Share News

Bandi Sanjay: ముస్లింలను బీసీల్లో చేర్చితే ఒప్పుకోం

ABN , Publish Date - Feb 14 , 2025 | 04:18 AM

ముస్లింలను బీసీ జాబితాలో చేర్చడాన్ని తాము ఒప్పుకోబోమని, ఆ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపిస్తే తిరస్కరిస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ తేల్చిచెప్పారు.

Bandi Sanjay: ముస్లింలను బీసీల్లో చేర్చితే ఒప్పుకోం

  • కేంద్రానికి ఆ బిల్లు పంపితే తిరస్కరిస్తాం

  • కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సంజయ్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): ముస్లింలను బీసీ జాబితాలో చేర్చడాన్ని తాము ఒప్పుకోబోమని, ఆ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపిస్తే తిరస్కరిస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ తేల్చిచెప్పారు. ముస్లింలను బీసీ జాబితాలో చేర్చి కేంద్రానికి పంపించాలనుకోవడం మూర్ఖ త్వమని స్పష్టం చేశారు. ఈ ప్రతిపాదనలను కేంద్రం వ్యతిరేకించడం పక్కా అని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ ప్రతిపాదనలతో ఒరిగేదేమీ లేదని ఒక ప్రకటనలో తెలిపారు. ‘‘మతపరమైన రిజర్వేషన్లను బీజేపీ మొదటి నుంచీ వ్యతిరేకిస్తోంది. ఈ విషయం తెలిసి కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వం నెపాన్ని కేంద్రంపైకి నెట్టాలని చూస్తోంది. తద్వారా కొరివితో తలగోక్కునే ప్రయత్నం చేస్తోంది. దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదు. బీసీలపై కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ముస్లింలను బీసీల్లో చేర్చకుండా జాబితాను కేంద్రానికి పంపించాలి. లేనిపక్షంలో బీసీ సమాజం కాంగ్రెస్‌ పార్టీని క్షమించబోదు. అసలు కులగణన రీసర్వే ఏంటి..? పూర్తి చేయడమేంటి..? రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన 60 లక్షల మం దికి సంబంధించి క్షేత్రస్థాయి సర్వే చేస్తారా..? చెయ్యరా..? ప్రభుత్వం స్పష్టం చేయాలి.’’ అని సంజయ్‌ పేర్కొన్నారు.


మరో నాలుగు జిల్లాలకు బీజేపీ అధ్యక్షులు

బీజేపీ మరో నాలుగు జిల్లాలకు అధ్యక్షులను గురువారం ప్రకటించింది. గోల్కొండ గోషామహల్‌-టి. ఉమామహేంద్ర, మహబూబాబాద్‌- వల్లభు వెంకటేశ్వర్లు, సంగారెడ్డి- సి.గోదావరి, యాదాద్రి భువనగిరి- ఊటుకూరు అశోక్‌గౌడ్‌లను నియమించినట్లు పార్టీ సంస్థాగత ఎన్నికల అధికారి యెండల లక్ష్మీనారాయణ తెలిపారు.

Updated Date - Feb 14 , 2025 | 04:18 AM