Share News

Uttam: చివరి అస్త్రంగా న్యాయపోరాటం

ABN , Publish Date - Jun 19 , 2025 | 03:52 AM

గోదావరి-బనకచర్లపై చివరి అస్త్రంగా న్యాయపోరాటం చేయాలని అఖిలపక్షం ఎంపీలు నిర్ణయించారు. ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వం చొరవ, చేస్తున్న పోరాటానికి మద్దతిచ్చారు.

Uttam: చివరి అస్త్రంగా న్యాయపోరాటం

  • బనకచర్లపై తెలంగాణ సర్కారుకు అఖిలపక్షం మద్దతు

  • ఈ ప్రాజెక్టు కడితే ఏపీ నీటి హక్కులు కోరే ప్రమాదం

  • ఆందోళన వ్యక్తం చేసిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌

  • కలిసికట్టుగా పోరాడుదాం: బీజేపీ ఎంపీలు

  • రాజకీయాలొద్దు.. వాకౌట్‌ చేస్తున్నా: ఎంపీ వద్దిరాజు

హైదరాబాద్‌, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): గోదావరి-బనకచర్లపై చివరి అస్త్రంగా న్యాయపోరాటం చేయాలని అఖిలపక్షం ఎంపీలు నిర్ణయించారు. ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వం చొరవ, చేస్తున్న పోరాటానికి మద్దతిచ్చారు. ఏపీ ప్రతిపాదించిన గోదావరి-బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టుపై ఎంపీల అభిప్రాయ సేకరణకు బుధవారం సచివాలయంలో నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన రెండున్నర గంటలపాటు జరిగిన అఖిలపక్షం సమావేశంలో వారు పాల్గొన్నారు. ముఖ్యఅతిథిగా సీఎం రేవంత్‌రెడ్డి, బీజేపీ నుంచి డీకే అరుణ, రఘునందన్‌రావు, బీఆర్‌ఎస్‌ నుంచి వద్ది రాజు రవిచంద్ర, మజ్లిస్‌ తరఫున అసదుద్దీన్‌ ఒవైసీ, కాంగ్రెస్‌ నుంచి రేణుకాచౌదరి, మల్లురవి, సురేశ్‌ షెట్కార్‌, బలరాంనాయక్‌, రవికుమార్‌ యాదవ్‌, రామసహాయం రఘురామిరెడ్డి, రఘువీర్‌రెడ్డి, జి.వంశీ, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి హాజరయ్యారు. డీకే అరుణ, రఘునందన్‌రావు మాట్లాడుతూ.. బనకచర్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేయదని భావిస్తున్నట్లు తెలిపారు. ఒకవేళ అన్యాయం జరిగితే.. సంఘటితంగా పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. గోదావరి, కృష్ణాల్లో ఏయే ప్రాజెక్టులకు అనుమతులు రావాల్సి ఉంది? ప్రతిబంధకాలేంటి? అని వారు అడగ్గా.. మధ్యలో జోక్యం చేసుకున్న సీఎం.. ‘‘ఆ వివరాలను ఎంపీలందరికీ పంపుతాం’’ అని స్పష్టం చేశారు. మజ్లిస్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ మాట్లాడుతూ.. సీడబ్ల్యూసీ సహా.. కేంద్రానికి ఫిర్యాదులు చేసి, అన్ని వేదికలను ఆశ్రయించాకే.. చివరి అస్త్రంగా న్యాయపోరాటం చేద్దామని అభిప్రాయపడ్డారు. కృష్ణా, గోదావరి బోర్డుల సమావేశంలోనూ ఈ అంశాన్ని లేవనెత్తి, పర్యావరణ అనుమతులు రాకుండా కేంద్ర నిపుణుల మదింపు కమిటీకి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ అభిప్రాయాలను రేణుకాచౌదరి సమర్థించారు.


పోతిరెడ్డిపాడు ఆగదు: ఉత్తమ్‌ ఆందోళన

గోదావరి-బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టును నిర్మించి, గోదావరి జలాలను బనకచర్ల క్రాస్‌ రెగ్యులేటరీకి తరలించినా.. శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ ద్వారా బనకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌కు కృష్ణా జలాల అక్రమ తరలింపును యథాతథంగా కొనసాగిస్తామని ప్రాజెక్టు ప్రాథమిక సాధ్యాసాధ్యాల నివేదిక(పీఎ్‌ఫఆర్‌)లో ఏపీ ప్రభుత్వం పేర్కొందని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. 2014 నాటి గోదావరి జలాల వినియోగం ఆధారంగా ఏపీ పీఎ్‌ఫఆర్‌ తయారు చేసిందని అభ్యంతరం తెలిపారు. 2014 తర్వాతికాలంలో నికర జలాల ఆధారంగా గోదావరిపై తెలంగాణలో నిర్మించిన సమ్మక్క సాగర్‌, సీతారామ, సీతమ్మసాగర్‌ వంటి ప్రాజెక్టుల నీటి అవసరాలను ఈ నివేదిక పరిగణలోకి తీసుకోలేదని తప్పుబట్టారు. గోదావరి-బనకచర్ల అనుసంధానంపై ఆయన ఎంపీలకు ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ‘‘ఏపీ సమర్పించిన ఈ నివేదికను గోదావరి పరీవాహకంలోని రాష్ట్రాలతోపాటు కృష్ణా, గోదావరి బోర్డులు, పోలవరం ప్రాజెక్టు ఆథారిటీ(పీపీఏ)లకు కేంద్రం పంపించి.. 15 రోజుల్లోగా అభిప్రాయాలను తెలపాలని కోరింది. ఏపీ పీఎ్‌ఫఆర్‌లో 968 టీఎంసీల తెలంగాణ హక్కులను విస్మరించారు. జీ10, జీ11 సబ్‌-బేసిన్లలో రాష్ట్ర హక్కుల ప్రస్తావన లేదు. నికర, మిగులు జలాల ఆధారంగా భవిష్యత్తులో తెలంగాణ చేపట్టనున్న ప్రాజెక్టులకు ‘బనకచర్ల’ ప్రాజెక్టు ముప్పుగా పరిణమించబోతోంది’’ అని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. తొలుత ప్రాజెక్టులను నిర్మించి, ఆ తర్వాత హక్కులు అడుగుతారని మండిపడ్డారు. బనకచర్లను నిర్మిస్తే.. భవిష్యత్‌లో ఏర్పాటయ్యే గోదావరి ట్రైబ్యులనల్‌ ఎదుట ఇదే వాదనలను వినిపించి, నికర జలాలను కోరే ప్రమాదముందన్నారు. దిగువ ప్రాంతం కావడంతో వరద జలాలపై తమకే ఎక్కువ హక్కులుంటాయనే ఏపీ వాదన చట్ట విరుద్ధమన్నారు. పోలవరం ఆపరేషన్స్‌లో మార్పులను ఉత్తమ్‌ తప్పుబట్టారు. ‘‘బనకచర్లకు పోలవరం నుంచి నీటిని తరలిస్తామని ఏపీ ప్రతిపాదించిన నేపథ్యంలో సీడబ్ల్యూసీ, టెక్నికల్‌ అడ్వయిజరీ కమిటీ(టీఏసీ) ఆమోదించిన పోలవరం ఆపరేషన్స్‌ షెడ్యూల్‌లో మార్పులు చోటుచేసుకుంటాయి. ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్‌ 90 కింద ఏర్పాటైన పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీ(పీపీఏ) టీఏసీ అనుమతులకు కట్టుబడి ఉండాలి. ఈ నేపథ్యంలో పీపీఏ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి, బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదనలను తిరస్కరించాలి’’ అని డిమాండ్‌ చేశారు. టీఏసీ అనుమతుల్లేకుండా.. బనకచర్ల ప్రాజెక్టును చేపట్టేందుకు వీలుండదని స్పష్టం చేశారు. బనకచర్లను నిర్మిస్తే.. పోలవరంతో తెలంగాణలో ముంపు సమస్య మరింత తీవ్రం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.


భద్రాచలం పట్టణంతోపాటు.. మణుగూరు భారజల ప్లాంట్లకు ప్రమాదం పొంచిఉంటుందన్నారు. తెలంగాణకు అన్ని విధాలుగా అన్యాయం జరిగే బనకచర్ల ప్రాజెక్టును తిరస్కరించాల్సిందేనని స్పష్టం చేశారు. కేంద్రం మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా.. ముందుకు వెళ్తోందని ఆరోపించారు. సీఎం రేవంత్‌ దీనిపై కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌కు ఫిర్యాదు చేయగా.. సానుకూలంగా స్పందించారని, అయితే.. ఏపీ ప్రతిపాదనలపై కేంద్రం సానుకూలంగా ఉందన్నారు. ఈ ప్రాజెక్టును కేంద్రం తిరస్కరించాలని డిమాండ్‌ చేశారు. ‘‘2018లో గోదావరిలో నీటి లభ్యత లేదని సీడబ్ల్యూసీ తేల్చింది. దాంతో.. గోదావరి-కావేరీ అనుసంధానానికి కేంద్రం ప్రతిపాదించింది. అది జరిగి ఉంటే తెలంగాణకు ప్రయోజనం కలిగేది. అయితే.. గత బీఆర్‌ఎస్‌ సర్కారు దీన్ని వ్యతిరేకించింది’’ అని తప్పుబట్టారు. గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టులు, వాటి అవసరాలపై గోదావరి డివిజన్‌ డిప్యూటీ డైరెక్టర్‌ సుబ్రమణ్య ప్రసాద్‌, నీటిపారుదల శాఖ సలహాదారుడు ఆదిత్యనాథ్‌ దాస్‌లు పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా బనకచర్ల ప్రాజెక్టు గురించి వివరించారు. పోలవరం ద్వారా 485.2 టీఎంసీల తరలింపునకు మాత్రమే అనుమతి ఉండగా, మరో 200 టీఎంసీలు తీసుకెళ్లడానికి బనకచర్ల ప్రాజెక్టును ప్రతిపాదించారని సుబ్రమణ్య ప్రసాద్‌ తెలిపారు. సమావేశం ముగింపులో ఉండగా... బీఆర్‌ఎస్‌ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర వాకౌట్‌ చేశారు.

Updated Date - Jun 19 , 2025 | 03:52 AM