Amit Shah: నేడు రాష్ట్రానికి కేంద్ర హోం మంత్రి అమిత్‌షా
ABN , Publish Date - Jan 19 , 2025 | 04:54 AM
తెలుగు రాష్ట్రాల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆదివారం రానున్నారు.
పోలీసు అకాడమీలో షూటింగ్ రేంజ్‌కు శంకుస్థాపన
హైదరాబాద్, జనవరి 18 (ఆంధ్రజ్యోతి) : తెలుగు రాష్ట్రాల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆదివారం రానున్నారు. ఆయన ఆదివారం హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీ(ఎన్‌పీఏ)లో రూ.27 కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన ఇంటిగ్రేటెడ్ ఇండోర్ షూటింగ్ రేంజ్‌కు శంకుస్థాపన చేయనున్నారు. 50 మీటర్ల పొడవు... 10 వరుసల్లో ఉండే ఈ రేంజ్‌లో ఏకకాలంలో పదిమంది ఐపీఎస్ ప్రొబేషనరీ అధికారులకు తుపాకుల వినియోగంపై శిక్షణ ఇవ్వవచ్చు.
అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ రేంజ్ ఉంటుంది. కేంద్ర హోం మంత్రి అంతకు ముందు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం(ఎన్డీఆర్‌ఎఫ్) 20వ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొని... రూ.220 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు.