Local Body Elections: వేడెక్కిన పంచాయితీ ప్రచారం.. గ్రామాల బాటపడుతున్న ముఖ్య నేతలు..
ABN , Publish Date - Dec 09 , 2025 | 07:07 AM
ఓటరుకు పల్లె 'పంచాయితీ' పద్మ వ్యూహంలా తయారైంది. అన్ని పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మ కంగా తీసుకున్నాయి. సారధులే స్వయంగా పల్లె బాట పడుతూ.. వ్యూహరచన చేస్తున్నారు. దీంతో గ్రామాల్లో ఎన్నికల ప్రచార తీరు మారింది. విందులు, హామీలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
నిర్మల్, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి) : గ్రామ పంచాయితీ ఎన్నికలను అన్ని పార్టీల నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుండడంతో పోటీ రోజు రోజుకు రసవత్తరంగా మారుతోంది. ప్రస్తుతం మొదటి రెండో దఫా నామినేషన్లు, ఉపసంహరణ పర్వం పూర్తవ్వడంతో ఇక ప్రచారపర్వం మొదలైంది. కాంగ్రెస్, బీజేపీలతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు సైతం తమ పార్టీ మద్దతుదారులను గెలిపించుకునేందుకు వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నారు. వేకువజాము నుంచే తమ మద్దతుదారుల గెలుపు కోసం నేతలు పల్లె బాట పడుతుండడం ఆసక్తికరంగా మారుతోంది. పల్లె ప్రజలు వ్యవసాయ పనుల కోసం పంట పొలాలకు వెళ్ళక ముందే వారి వద్దకు వెళ్ళి మద్దతును అభ్యర్థిస్తున్నారు.
సాధారణ ఎన్నికల మాదిరిగానే కొన్ని గ్రామ పంచాయితీల్లో మద్యం, నగదును పంపిణీ చేసేందుకు కూడా కొంత మంది అభ్యర్థులు రంగం సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పెద్దమొత్తంలో మద్యం నిల్వలను సమీకరించినట్లు సమాచారం. అలాగే ప్రస్తుతం పల్లెల్లోని బెల్ట్ షాపులకు సైతం భారీగా డిమాండ్ ఏర్పడుతోంది. బెల్ట్ షాపుల వద్ద జనం బారులు తీరుతున్నారు. ఈ బిల్లులన్ని కొన్ని గ్రామాల్లో పోటీచేసే అభ్యర్థులే భరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
పల్లెబాటలో నేతలు..
కాగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నేతలు పోటాపోటీగా పల్లెబాట పడుతున్నారు. బీజేపీ తరఫున ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, రామారావు పటేల్, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రితేషథోడ్‌లు తమ పార్టీ నియోజకవర్గాల్లో పార్టీ సీనియర్ నాయకులకు ప్రచార బాధ్యతలను అప్పగిస్తున్నారు. వారు వెనక ఉండి నేతలకు ప్రచార వ్యూహాలను అందిస్తున్నారు. ఎమ్మెల్యేల అండతో సీనియర్ నాయకులు తమ మద్దతుదారుల గెలుపు కోసం ప్రచారం చేస్తూనే ఇతర పార్టీల నేతలను తమ పార్టీలోకి చేర్చుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.
ఇప్పటికే ఇలా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో చాలా మంది చేరారు. కాగా కాంగ్రెస్ పార్టీ తరఫున డిసీసీ అధ్యక్షుడు బొజ్జు పటేల్ ఖానాపూర్ నియోజకవర్గంలోనూ, నిర్మల్ నియోజకవర్గంలో ఆ పార్టీ ఇన్చార్జ్ శ్రీహరిరావు, ముథోల్ నియోజకవర్గంలో ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు నారాయణ రావు పటేల్, విఠల్ రెడ్డిలతో పాటు తదితరులు తమ పార్టీ మద్దతుదారుల తరపున ప్రచారం చేస్తున్నారు. వీరంతా ఉదయం నుంచే పల్లె ప్రచారాన్ని మొదలు పెడుతున్నారు. నాలుగు రోజుల నుంచి నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి శ్రీహరిరావు మారుమూల పల్లెలను టార్గెట్ చేసుకొని వేకువజాము నుంచే ప్రచారం నిర్వహిస్తుండడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మొత్తానికి నేతల ప్రచార పర్వంతో గ్రామాల్లో రోజు రోజుకు రాజకీయ వాతావరణం వేడేక్కుతోంది.
ఇవి కూడా చదవండి
భారత్‌తో బలమైన బంధం.. చైనాకు చెక్ పెట్టేందుకు అమెరికా వ్యూహం..