Share News

Bandi Sanjay: కోడ్‌ సాకుతో భరోసా ఆపే కుట్ర

ABN , Publish Date - Feb 01 , 2025 | 05:12 AM

బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఉన్న గల్లీకి గద్దర్‌ పేరు పెడతానని సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ అన్నారు.

Bandi Sanjay: కోడ్‌ సాకుతో భరోసా ఆపే కుట్ర

  • రైతు భరోసా సహా ఇటీవల ప్రారంభించిన అన్ని పథకాలనూ కొనసాగించాలి

  • గద్దర్‌ను జీవితాంతం అవమానించింది కాంగ్రెస్సే ఆయనపై ఉపా సహా 21 కేసులు పెట్టింది

  • గల్లీ పేరుతో చిల్లర రాజకీయాలు

  • తెలంగాణలో నక్సల్స్‌ బాధిత కుటుంబాల

  • బాధ కంటే రేవంత్‌కు రాజకీయాలే ముఖ్యం

  • కేంద్ర మంత్రి బండి సంజయ్‌ వ్యాఖ్యలు

హైదరాబాద్‌/న్యూఢిల్లీ, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఉన్న గల్లీకి గద్దర్‌ పేరు పెడతానని సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ అన్నారు. గద్దర్‌కు పద్మ అవార్డు ఇవ్వలేదనే కోపంతో ఆయన మాట్లాడిన మాటలు చిన్న పిల్లల చేష్టల్లా ఉన్నాయని తెలిపారు. సీఎం అహం చల్లారుతుందంటే.. ఆయన ఏ గల్లీ పేరునైనా మార్చుకోవచ్చని అన్నారు. రేవంత్‌కు అంత ఆసక్తి, ధైర్యం ఉంటే.. ముందు హైదరాబాద్‌ పేరును భాగ్యనగర్‌గా, నిజామాబాద్‌ పేరును ఇందూరుగా, ఆయన సొంత జిల్లా పేరును పాలమూరుగా మార్చాలని ఎక్స్‌ వేదికగా సంజయ్‌ డిమాండ్‌ చేశారు. ‘‘గద్దర్‌ను జీవితాంతం అవమానించింది కాంగ్రెస్‌ కాదా..? నక్సల్స్‌తో చర్చల సందర్భంగా గద్దర్‌ను మధ్యవర్తిగా ఉపయోగించుకున్నది ఎవరు..? ఆయనపై ఉపా కేసు పెట్టింది కాంగ్రెస్‌ కాదా..? గద్దర్‌పై 21 కేసులు పెట్టింది.. ఆయన పోలీస్‌ స్టేషన్ల చుట్టూ తిరిగేలా చేసింది ఎవరు..? దివంగత దుద్దిళ్ల శ్రీపాదరావు, చిట్టెం నర్సిరెడ్డి సహా అనేక మంది నేతలు, ఐపీఎస్‌ అధికారులు, ఎంతో మంది పోలీసుల కుటుంబాలు నక్సలిజం బాధితులు కాదా..? రాష్ట్ర హోం మంత్రిగా ఉన్న మీరు ఆ కుటుంబాల శోకాన్ని కనీసం పట్టించుకోకుండా మీ రాజకీయ ప్రయోజనాల కోసం ఇష్టమొచ్చినట్లు ఎలా మాట్లాడతారు..?’’ అని సంజయ్‌ ప్రశ్నించారు.


చిల్లర రాజకీయాలు మాని ఆరు గ్యారెంటీల అమలుపై దృష్టి పెట్టాలని రేవంత్‌కు సూచించారు. కాగా, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ సాకుతో రైతు భరోసా పథకాన్ని నిలిపివేసేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కుట్ర చేస్తోందని సంజయ్‌ ఆరోపించారు. రైతు భరోసా ఇప్పటికే కొనసాగుతున్న పథకమే అయినందున ఎన్నికల సంఘం నుండి ఎలాంటి ఇబ్బందులు ఉండబోవన్నారు. అవసరమైతే బీజేపీ పక్షాన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి ద్వారా ఎన్నికల సంఘానికి లేఖ పంపించేందుకు కూడా సిద్ధమని తెలిపారు. ఎన్నికల కోడ్‌ సాకుతో ఆయా పథకాలను నిలిపివేయాలని చూేస్త ఊరుకోబోమని హెచ్చరించారు.


వారంలోపే రాష్ట్ర అధ్యక్షుడి ప్రకటన..

బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లా పార్టీ అధ్యక్షుల ఎన్నిక కొలిక్కి వచ్చింది. 27 జిల్లాలకు పార్టీ కొత్త అధ్యక్షుల పేర్లు ఖరారయ్యాయి. పార్టీ సంస్థాగత నియమావళికి అనుగుణంగా శనివారం నామినేషన్లు స్వీకరించనున్నారు. ఆదివారం కొత్త అధ్యక్షులపై ప్రకటన వెలువడనుంది.

Updated Date - Feb 01 , 2025 | 05:12 AM