Share News

BC Reservation: బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదించండి

ABN , Publish Date - Sep 02 , 2025 | 02:24 AM

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు శాసనసభ ఆమోదించిన బిల్లుకు ఆమోదముద్ర వేయాలని అఖిలపక్ష నేతలు గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మను కోరారు. బీసీలకు 42 శాతం కల్పించేందుకుగాను...

BC Reservation: బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదించండి

  • గవర్నర్‌ జిష్ణుదేవ్‌ను కోరిన అఖిలపక్ష నేతలు

  • కాంగ్రెస్‌ నాయకత్వంలో గవర్నర్‌ వద్దకు

  • అఖిలపక్షంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వివేకానంద

  • ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకే బిల్లు: మహేశ్‌గౌడ్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు శాసనసభ ఆమోదించిన బిల్లుకు ఆమోదముద్ర వేయాలని అఖిలపక్ష నేతలు గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మను కోరారు. బీసీలకు 42 శాతం కల్పించేందుకుగాను స్థానిక సంస్థల్లో 50 శాతంగా ఉన్న రిజర్వేషన్ల పరిమితిని తొలగించేందుకు పంచాయతీరాజ్‌ చట్టం-2018లోని సెక్షన్‌ 285(ఏ)ను సవరించినట్లు తెలిపారు. ఈ మేరకు అధికార కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలో అఖిలపక్ష నేతలు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిశారు. వీరిలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌, మంత్రులు పొన్నం ప్రభాకర్‌, సీతక్క, కొండా సురేఖ, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్‌, బీర్ల ఐలయ్య, సీపీఐ జాతీయ నేత కె.నారాయణ, ఆ పార్టీ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతోపాటు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కె.పి.వివేకానందగౌడ్‌ కూడా ఉన్నారు. ఓవైపు కాళేశ్వరంపై విచారణను సీబీఐకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, దీనిపై కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొని ఉన్న నేపథ్యంలో.. అధికార పార్టీ నేతృత్వం వహించిన అఖిలపక్షంతో బీఆర్‌ఎస్‌ ప్రతినిధి గవర్నర్‌కు వద్దకు వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. గవర్నర్‌ను కలిసిన అనంతరం టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ మాట్లాడుతూ.. ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లను పెంచుతామంటూ ఇచ్చిన హామీ మేరకు బిల్లు చేశామని, ఆ బిల్లును ఆమోదించాలని గవర్నర్‌ను కోరామని చెప్పారు. రాష్ట్రంలో 56.33 శాతం బీసీ జనాభా ఉందన్నారు. దాని ప్రకారమే వారికి రిజర్వేషన్లు కల్పించేందుకు నిబంధనలను ఎత్తివేస్తూ గతంలో ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చామని, తాజాగా సభలో బిల్లును తీసుకువచ్చామని తెలిపారు. కులగణన సర్వే ప్రకారమే బీసీలకు స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల పెంపు కోసం బిల్లు తెచ్చామన్నారు. బీసీ సంఘాలు 42 శాతం రిజర్వేషన్‌ను కల్పించాలని పట్టుబడుతున్నాయని, ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకునే అఖిలపక్షం గవర్నర్‌ను కలిసి బిల్లును ఆమోదించాలని కోరిందని అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కేసీఆర్, హరీష్ రావు మధ్యంతర పిటిషన్లపై కొన్ని ఘడియల్లో విచారణ

తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీపై కమిటీ ఏర్పాటు

For More TG News And Telugu News

Updated Date - Sep 02 , 2025 | 02:24 AM