Share News

Anganwadi Centres: గుడ్ల టెండర్లు ఖరారయ్యేనా..?

ABN , Publish Date - Jun 16 , 2025 | 03:49 AM

అంగన్‌వాడీ కేంద్రాలకు కోడి గుడ్ల సరఫరా, గుడ్ల ర్యాక్స్‌, టేబుళ్ల కొనుగోలుకు సంబంధించిన టెండర్ల నిర్వహణలో మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Anganwadi Centres: గుడ్ల టెండర్లు ఖరారయ్యేనా..?

  • నేడు బిడ్ల దాఖలుకు ఆఖరు.. రేపు ఓపెన్‌

  • ఎగ్‌ ర్యాక్‌ల టెండర్లు మళ్లీ 26కు వాయిదా

  • అంగన్‌వాడీ కాంట్రాక్టర్ల ఎంపికలో సాగదీత

హైదరాబాద్‌, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): అంగన్‌వాడీ కేంద్రాలకు కోడి గుడ్ల సరఫరా, గుడ్ల ర్యాక్స్‌, టేబుళ్ల కొనుగోలుకు సంబంధించిన టెండర్ల నిర్వహణలో మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాలు తిరిగి తెరచుకున్నా టెండర్లు సకాలంలో నిర్వహించి, కాంట్రాక్టర్లను ఎంపిక చేయకపోవడంపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది. అధికారుల ఉదాసీనత చిన్నారులు, గర్భిణులు, బాలింతల పోషకాహారంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నిబంధనల మార్పు పేరుతో గతంలో పలుమార్లు ఈ టెండర్ల ప్రక్రియను వాయిదా వేశారు. కొత్త గుత్తేదారులను ఎంపిక చేయకుండా పాతవారినే కొనసాగించడం వంటి చర్యలు అధికారుల నిర్లక్ష్యానికి అద్దంపడుతున్నాయి. టెండర్లు లేకుండానే టేబుళ్ల సరఫరాను జైళ్ల శాఖకు అప్పగించడంపైనా విమర్శలు వస్తున్నాయి.


మార్చిలోనే ముగిసిన పాత టెండరు..

రాష్ట్రంలో 35,781 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటి ద్వారా 19.60 లక్షల మంది చిన్నారులు, మహిళలు సేవలు పొందుతున్నారు. అంగన్‌వాడీలకు ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు గుడ్ల సరఫరాకు మార్చి 30న మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు టెండర్లు పిలిచారు. మొత్తం ఏడు జోన్లకు కలిపి 36.96 కోట్ల గుడ్ల సరఫరా టెండర్లకు బిడ్ల దాఖలు గడువు ఏప్రిల్‌ 10గా నిర్ణయించారు. వివిధ కారణాలతో ఏప్రిల్‌ 15, మే 15, జూన్‌ 16 వరకు గడువు పెంచుతూ వచ్చారు. సోమవారం గడువు ముగియనుంది. మంగళవారం బిడ్లను ఓపెన్‌ చేస్తారు. అయితే, ఈసారైనా కొత్త కాంట్రాక్టర్ల ఎంపిక జరుగుతుందా..? మళ్లీ వాయిదా పడుతుందా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి మార్చిలోనే టెండర్లు నిర్వహించి కొత్త గుత్తేదారులను ఎంపిక చేయాల్సి ఉంది. కానీ, వేసవి సెలవులు ముగిసి, అంగన్‌వాడీ కేంద్రాలు తెరచుకున్నా ఇంకా టెండర్ల ప్రక్రియ పూర్తి కాలేదు. గుడ్ల సరఫరా గడువు మార్చితోనే ముగియడంతో పాత గుత్తేదారులకే సరఫరా బాధ్యతలు అప్పగించారు. అంగన్‌వాడీలకు గుడ్ల ర్యాక్‌ల సరఫరా టెండర్ల నిర్వహణలోనూ తీవ్ర జాప్యమే జరుగుతోంది. గుడ్లను నిల్వ చేసుకోవడానికి మహిళా శిశు సంక్షేమ శాఖ సుమారు రూ.12 కోట్లతో టెండర్లు పిలిచింది. నోటిఫికేషన్‌ ప్రకారం ఏప్రిల్‌ 11 నాటికి టెండర్ల ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది. ఆ గడువును మే 26 వరకు పెంచి.. జూన్‌ 14కు వాయిదా వేశారు. మళ్లీ ఈ నెల 26కు పొడిగించారు.


ధర తేల్చకుండానే టేబుళ్ల సరఫరాకు ఓకే..

అంగన్‌వాడీలకు వచ్చే గర్భిణులు కూర్చోవడానికి 72 వేల టేబుళ్లను కొనాలని అధికారులు నిర్ణయించారు. అందుకు రూ.30 కోట్లు కేటాయించారు. ఈ టెండర్లను గత నెల 9న ఓపెన్‌ చేశారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పారిశ్రామికవేత్తలు(ఎంఎ్‌సఎంఈ)లు ఒక్కో టేబుల్‌ను రూ.2,600కు సరఫరా చేసేలా మిగిలిన వాళ్ల కంటే తక్కువకు కోట్‌ చేయగా.. సాంకేతిక కారణాల సాకుతో వాటిని రద్దు చేసి.. మళ్లీ టెండర్లు నిర్వహిస్తామని ప్రకటించారు. కానీ, టెండర్లు లేకుండా ఈ నెల 3న చంచల్‌గూడ జైలుకు తొలుత 25వేల టేబుళ్ల సరఫరా బాధ్యతను ఇటీవల బదిలీ అయిన డైరెక్టర్‌ కాంతి వెస్లీ అప్పగించారు. అందులో ఒక్కో టేబుల్‌ ధరను పేర్కొనలేదు. 50శాతం నిధులు అడ్వాన్స్‌గా చెల్లించడానికి సంబంధిత శాఖ అధికారులు అంగీకరించినట్లు తెలిసింది. కేంద్రాలకు అందించానుకున్న సెల్‌ఫోన్ల విషయంలో ఇంకా అడుగు పడలేదు.


ఈ వార్తలు కూడా చదవండి..

నీట్ యూజీ టాపర్లకు అభినందనలు తెలిపిన సీఎం

మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం..

For Telangana News And Telugu News

Updated Date - Jun 16 , 2025 | 03:49 AM