Share News

KTR: కేటీఆర్‌కు మళ్లీ శ్రీముఖం

ABN , Publish Date - May 27 , 2025 | 04:18 AM

ఫార్ములా-ఈ కారు రేసు కేసులో మరో కీలక పరిణామం. ఈ కేసులో అవినీతి, అవకతవకలకు సంబంధించి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, అప్పటి మునిసిపల్‌, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌కు ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేసింది.

KTR: కేటీఆర్‌కు మళ్లీ శ్రీముఖం

  • ఫార్ములా-ఈ రేసు కేసులో ఏసీబీ నోటీసు.. రేపు విచారణకు రావాలని ఆదేశం

  • ముందే నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం విదేశాలకు వెళ్తున్నా

  • తిరిగి వచ్చిన తర్వాత హాజరవుతా: ఏసీబీకి కేటీఆర్‌ సమాధానం

  • ‘నేషనల్‌ హెరాల్డ్‌’లో రేవంత్‌ పాత్రపై బీజేపీ నేతలు మాట్లాడడం లేదేమని నిలదీత

హైదరాబాద్‌, మే 26 (ఆంధ్రజ్యోతి): ఫార్ములా-ఈ కారు రేసు కేసులో మరో కీలక పరిణామం. ఈ కేసులో అవినీతి, అవకతవకలకు సంబంధించి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, అప్పటి మునిసిపల్‌, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌కు ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈనెల 28న (బుధవారం) తమ ఎదుట విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో స్పష్టం చేసింది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఫార్ములా-ఈ కారు రేసు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ రేసు నిర్వహణలో అక్రమాలు జరిగాయని, ప్రభుత్వ ఖజానాకు రూ.54.88 కోట్ల నష్టం జరిగిందని, దీనిపై దర్యాప్తు జరపాలంటూ గత ఏడాది అక్టోబరు 18వ తేదీన మునిసిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.దానకిశోర్‌ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి ఫిర్యాదు చేశారు. అప్పట్లో క్యాబినెట్‌, ఆర్థిక శాఖ ఆమోదం తీసుకోకుండానే ఫార్ములా-ఈ ఆపరేషన్స్‌ లిమిటెడ్‌ (ఎఫ్‌ఈవో)కు హెచ్‌ఎండీఏ ఈ చెల్లింపులు చేసిందని పేర్కొన్నారు. ఈ రేసు నిర్వహణకు, హెచ్‌ఎండీఏకు ఎటువంటి సంబంధం లేదని కూడా తెలిపారు. ఈ నేపథ్యంలోనే, కేసు నమోదు చేసిన ఏసీబీ.. దర్యాప్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇప్పటికే ఒకసారి కేటీఆర్‌ను ఏసీబీ ప్రత్యేక బృందం సుదీర్ఘంగా విచారించింది. అవసరమైతే మరోసారి విచారణకు హాజరుకావాల్సి ఉంటుందని గత విచారణ ముగింపు సమయంలోనే చెప్పి పంపింది. ఈ కేసుకు సంబంధించి విదేశాల్లో ఉన్న సంస్థ ప్రతినిధుల్ని సైతం ఆన్‌లైన్‌లో ఏసీబీ అధికారులు విచారించారు. దర్యాప్తునకు అవసరమైన పత్రాలు పంపాలని కోరుతూ పలు దఫాలుగా మెయిల్స్‌ పంపారు. ఇదే కేసుకు సంబంధించి అప్పటి మునిసిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌ కుమార్‌, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్‌ ఇంజనీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డి తదితరులనూ ఏసీబీ విచారించింది. ఈ కేసులో పలువురిని విచారించిన దర్యాప్తు అధికారులు.. వారి నుంచి వచ్చిన సమాచారం, దర్యాప్తులో సేకరించిన పత్రాల ఆధారంగా మరోసారి కేటీఆర్‌ను విచారించేందుకు సిద్ధమయ్యారు. కాగా, ఈ కేసులో భాగంగా విదేశాలకు నిధులు దారిమళ్లడంతో ఈడీ కూడా దర్యాప్తు జరుపుతోంది.


విదేశీ పర్యటన తర్వాత వస్తా..

ఏసీబీ నోటీసులపై కేటీఆర్‌ ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు. ‘‘ఫార్ములా ఈ కారు రేసు కేసులో 28న విచారణకు రావాలని ఏసీబీ నోటీ్‌సలు జారీ చేసింది. ఈ కేసు పూర్తిగా రాజకీయ వేధింపుల కోసమే పెట్టినా.. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా కచ్చితంగా దర్యాప్తు సంస్థకు సహకరిస్తాను. అయితే, ముందుగా నిర్ణయించిన షెడ్యూలు మేరకు యూకే, అమెరికాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్తున్నాను. తిరిగి వచ్చిన వెంటనే దర్యాప్తు సంస్థ ఎదుట విచారణకు హాజరవుతాను. ఇదే విషయాన్ని ఏసీబీ అధికారులకు లిఖితపూర్వకంగా తెలియజేశాను’’ అని పోస్ట్‌ చేశారు. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్‌లో 48 గంటల క్రితమే రేవంత్‌ రెడ్డి పేరు వచ్చిందని, 24 గంటల తర్వాత రేవంత్‌ రెడ్డి బీజేపీ అగ్రనాయకులతో, ప్రధాని మోదీతో సన్నిహితంగా కనిపించారని, డబ్బు అక్రమ రవాణా కేసులో ఆయన ప్రమేయంపై ఒక్క బీజేపీ నాయకుడు కూడా మాట్లాడలేదని ఆయన ఆరోపించారు.


Also Read:

సైంటిస్టులు అద్భుత ఆవిష్కరణ.. 'సూపర్-విజన్' లెన్స్‌తో చీకట్లోనూ చూసేయచ్చు..

సన్నగా, బలహీనంగా ఉన్నారా? ఫిట్‌నెస్ మంత్ర ఇదే..

For More Health News and Telugu News..

Updated Date - May 27 , 2025 | 05:56 AM