Tunnel Accident: అప్పుడు ఉత్తరాఖండ్, ఇప్పుడు తెలంగాణ... కార్మికులు సేఫ్‌గా బయటకొస్తారా..
ABN , Publish Date - Feb 22 , 2025 | 07:06 PM
తెలంగాణ శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ ప్రమాదం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ ప్రమాదం దృష్ట్యా గతంలో జరిగిన ఉత్తరాఖండ్ టన్నెల్ ప్రమాదాన్ని గుర్తు చేస్తుంది. అప్పుడు 41 మంది కార్మికులను 17 రోజుల పాటు శ్రమించి కాపాడారు. దీంతో ఇక్కడ కూడా అలాంటి చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.
తెలంగాణ(Telangana)లోని దోమల పెంట వద్ద జరిగిన శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ (SLBC Tunnel) ప్రమాదం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రమాదం గతంలో ఉత్తరాఖండ్‌లో జరిగిన టన్నెల్ ప్రమాదాన్ని గుర్తు చేస్తుంది. 2023 నవంబర్ 12న ఉత్తరకాశిలో నిర్మాణంలో ఉన్న సిల్క్యారా సొరంగంలో 41 మంది కార్మికులు చిక్కుకున్నారు. ఆ క్రమంలో సొరంగం కూలిన 17 రోజుల తర్వాత వారిని కాపాడటం విశేషం. సొరంగంలోని సిల్కారా విభాగంలో 60 మీటర్ల దూరంలో శిథిలాలు పడిపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. వెంటనే అక్కడి ప్రభుత్వం అప్రమత్తమై, చిక్కుకున్న కార్మికులకు ఆక్సిజన్, నీరు, విద్యుత్, ప్యాక్ చేసిన ఆహారం అందించేందుకు చిన్న స్టీల్ పైపుల ద్వారా సహాయక చర్యలు చేపట్టింది.
పైపులను జొప్పించి
కార్మికులతో మాట్లాడేందుకు వాకీ టాకీ కమ్యూనికేషన్ ఏర్పాటు చేసింది. 57 మీటర్ల వెడల్పున శిథిలాలు ఉండటంతో, పైపులను జొప్పించి వారిని బయటకు తీసేందుకు ప్రయత్నించారు. డ్రిల్లింగ్ సమయంలో రాళ్లు కూలడం వంటి కారణాలతో కార్మికులను రక్షించడం సవాలుగా మారింది. చిన్న చిన్న పైపుల ద్వారా కార్మికులకు ఆహారం, నీరు, మెడిసిన్ అందించారు. తద్వారా వారు ప్రాణాలతో ఉండగలిగారు. స్టీల్ పైపు ద్వారా చిన్న కెమెరాను లోపలికి పంపించి, చిక్కుకున్న కార్మికుల ముఖాలను చూసేలా చేశారు.
మట్టి తొలగింపు
ఆహారం, నీరు అందించడంతో కార్మికులు క్షేమంగా ఉన్నారు. నిరంతరం మాట్లాడేందుకు ‘ల్యాండ్‌లైన్’ను ఏర్పాటు చేశారు. అక్కడి పరిస్థితిని ప్రత్యక్షంగా చూసేందుకు ఎండోస్కోపిక్ కెమెరాను కూడా ఉపయోగించారు. ఆ క్రమంలో 800 మిల్లీమీటర్ల పైపు ద్వారా కార్మికులను బయటకు తీసుకురావడానికి ర్యాట్ హోల్ మైనింగ్ చేపట్టి మట్టి తొలగింపు పనులను పూర్తి చేశారు. పలు రకాల అవాంతరాలు ఎదురైనా, రెస్క్యూ అపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. చివరకు 41 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
ఇక్కడ కూడా..
ఇప్పుడు తెలంగాణలోని శ్రీశైలం టన్నెల్ ప్రమాదం విషయంలో కూడా ఇలాంటి సహాయ చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. తెలంగాణ టన్నెల్ ప్రమాదం ఉదయం 8 గంటలకు జరిగినట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో 8.30 గంటలకు బోరింగ్ మిషన్ ఆన్ చేశారు. అదే సమయంలో టన్నెల్లో ఓ వైపు నీరు లైక్ కావడంతో మట్టి కుంగిపోయి శబ్దం వచ్చింది. దీంతో టీబీఎం ఆపరేటర్ అప్రమత్తమై వెంటనే 42 మంది కార్మికులను అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చారు.
కానీ బోరింగ్ పరిధిలో ఉన్న 8 మంది కార్మికులు మాత్రం బయటకు రాలేకపోయారు. ఈ క్రమంలో వారిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు కూడా ఈ ప్రమాద ఘటనపై స్పందించారు. తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా పోలీస్ సహా ఇతర అధికారులను ఆదేశించారు.
ఇవి కూడా చదవండి:
Bank Holidays: మార్చి 2025లో బ్యాంకు సెలవులు.. ఈసారి ఎన్ని రోజులంటే..
Aadhaar Update: అలర్ట్.. ఆధార్‌లో మీ నంబర్, పేరు, అడ్రస్ ఎన్నిసార్లు మార్చుకోవచ్చో తెలుసా..
Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్
Read More Business News and Latest Telugu News