీసీలకు 84 రిజర్వ్‌ చేశారు. 47 మంది జనరల్‌ స్థానాల్లో విజయం సాధించడంతో ఇక్కడ బీసీ సర్పంచులు 131కి (46.78 శాతం) చేరారు. ఇక, 140 ఎంపీటీసీ స్థానాలకు బీసీలకు 52 కేటాయించారు. జనరల్‌ స్థానాల్లో

  • మరో 24 మంది గెలిచారు. మొత్తంగా 76 మంది ఎంపీటీసీలతో 54.28 శాతానికి చేరారు. 11 జడ్పీటీసీ స్థానాలకు నాలుగు బీసీలకు కేటాయించగా.. మరొక జనరల్‌ స్థానం దక్కించుకున్నారు. దీంతో, ఇక్కడ జడ్పీటీసీల్లో బీసీలు 45 శాతం దక్కించుకున్నారు.

  • జగిత్యాల జిల్లాలో గ్రామ పంచాయతీలు 379. వీటిలో బీసీలకు రిజర్వు చేసింది 94. జనరల్‌ స్థానాల్లో 91 మంది గెలవడంతో వారి సంఖ్య 185కి పెరిగింది. తద్వారా, ఇక్కడి పంచాయతీల్లో బీసీల ప్రాతినిధ్యం 48.81కి చేరింది. అలాగే, ఎంపీటీసీ స్థానాలు 214 ఉండగా.. బీసీలకు 58 రిజర్వు చేశారు. జనరల్‌ స్థానాల్లో మరో 36 మంది గెలిచారు. 94 మంది ఎంపీటీసీలతో 43.92 శాతం ప్రాతినిధ్యం దక్కించుకున్నారు. మొత్తం 18 జడ్పీటీసీల్లో ఏడు దక్కించుకోవడం ద్వారా 38.8 శాతం ప్రాతినిధ్యం దక్కింది.

  • సిద్దిపేట జిల్లాలో 501 గ్రామ పంచాయతీలకు 183 బీసీలకు కేటాయించారు. 57 జనరల్‌ స్థానాల్లోనూ వీరు గెలిచారు. మొత్తం 240 సర్పంచు పదవులతో 47.90 శాతం ప్రాతినిధ్యాన్ని దక్కించుకున్నారు. ఇక, ఎంపీటీసీ స్థానాలు 226 ఉండగా.. బీసీలకు 86 కేటాయిస్తే మరో 20 జనరల్‌ స్థానాల్లోనూ గెలిచారు. మొత్తంగా 106 ఎంపీటీసీ పదవులతో 46.90 శాతం ప్రాతినిధ్యం దక్కింది. అలాగే, ఈ జిల్లాలో 20 జడ్పీటీసీలు ఉన్నాయి. వీటిలో ఆరు బీసీలకు కేటాయించగా.. మరో మూడు జనరల్‌ స్థానాల్లో విజయం సాధించడంతో 9 చోట్ల వారిదే ప్రాతినిధ్యం. అంటే, జడ్పీటీసీల్లో 45 శాతం దక్కించుకున్నట్లయింది.

10.jpg


ఇవి కూడా చదవండి:


Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..

8th Pay Commission: ప్యూన్ నుంచి ఆఫీసర్ జీతాలు ఎలా పెరుగుతాయంటే.. నెలకు లక్షకుపైగా

RBI Report: దేశంలో క్రెడిట్, డెబిట్ కార్డులు ఎన్ని ఉన్నాయంటే.. వీటి వాడకంలో

IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..

Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 07 , 2025 | 03:53 AM