Share News

Australia Beach Terror: ఆస్ట్రేలియా బాండి బీచ్ ఉగ్రవాది సాజిద్ అక్రమ్ హైదరాబాద్‌ వాడే!

ABN , Publish Date - Dec 16 , 2025 | 04:48 PM

ఆస్ట్రేలియాలోని సిడ్నీ బాండి బీచ్‌లో ఆదివారం జరిపిన ఉగ్రదాడిలో 15 మంది మరణించగా, 40 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఉగ్రదాడిలో పాల్గొన్న తండ్రీకొడుకుల్లో తండ్రి హైదరాబాద్‌కు చెందిన వాడు కావడం ఇప్పుడు సంచలనంగా మారింది.

Australia Beach Terror: ఆస్ట్రేలియా బాండి బీచ్ ఉగ్రవాది సాజిద్ అక్రమ్ హైదరాబాద్‌ వాడే!
Australia Beach Terror

ఆంధ్రజ్యోతి, డిసెంబర్ 16: ఆస్ట్రేలియాలోని సిడ్నీ బాండి బీచ్‌లో డిసెంబర్ 14న జరిగిన ఉగ్రదాడిలో 15 మంది మరణించగా, 40 మందికి పైగా గాయపడ్డారు. యూదుల హనుక్కా వేడుకలను లక్ష్యంగా చేసుకుని తండ్రీకొడుకులు సాజిద్ అక్రమ్ (50), నవీద్ అక్రమ్ (24) కాల్పులు జరిపారు. సాజిద్ ఘటనా స్థలంలోనే పోలీసుల కాల్పుల్లో మరణించగా, నవీద్ గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.


సాజిద్ అక్రమ్ హైదరాబాద్‌కు చెందినవాడు కావడం ఇప్పుడు సంచలనంగా మారింది. 1998లో స్టూడెంట్ వీసాపై ఆస్ట్రేలియాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. ఆ తర్వాత యూరోపియన్ సంతతికి చెందిన మహిళను వివాహం చేసుకున్నాడు. నవీద్ ఆస్ట్రేలియాలోనే జన్మించిన పౌరుడు. సాజిద్ వద్ద హైదరాబాద్ నుంచి జారీ చేసిన భారత పాస్‌పోర్ట్ ఉన్నట్టు ఆస్ట్రేలియా, ఫిలిప్పీన్స్ అధికారులు గుర్తించారు.


దాడికి ముందు నవంబర్‌లో తండ్రీకొడుకులు ఫిలిప్పీన్స్‌కు వెళ్లి వచ్చారు. అక్కడ ISIS-సంబంధిత ప్రాంతాల్లో శిక్షణ తీసుకున్నారనే అనుమానాలు ఉన్నాయి. వారి వాహనంలో ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోసివ్ డివైస్‌లు, హోమ్‌మేడ్ ISIS జెండాలు లభ్యమయ్యాయి. దాడి ISIS భావజాలం ప్రేరేపితమని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ప్రకటించారు.


ఈ ఘటనపై భారత నిఘా సంస్థలు సాజిద్ కుటుంబ సభ్యుల వివరాలు సేకరిస్తున్నాయి. విషయం తెలిసిన హైదరాబాద్‌లోని అతడి బంధువులు షాక్‌కు గురయ్యారు. దర్యాప్తు కొనసాగుతోంది.


తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం ఆస్ట్రేలియాకు వలస వెళ్లిన తర్వాత సాజిద్ అక్రమ్ ఆరుసార్లు ఇండియాకు వచ్చినట్లు గుర్తించారు. ఆస్తి విషయాలతో పాటు తల్లిదండ్రులను చూడటానికి సాజిద్ అక్రమ్ హైదరాబాద్ వచ్చినట్టు తెలుస్తోంది. అయితే, తండ్రి చనిపోయిన సమయంలో భారతదేశానికి సాజిద్ రాలేదని పోలీసులు చెప్తున్నారు.

సాజిద్ అక్రమ్ ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు కలిగి ఉన్నట్లు కుటుంబ సభ్యులకు తెలియదని పోలీసులు అంటున్నారు. సాజిద్ అక్రమ్, అతని కుమారుడు నవీద్ ఉగ్రవాదం వైపు వెళ్ళడానికి స్థానిక ప్రభావం లేదని గుర్తించారు. 1998 సమయంలో సాజిద్ అక్రమ్ పై భారతదేశంలో ఎటువంటి కేసులు లేవని పోలీసులు అంటున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తండ్రి చాటు బిడ్డగా రాజకీయాల్లోకి వచ్చిన కేటీఆర్

రూ.2.40లక్షలకు శిశువును అమ్మేసిన తల్లి.. తండ్రికి తెలియడంతో..

For More AP News And Telugu News

Updated Date - Dec 16 , 2025 | 05:08 PM