Local Body Elections: ఓటెయ్యడానికి రారాదె...
ABN , Publish Date - Dec 09 , 2025 | 06:48 AM
హనుమకొండ జిల్లాలో గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. అభ్యర్థులు నాన్ లోకల్ ఓటర్లను కంటాక్ట్ చేసి ఓటు వేసేందుకు వారిని గ్రామాలకు రప్పిస్తున్నారు. వలస వెళ్లిన వారికి ఫోన్లు చేసి, ఖర్చులు కూడా భరిస్తామని తెలియజేస్తున్నారు.
నాన్ లోకల్ ఓటర్లను బతిమలాడుతున్న అభ్యర్థులు
పంచాయతీ ఎన్నికల్లో ప్రతీ ఓటు విలువైనదే
పల్లెల్లో విందుల సందడి జోరు
హనుమకొండ టౌన్, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి) : గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో ఒక్క ఓటుకు కూడా సర్పంచ్ స్థానాలను తారుమారు చేసే శక్తి ఉంటుంది. దీంతో అభ్యర్థులు నాన్ లోకల్ ఓటర్లకు ఫోన్లు చేసి సంప్రదిస్తున్నారు. హనుమకొండ జిల్లాలో మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడతలో భీమదేవరపల్లి, కమలాపుర్, ఎల్కతుర్తి మండలాలు, రెండో విడతలో పరకాల, ధర్మసాగర్, వేలేరు, ఐనవోలు, మూడో విడతలో దామెర, ఆత్మకూరు, శాయంపేట, నడికూడ మండలాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. నామినేషన్ వేసిన అభ్యర్థులు గ్రామాల నుంచి ఇతర ప్రాంతాలకు ఉద్యోగ, వ్యాపారాల కోసం వలస వెళ్లిన వారికి ఫోన్ చేసి.. ఎన్నికల్లో సర్పంచ్‌గా, వార్డు మెంబర్‌గా నామినేషన్ వేసి పోటీలో నిలబడ్డామని పోలింగ్‌కి ఒక రోజు ముందు గ్రామానికి వచ్చి ఓటు వేసి వెళ్లాలని బతిమిలాడుకుంటున్నారు. రాను పోను ఖర్చులు కూడా భరిస్తామని కొన్ని గ్రామాల సర్పంచ్ అభ్యర్థులు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు చెబుతున్నారు.
నాయకుల విందులు..
గ్రామాలలో ఎన్నికల సందడితో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు ఓట్ల కోసం విందులు ఏర్పాటు చేసి అభ్యర్థులు తమ వైపు తిప్పుకుంటున్నారు. ఎన్నికలు జరిగే వరకు పూర్తి ఖర్చులు భరిస్తూ తమ వెంట తిప్పుకుంటున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రచారం నిర్వహించి వెంట తిరిగిన వారికి ప్రత్యేకంగా నగదుతో పాటు విందులు ఏర్పాటు చేసి ఖుషీ చేస్తున్నారు.
హోరాహోరీగా ప్రచారాలు..
జిల్లా వ్యాప్తంగా సర్పంచ్, వార్డు స్థానాలకు జరుగుతున్న ఎన్నికలతో పల్లె పోరు రసవత్తరంగా సాగుతోంది. ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ గ్రామాల్లో బరిలో నిలిచే నేతలు ఎవరికి వారు గెలుపు దిశగా ముందుకు సాగుతున్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులు ఏ అవకాశాన్ని కూడా వదులుకోకుండా ప్రచారానికి వినియోగించుకుంటున్నారు. ఏ కుటుంబంలో ఎక్కువ ఓట్లు ఉన్నాయో.. ఎవరిని ఎక్కువ సార్లు కలిస్తే తమకే ఓట్లు పడతాయో వారి వెంటే ఉంటున్నారు. ప్రతీ ఒక్కరిని ఆప్యాయతతో పలుకరిస్తూ ముందుకు సాగుతున్నారు.
అభ్యర్థుల తిప్పలు..
గ్రామాలలో ఓట్లు రాబట్టుకునేందుకు నామినేషన్ వేసిన అభ్యర్థులు నానా తిప్పలు పడుతున్నారు. ఉదయం 4 గంటల నుంచే ఇళ్లల్లోకి వెళ్లి పలకరించి ఓటు అభ్యర్థిస్తున్నారు. గతంలో ఏవైనా గొడవలు ఉన్నా.. ఎన్నికల వేళ మాత్రం వారితో అన్యోన్యంగా కలిసి మాట్లాడుతున్నారు. గతంలో జరిగిన విషయాలను మర్చిపోయి ఎన్నికల్లో తమకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Jio Hotstar Exit: టీ20 ప్రపంచకప్ ముందు ఐసీసీకి షాక్.. జియో హాట్ స్టార్ సంచలన నిర్ణయం
87 ఏళ్ల రికార్డు.. జాబితాలో ఒకే ఒక్క భారత ప్లేయర్!