ACB Medak Tribal School: శిథిలావస్థకు చేరిన తరగతి గదులు
ABN , Publish Date - Aug 07 , 2025 | 05:18 AM
మారుమూల గ్రామంలో ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆ గిరిజన ఆశ్రమ పాఠశాలలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి.
అపరిశుభ్రంగా పరిసరాలు.. నీళ్లు రాని బాత్రూమ్‌లు!
మెదక్ జిల్లా గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల అవస్థలు
ఆకస్మిక తనిఖీలో విస్తుపోయిన ఏసీబీ అధికారులు
నర్సాపూర్, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): మారుమూల గ్రామంలో ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆ గిరిజన ఆశ్రమ పాఠశాలలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. విద్యార్థులు కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ ఆధ్వర్యంలో మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం మహ్మదాబాద్‌లోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కొనసాగిన ఈ తనిఖీల్లో.. అక్కడి విద్యార్థులు పడుతున్న అవస్థలను చూసి అధికారులు విస్తుపోయారు. పాఠశాల భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. శ్లాబు పెచ్చులూడి చువ్వలు తేలి.. కూలడానికి సిద్ధంగా ఉన్నా.. అందులోనే తరగతులు కొనసాగిస్తున్నారు.
ఇక స్నానాలకు, తాగడానికి నీటి వసతి లేక పడుతున్న విద్యార్థులు ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. నీటి సదుపాయం లేకపోవడంతో కుళాయిలు నిరుపయోగంగా మారాయి. బాత్రూముల్లో నీరురాక సమీపంలోని పొలాల నుంచి నీటిని తెచ్చుకోవాల్సిన దుస్థితి. పైగా పాఠశాల ఆవరణ అపరిశుభ్రంగా.. చుట్టూ చెట్లు, పొదలు పెరిగి పిచ్చిమొక్కలతో నిండిపోయింది. ప్రహరీ పూర్తిగా లేక విషపురుగులు, పాములకు ఆవాసాలుగా మారుతోంద ని పిల్లలు భయాందోళనలకు గురవుతున్నా రు. ఇంత దుర్భర పరిస్థితుల్లోనూ ఈ ఆశ్రమ పాఠశాలలో 100 మంది వరకు విద్యార్థులు చదువుకుంటున్నారు. మెనూ ప్రకారం భోజనం అమలు చేయడం లేదని, ఆహార పదార్థాలు నాణ్యంగా లేవని ఏసీబీ అధికారుల తనిఖీలో బయటపడింది. దీనిపై ఉన్నతాధికారులకు నివేదిస్తామని ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ తెలిపారు.