Bandi Sanjay: ఐటీబీపీ జవాన్లూ.. మీ త్యాగాలు సజీవం
ABN , Publish Date - Aug 22 , 2025 | 04:29 AM
ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) జవాన్ల ధైర్య సాహసాలు మరువలేం. వారి కష్టాలను విస్మరించలేం’ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్
అరుణాచల్ సీఎం ఖండూతో భేటీ
హైదరాబాద్, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): ‘ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) జవాన్ల ధైర్య సాహసాలు మరువలేం. వారి కష్టాలను విస్మరించలేం’ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుకునే జవాన్లకు గౌరవ మర్యాదలతోపాటు సౌకర్యాలతో జీవించేందుకు కేంద్రం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈశాన్య రాష్ర్టాల పర్యటనలో భాగంగా సంజయ్.. గురువారం అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర సీఎం పెమాఖండూతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
ఖండూకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అక్కడి నుండి నేరుగా పపుంపుర జిల్లాలోని యుపియా గ్రామం వద్దనున్న ఐటీబీపీ 31వ బెటాలియన్ హెడ్‌క్వార్టర్స్‌ను సందర్శించారు. తొలుత అమరవీరుల ఘాట్ వద్ద పూలమాల వేసి వీరమరణం పొందిన ఐటీబీపీ జవాన్లకు నివాళి అర్పించారు. అనంతరం 31వ బటాలియన్ ఐటీబీపీకి సంబంధించి కొత్తగా నిర్మించిన పరిపాలన భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంజయ్ ప్రసంగించారు.
సర్కారు నిర్లక్ష్యం వల్లే గ్రామీణ రోడ్లు అధ్వానం
‘పల్లె పల్లెకు బీజేపీ’లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
చేవెళ్ల, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే గ్రామీణ రోడ్లు ధ్వంసమై నిత్యం రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చన్వ్‌ల్లి గ్రామంలో గురువారం ‘పల్లె పల్లెకు బీజేపీ (ప్రవాస యోజన) కార్యక్రమాన్ని ప్రారంభించిన రాంచందర్‌రావు రైతులతో ముఖాముఖీ నిర్వహించారు. ఖానాపూర్ గేట్ వద్ద జరిగిన యువ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్నారు. అదే గ్రామ దళిత రైతు ఇంట్లో భోజనం చేసి బస చేశారు. ఈ సందర్భంగా రాంచందర్‌రావు మాట్లాడుతూ.. ప్రధానమంత్రి సడక్ యోజన కింద దేశవ్యాప్తంగా ప్రతి గ్రామానికి పక్కా రోడ్ల నిర్మాణానికి కేంద్రం రూ.60 వేల కోట్ల నిధులు కేటాయించిందన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలు, రైతులకు కేంద్ర సంక్షేమ పథకాలు చేరవేస్తే కేంద్రానికి పేరొస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం ఆయా పథకాలను ప్రజల దరి చేరనివ్వడం లేదన్నారు. సాగునీటి విషయమై ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పేరుతో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అరచేతిలో వైకుంఠం చూపి మరిచిపోయిందని రాంచందర్‌రావు ఆరోపించారు. ఇక తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారు ప్రజలకు హామీ ఇచ్చిందే తప్ప అమలు చేయట్లేదన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎమ్మెల్యేలు ఇలా చేస్తే ఎలా.. సీఎం చంద్రబాబు ఫైర్
టీటీడీపై వైసీపీ బురద జల్లుతోంది.. జ్యోతుల నెహ్రూ ధ్వజం
Read Latest AP News and National News