Land Encroachment: అక్రమ క్రమబద్ధీకరణపై కొరడా ఏదీ!?
ABN , Publish Date - Feb 18 , 2025 | 03:58 AM
‘‘జీవో 59 ముసుగులో బీఆర్‌ఎస్ పాలకులు రూ.వందల కోట్ల విలువైన భూములు మింగేశారు. ఒక్క రాయదుర్గంలోనే 8.29 ఎకరాలను తమ తొత్తుల పేరిట మార్చుకున్నారు. హైదరాబాద్‌లో మరోచోట ఎకరం రూ.100 కోట్లున్న భూమికి సంబంధించి 19 ఎకరాలను స్వాహా చేశారు.
అన్నీ సక్రమంగా ఉన్నవారికి మోక్షమేదీ!?
జీవో 59 కింద వచ్చిన దరఖాస్తులు ఎక్కడివక్కడే
అవకతవకలు పక్కాగా కనిపిస్తున్నా చర్యల్లేవు
మూడు జిల్లాల్లో అనుమతులు నిలిపివేస్తూ ఏడాది కిందట రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు
మిగిలిన జిల్లాల్లోనూ ముందుకు సాగని వైనం
ఆదాయం వచ్చే అవకాశమున్నా పరిష్కారం లేదు
హైదరాబాద్, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): ‘‘జీవో 59 ముసుగులో బీఆర్‌ఎస్ పాలకులు రూ.వందల కోట్ల విలువైన భూములు మింగేశారు. ఒక్క రాయదుర్గంలోనే 8.29 ఎకరాలను తమ తొత్తుల పేరిట మార్చుకున్నారు. హైదరాబాద్‌లో మరోచోట ఎకరం రూ.100 కోట్లున్న భూమికి సంబంధించి 19 ఎకరాలను స్వాహా చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, మేడ్చల్ జిల్లాల పరిధిలోనే సుమారు 2 వేల ఎకరాల ప్రభుత్వ భూములను బినామీల పేరుతో మార్చుకున్నారు. ఆ వివరాలన్నీ సేకరించాం’’ గత ఏడాది డిసెంబరులో ప్రభుత్వ విజయోత్సవాల సందర్భంగా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్న మాటలివి. ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటింది. జీవో నంబరు 59 విషయంలో చోటు చేసుకున్న అక్రమాలను తేల్చలేదు. ఆధారాలతో సహా కొన్ని కేసులు కళ్ల ముందే కనిపిస్తున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు సరికదా.. క్రమబద్ధీకరణకు వచ్చిన దరఖాస్తుల్లో సక్రమంగా ఉన్న వాటికీపరిష్కారం చూపడం లేదు. ఈ విషయంలో ప్రభుత్వ తీరు ఒక అడుగు ముందుకు.. నాలుగడుగులు వెనక్కి అన్నట్లు మారింది. ప్రభుత్వ భూముల్లో ఇల్లు నిర్మించుకుని.. ఎప్పటి నుంచో అక్కడ నివాసం ఉంటున్న వారికి క్రమబద్ధీకరణ చేస్తామని అసెంబ్లీ ఎన్నికలకు ముందు గత ప్రభుత్వం జీవో 59 జారీ చేసిన విషయం తెలిసిందే. క్రమబద్ధీకరణలో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయి. భూముల విలువ ఆకాశాన్ని అంటడంతో గ్రేటర్ పరిధిలో జీవో 59 ముసుగులో అక్రమాలు జరిగాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చే వరకూ అక్రమ క్రమబద్ధీకరణకు అనుమతులిస్తూనే ఉన్నారన్న ఆరోపణలూ వచ్చాయి. విలువైన భూములున్న జిల్లాల పరిధిలో అనేక అవకతవకలు జరిగాయి.
ఒకే వ్యక్తి ఎకరాలకు ఎకరాలు క్రమబద్ధీకరించుకున్న సంఘటనలు వెలుగు చూశాయి. నిబంధనల ప్రకారం.. క్రమబద్ధీకరించుకునే స్థలంలో కనీసం ఓ గది లేదా చిన్న నిర్మాణమైనా ఉండాలి. కానీ, అవేమీ లేకుండానే ఉన్నట్లు సృష్టించి కథ నడిపించారు. గజం దాదాపు రెండు లక్షల వరకూ ఉండే బోయినపల్లి, ఫిల్మ్‌నగర్, ఎంఎస్ మక్తా వంటి ప్రాంతాల్లో చాలా మంది జీవో 59 కింద క్రమబద్ధీకరణకు అనుమతులు పొందారు. ఈ అక్రమాలపై ‘ఆంధ్రజ్యోతి’ అనేక కథనాలను ప్రచురించింది కూడా. ఈ నేపథ్యంలో.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 జనవరి 25న సీసీఎల్‌ఏ కమిషనర్ నవీన్ మిత్తల్ ఉత్తర్వులు జారీ చేశారు. రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో క్రమబద్ధీకరణ కింద అనుమతి పొందిన వారిపై ఫిర్యాదులు పెద్ద సంఖ్యలో వస్తున్నాయని, అందువల్ల.. 17-8-2023కి ముందు, ఆ తర్వాత కన్వెయెన్స్ డీడ్స్‌కు సంబంధించిన తదుపరి లావాదేవీలను నిలిపి వేయాలని ఆదేశించారు. అంటే, ఆ స్థలాలను వేరొకరికి అమ్మడం కానీ, వాటిలో ఎలాంటి భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం కానీ లేకుండా కట్టడి చేశారు. రిజిస్ట్రేషన్లు ఆపేయాలని, తదుపరి విచారణ జరిగే వరకు ఎలాంటి అనుమతులు ఇవ్వవద్దని దానిలో పేర్కొన్నారు. ఆ 3 జిల్లాల్లో క్రమబద్ధీకరణ దరఖాస్తులను మళ్లీ పరిశీలించాలని నిర్దేశించారు. అయితే ఆ తర్వాత ఫిర్యాదులపై ఎలాంటి విచారణ చేపట్టలేదు. ఈ అంశం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. నిబంధనలను పట్టించుకోకుండా, ఇష్టారాజ్యంగా క్రమబద్ధీకరించిన అధికారులపైనా ఇప్పటి వరకూ ఎటువంటి చర్యలూ తీసుకోకపోవడం గమనార్హం.
సక్రమంగా ఉన్నా..
ప్రభుత్వ భూముల్లో ఇల్లు నిర్మించుకున్న వారి స్థలాల క్రమబద్ధీకరణకు గత ప్రభుత్వ హయాంలో 2022 ఫిబ్రవరి 14న జీవో నంబరు 59 జారీ చేశారు. దీంతో తమ ఇళ్ల స్థలాలను క్రమబద్ధీకరించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై క్షేత్ర స్థాయిలో పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సిన రెవెన్యూ శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో జీవో లక్ష్యం నెరవేరలేదు. సిబ్బంది కొరత సాకుతో తాను చేయాల్సిన సర్వే పనిని రెవెన్యూ శాఖ ఇతర శాఖలకు అప్పగించింది. రెవెన్యూయేతర శాఖల సిబ్బంది సర్వే చేయడంతో రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి వంటి జిల్లాల్లో వేలాది గజాల భూములు అక్రమంగా క్రమబద్ధీకరించుకున్న దాఖలాలున్నాయి. 1000, 2000 గజాల్లో చిన్నపాటి గుడిసె ఉన్నా క్రమబద్ధీకరణకు అనుమతించారు. రంగారెడ్డి జిల్లాలో ఈ తరహా కేసులు అధికంగా వెలుగు చూశాయి. దీంతో, తొలిసారి సర్వేలో గుర్తించిన జాబితాలను పక్కన పెట్టి రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఆర్డీవో, తహసీల్దార్ నేతృత్వంలోని కమిటీలు మరోసారి క్షేత్ర స్థాయి సర్వే చేపట్టాయి. ఈ సర్వే ద్వారా కొంత వరకూ క్రమబద్ధీకరణ జరిగినా అత్యధిక దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉండిపోయాయి. కేవలం ఆ మూడు జిల్లాలనే ఉత్తర్వుల్లో పేర్కొన్నా.. మిగిలిన జిల్లాల్లోనూ క్రమబద్ధీకరణ ముందుకు సాగలేదు. అన్నీ సక్రమంగా ఉన్నవారి దరఖాస్తులనూ పరిష్కరించలేదు. వీరంతా ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు.
ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అవకాశం
ప్రభుత్వ స్థలాలను అన్యాక్రాంతం చేసి ఇల్లు నిర్మించుకున్న వారి దరఖాస్తుల క్రమబద్ధీకరణ ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరే అవకాశం లేకపోలేదు. 125 గజాల కంటే ఎక్కువ స్థలం ఉంటే మార్కెట్ విలువలో కనీస మొత్తం చెల్లించి క్రమబద్ధీకరించుకోవాల్సి ఉంటుంది. ఆ స్థలంలో 50ు ఇంటి నిర్మాణం పూర్తయి ఉండాలనే నిబంధనా ఉంది. ఇక 250 గజాల కంటే ఎక్కువ ఉంటే 50ు కనీస ధర, 251-500 గజాల మధ్య ఉంటే 75ు; 500-1000 గజాల మధ్య ఉంటే వంద శాతం కనీస ధర చెల్లించి క్రమబద్ధీకరించుకోవాలి. 250 గజాలపైన స్థలం క్రమబద్ధీకరణకు వచ్చిన దరఖాస్తుదారుల నుంచి ప్రభుత్వానికి ఆదాయం సమకూరే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దీనిపై మరోసారి క్షేత్ర స్థాయి విచారణ చేసి దరఖాస్తుదారులకు పరిష్కారం చూపుతుందని ఆశించినా ఎలాంటి పురోగతి లేకపోవడం విశేషం.
ఈ వార్తలు కూడా చదవండి:
Students Protest: బాత్రూంలోకి తొంగిచూస్తున్నారు.. విద్యార్థినుల ఆందోళన
Seethakka: రాహుల్‌పై బండి సంజయ్ వ్యాఖ్యలు.. సీతక్క ఫైర్