వీసీల నియామకాన్ని గవర్నర్లకు అప్పగించడాన్ని సహించం
ABN , Publish Date - Feb 07 , 2025 | 03:30 AM
వర్సిటీలకు వీసీలను నియమించే అధికారాన్ని గవర్నర్లకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు విద్యావేత్తలు, సామాజిక ఉద్యమకారులు ప్రకటించారు.

తెలంగాణ విద్యాకమిషన్ సదస్సులో మేధావుల ఆగ్రహం
యూజీసీ తాజా నిబంధనలు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం
హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి6(ఆంధ్రజ్యోతి): వర్సిటీలకు వీసీలను నియమించే అధికారాన్ని గవర్నర్లకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు విద్యావేత్తలు, సామాజిక ఉద్యమకారులు ప్రకటించారు. తెలంగాణ విద్యా కమిషన్ ఆధ్వర్యంలో గురువారం బషీర్‌బాగ్‌లోని రాజీవ్ విద్యామిషన్ భవనంలో ‘యూజీసీ నిబంధనలు-రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో జోక్యం’ అంశంపై సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ యూజీసీ ఒరిజినల్ చట్టంలో వీసీల ప్రస్తావనే లేదన్నారు. గవర్నర్లలాగే వైస్‌ఛాన్సలర్లనూ రాజకీయ పనిముట్లుగా కేంద్రం వాడుకుంటోందని విమర్శించారు. ప్రొ. మురళీ మనోహర్ మాట్లాడుతూ దేశంలో కుల అసమానతలు మరింతగా పెంపొందించడానికే యూజీసీ ఈ నిబంధనలు తీసుకొచ్చిందన్నారు. రామన్ మెగసెసే అవార్డు గ్రహీత ప్రొ. శాంతా సిన్హా మాట్లాడుతూ యూజీసీ నిబంధనలను రాష్ట్ర వర్సిటీలు అమలు చేయకపోతే గుర్తింపు రద్దు లేదా నిధుల నిలుపుదల వంటి కఠిన చర్యలు తీసుకుంటామనడం అన్యాయమని ఆక్షేపించారు.
హెచ్‌సీయూ విశ్రాంత ప్రొఫెసర్ కె. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఉన్నత విద్యావ్యవస్థలను హిందూత్వమయం చేయడంలో భాగంగానే నూతన విద్యావిధానం, యూజీసీ తాజా ముసాయిదా రూపకల్పన వంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సభాధ్యక్షత వహించిన తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి మాట్లాడుతూ వైస్ ఛాన్సలర్లను నియమించే అధికారాలను కేంద్రం లాక్కునే ప్రయత్నం చేస్తుందని, దీన్ని రాష్ట్రాలపై దాడిగా పరిగణించాలని అన్నారు. యూజీసీ తాజా నిబంధనలు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ప్రొ. రమామెల్కొటే మాట్లాడుతూ భిన్న సంస్కృతులు, విభిన్న వైవిధ్యతలు కలిగిన వివిధ రాష్ట్రాల పరిధిలోని విశ్వవిద్యాలయాలన్నింటికీ ఒకే ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామనడం సరికాదని హితవు పలికారు. యూజీసీ కొత్త ముసాయిదాలోని నిబంధనలు పూర్తి అప్రజాస్వామికంగా ఉన్నాయని ప్రొఫెసర్లు హరగోపాల్, డి. నరసింహారెడ్డి, పీఎల్ విశ్వేశ్వరరావు, సత్యనారాయణ, ముత్యం రెడ్డి, పద్మజా షా, తిరుపతి రావు, ఎమ్మెల్సీ కోదండరాం తదితరులు ఆరోపించారు.