ముక్కిపోతున్న దొడ్డు బియ్యం
ABN , Publish Date - Jun 20 , 2025 | 04:25 AM
ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ నుంచి సన్న బియ్యం పంపిణీ చేస్తోంది. ఈ నెలలో అయితే మూడు నెలల కోటా(జూన్, జూలై, ఆగస్టు) బియ్యాన్ని అందిస్తోంది.
రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ నేపథ్యంలో
గోదాములు, చౌకడిపోల్లో లక్ష టన్నులు
భద్రపరచిన సరుకు విలువ రూ.420 కోట్లు
టెండర్ల నిర్వహణపై దృష్టిపెట్టని ప్రభుత్వం
అలాగే వదిలేస్తే పౌర సరఫరాల సంస్థకు నష్టం
హైదరాబాద్, జూన్ 19 (ఆంధ్రజ్యోతి): ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ నుంచి సన్న బియ్యం పంపిణీ చేస్తోంది. ఈ నెలలో అయితే మూడు నెలల కోటా(జూన్, జూలై, ఆగస్టు) బియ్యాన్ని అందిస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్నా గోదాములు, చౌకడిపోల్లో మిగిలిపోయిన దొడ్డుబియ్యంపై ప్రభుత్వం దృష్టిపెట్టలేదు. రాష్ట్రంలో పేదలకు ఇక సన్నబియ్యమే పంపిణీ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో.. దొడ్డు బియ్యం అవసరం ఇకపై ఉండకపోవచ్చు. ఈ నేపథ్యంలో పాత నిల్వలను రికవరీ చేయాల్సిన బాధ్యత పౌరసరఫరాల శాఖపై ఉంది. సుమారు మూడు నెలలుగా ఈ అంశాన్ని గాలికొదిలేయడంతో గోదాములు, రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం ముక్కిపోతున్నాయి.
ఎలుకలు, లక్కపురుగుల పాలు..
రాష్ట్ర ప్రభుత్వం మార్చి నెల వరకు పేదలకు దొడ్డుబియ్యమే పంపిణీ చేసింది. ఆ తర్వాత నుంచే సన్న బియ్యం పంపిణీ చేస్తోంది. అయితే రాష్ట్రంలో ఉన్న గోదాముల్లో 85 వేల టన్నులు, రేషన్ దుకాణాల్లో 15వేల టన్నులు.. మొత్తంగా లక్ష టన్నుల దొడ్డు బియ్యం నిల్వలు ఉన్నాయి. భారత ఆహార సంస్థ(ఎ్‌ఫసీఐ)లెక్క ప్రకారం కిలోకు రూ.42 చొప్పున టన్ను బియ్యం విలువ రూ.42వేలు. అంటే లక్ష టన్నుల విలువ అక్షరాలా రూ.420 కోట్లు. ఇంత విలువైన బియ్యం విషయంలో ప్రభుత్వం ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో గోదాములు, రేషన్ షాపుల్లో బియ్యం నిల్వ చేసి పెట్టారు. వీటన్నింటిని ఒక చోటుకు సమీకరించటంగానీ, ఎక్కడికక్కడ టెండరు పద్ధతిలో విక్రయించటంగానీ చేయడంలేదు. ఈ బియ్యాన్ని విక్రయించటం తప్ప వేరే మార్గం లేదు. కానీ, ఈ విషయమై పౌర సరఫరాల శాఖ నుంచి సీఎంవోకు ఎలాంటి ప్రతిపాదనలు వెళ్లలేదని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడకపోవటంతో డీలర్లు, అధికారులు వాటిని వదిలేశారు. దీంతో వాటిని ఎలుకలు, పందికొక్కులు, లక్కపురుగులు తింటున్నాయి. కొన్ని చోట్ల ఇరుకు గదులు ఉండటంతో.. తాజాగా పంపిణీ చేస్తున్న సన్న బియ్యం, పాత దొడ్డు బియ్యం కలిపి ఒకేచోట వేయాల్సి వస్తోంది. వానాకాలం ప్రారంభమైంది. కొన్ని చోట్ల గదుల్లోకి నీరు చేరి, బియ్యం పాడయ్యే ప్రమాదం కూడా ఉంది. దీంతో రేషన్ డీలర్లు కూడా ఆందోళన చెందుతున్నారు. బియ్యం పాడైతే నష్టాన్ని తామెక్కడ భరించాల్సి వస్తుందోననే ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకొని దొడ్డు బియ్యాన్ని తమ వద్ద నుంచి ఖాళీ చేయాలని కోరుతున్నారు.
టెండర్లు నిర్వహించడమే ప్రత్యామ్నాయం
దొడ్డు బియ్యం విక్రయానికి టెండర్లు నిర్వహించటం తప్ప వేరే ప్రత్యామ్నాయం కనిపించటం లేదు. రేషన్ షాపుల్లో ఉన్న దొడ్డు బియ్యాన్ని ఆయా జిల్లాల్లోని గోదాములకు తరలించాలని, గోదాముల్లో ఉన్న నిల్వల వారీగా టెండర్లు పిలవాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లక్ష టన్నుల బియ్యం విలువ రూ.420 కోట్లు కాగా, గ్లోబల్ టెండర్లు నిర్వహిస్తే ట్రేడర్లు కొనుగోలు చేసే అవకాశాలున్నాయి. కాగా, తెలంగాణ నుంచి విదేశాలకు దొడ్డు బియ్యం ఎగుమతులు కూడా ఎక్కువగానే చేస్తుంటారు. ఈ లక్ష టన్నులను టెండర్ల ద్వారా విక్రయిస్తే డిమాండ్ ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయతో లోకేష్ భేటీ
యోగాలో ప్రపంచ రికార్డు సృష్టిస్తాం..: మంత్రి సవిత
ఢిల్లీకి బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి
For More AP News and Telugu News