Share News

కీలక మునిసిపాలిటీలు ‘సీడీఎంఏ’ చేతిలోకి!

ABN , Publish Date - Jan 31 , 2025 | 03:55 AM

ఇటీవల పాలకవర్గాల గడువు ముగిసిన మునిసిపాలిటీలకు ప్రత్యేకాధికారులుగా పురపాలక సంచాలకుల కార్యాలయం (సీడీఎంఏ) అధికారులను నియమించడం, ఒక్కొక్కరికి రెండు, మూడు మునిసిపాలిటీల బాధ్యతలు అప్పగించడం చర్చనీయాంశమైంది.

కీలక మునిసిపాలిటీలు ‘సీడీఎంఏ’ చేతిలోకి!

  • జిల్లా కలెక్టర్లను కాదని ప్రత్యేకాధికారులుగా నియామకం

  • కొందరికి రెండు, మూడింటి బాధ్యతల అప్పగింత

హైదరాబాద్‌, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): ఇటీవల పాలకవర్గాల గడువు ముగిసిన మునిసిపాలిటీలకు ప్రత్యేకాధికారులుగా పురపాలక సంచాలకుల కార్యాలయం (సీడీఎంఏ) అధికారులను నియమించడం, ఒక్కొక్కరికి రెండు, మూడు మునిసిపాలిటీల బాధ్యతలు అప్పగించడం చర్చనీయాంశమైంది. సాధారణంగా కలెక్టర్లను ప్రత్యేకాధికారులుగా నియమిస్తుంటారు. ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే పరిష్కరించేందుకు, కీలక పనుల్లో జాప్యం లేకుండా నిర్ణయం తీసుకునే వెసులుబాటు ఉంటుంది. అయితే హైదరాబాద్‌ నగరానికి ఆనుకుని రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని సుమారు 14 మునిసిపాలిటీలకు సీడీఎంఏ కార్యాలయ అధికారులనే ప్రత్యేకాధికారులుగా నియమించారు. ఒక్కో అధికారిని రెండు, మూడు మునిసిపాలిటీలకు ఇన్‌చార్జిగా నియమించడంపై అంత ప్రత్యేకత ఎందుకునే దానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రత్యేకాధికారులు సీడీఎంఏ కార్యాలయం నుంచే పాలన చేయాలనుకుంటే ఇబ్బందులు తప్పవని పురపాలక శాఖ సీనియర్‌ అధికారులు చెబుతున్నారు.


ప్రత్యేకాధికారి స్థానికంగా ఉంటూ పర్యవేక్షణ చేయాలి. అప్పుడే ప్రతి వారం జరిగే ప్రజావాణిలో ఏవైనా ఫిర్యాదులు వస్తే వాటిని వెంటనే కలెక్టర్‌ నేతృత్వంలో పరిష్కరించేందుకు అవకాశం ఉంటుంది. అలాగే వారు పారదర్శకంగా నిర్ణయాలు తీసుకోగలరా సందేహాలను కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు ఏదైనా పనిమీద ప్రత్యేకాధికారిని కలవాలంటే సీడీఏంఏ కార్యాలయానికి రావడం కష్టమవుతుందని వారు చెబుతున్నారు. రంగారెడ్డి జిల్లా అమన్‌గల్‌, బండ్లగూడ జాగీర్‌, జల్‌పల్లి, నార్సింగ్‌, శంషాబాద్‌, శంకరపల్లి, తుక్కుగూడ, అమీన్‌పూర్‌, బొల్లారం, తెల్లాపూర్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా దుండిగల్‌, జవహర్‌నగర్‌, తూముకుంట మునిసిపాలిటీలు సీడీఎంఏ అధికారుల చేతిలో ఉన్నాయి. కాగా, సీడీఎంఏలోనే పని ఒత్తిడి అధికం ఉంటుందని, అమృత్‌, ఎల్‌ఆర్‌ఎస్‌ వంటి పథకాలపై సమీక్షలు నిర్వహిస్తుండాలని, అదనపు బాధ్యతలతో సతమతమవుతున్నాని కొందరు అధికారులు పేర్కొంటున్నారు.

Updated Date - Jan 31 , 2025 | 03:55 AM