Bandi Sanjay: కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వలేదేం?
ABN , Publish Date - Jun 22 , 2025 | 03:52 AM
ప్రభుత్వ అధినేత చెబితేనే ఫోన్ ట్యాపింగ్ చేశామని రాధాకిషన్‌రావు వాంగ్మూలం ఇచ్చినా కేసీఆర్‌కు నోటీసులు ఎందుకివ్వడం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ నిలదీశారు. నాడు సీఎంవోతోపాటు సిరిసిల్ల కేంద్రంగానే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని విమర్శించారు.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం: సంజయ్
కరీంనగర్, జూన్ 21 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ప్రభుత్వ అధినేత చెబితేనే ఫోన్ ట్యాపింగ్ చేశామని రాధాకిషన్‌రావు వాంగ్మూలం ఇచ్చినా కేసీఆర్‌కు నోటీసులు ఎందుకివ్వడం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ నిలదీశారు. నాడు సీఎంవోతోపాటు సిరిసిల్ల కేంద్రంగానే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని విమర్శించారు. కరీంనగర్‌లోని అంబేడ్కర్ స్టేడియంలో శనివారం యోగా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సంజయ్.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. అనుమానం పుట్టిన తర్వాతే కేసీఆర్ పుట్టారని, చివరకు సొంత పార్టీ నాయకుల ఫోన్లను ట్యాప్ చేయించారని దుయ్యబట్టారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని, అందుకే కేసీఆర్, కేటీఆర్‌కు నోటీసులు ఇవ్వడం లేదన్నారు.వారిని కాపాడేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కేటీఆర్ అమెరికా వెళ్లిన తర్వాతే ప్రభాకర్‌రావు ఇండియాకు వచ్చి సరెండర్ అయ్యారని గుర్తు చేశారు. ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకే నాడు టెన్త్ హిందీ పేపర్ లీక్ పేరుతో అర్ధరాత్రి ఇంట్లోకి జొరబడి తనను అరెస్టు చేశారన్నారు. ప్రభాకర్‌రావుతో పోలీసులు మాట్లాడుతుంటే తాను స్వయంగా విన్నట్లు చెప్పారు. ఇప్పటికైనా ప్రభాకర్‌రావుకు రాచమర్యాదలు చేయడం మానుకోవాలని ప్రభుత్వానికి హితవు పలికారు. జడ్జిల ఫోన్లను ట్యాప్ చేస్తే సీబీఐ విచారణ కోరాల్సి ఉన్నా, కాంగ్రెస్ సర్కార్ మీనమేషాలు లెక్కిస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం కోరితే సీబీఐ విచారణ చేపట్టేందుకు కేంద్రం సిద్ధమేనని ప్రకటించారు. సీబీఐ విచారణకు గతంలోనే అంగీకరించి ఉంటే.. ట్యాపింగ్ కేసు నిందితులందరినీ చట్ట ప్రకారం జైలులో వేసే వాళ్లమన్నారు.
హిందూ ధర్మంపై దాడిగానే భావించాలి
తిమ్మాపూర్: మహిళలను కించపరస్తూ ఆంధ్రపదేశ్‌లో కొందరు చేసిన వ్యాఖ్యల వెనుక కుట్ర దాగి ఉందని సంజయ్ వ్యాఖ్యానించారు. తిమ్మాపూర్ మండలం రామకృష్ణకాలనీలో ఆయన మాట్లాడుతూ మహిళల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసి అన్యమతంలోకి మార్చుకోవాలనే కుట్ర జరుగుతోందన్నారు.
ఇవి కూడా చదవండి..
9వ రోజు కొనసాగుతున్న ఇజ్రాయెల్-ఇరాన్ వార్..దౌత్యం ఎప్పుడు
భారత్-పాక్ యుద్ధాన్ని ఆపినందుకు నోబెల్ బహుమతి పొందలేను
For International News And Telugu News