Gellu Srinivas: మహాటీవిపై దాడి ఘటన..గెల్లు శ్రీనివాస్ సహా 12 మంది అరెస్టు
ABN , Publish Date - Jun 30 , 2025 | 05:25 AM
మహాటీవీ కార్యాలయంపై దాడి ఘటనలో బీఆర్‌ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివా్‌సతోపాటు 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు కేటీఆర్‌పై ప్రసారం చేసిన కథనానికి నిరసనగా ఈ నెల 28న బీఆర్‌ఎస్వీ నాయకులు ఫిలింనగర్‌లోని మహాటీవీ కార్యాలయంపై దాడి చేసిన విషయం తెలిసిందే..
పరారీలో మరో 11 మంది
అరెస్టయిన వారందరికీ బెయిల్ మంజూరు
గెల్లు శ్రీనివాస్, బాల్క సుమన్ తదితరులపై మరో కేసు
బంజారాహిల్స్, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): మహాటీవీ కార్యాలయంపై దాడి ఘటనలో బీఆర్‌ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివా్‌సతోపాటు 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. కేటీఆర్‌పై ప్రసారం చేసిన కథనానికి నిరసనగా ఈ నెల 28న బీఆర్‌ఎస్వీ నాయకులు ఫిలింనగర్‌లోని మహాటీవీ కార్యాలయంపై దాడి చేసిన విషయం తెలిసిందే..! వీరు జరిపిన రాళ్ల దాడిలో కార్యాలయం ఫర్నిచర్, కార్లు ధ్వంసమయ్యాయి. సురేశ్ అనే ఉద్యోగి గాయపడ్డారు. చానల్ ఎగ్జిక్యూటీవ్ ఎడిటర్ అజిత ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు.. మొత్తం 24 మంది నిందితులను గుర్తించారు.
వీరిలో బీఆర్‌ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్తో పాటు మరో 12 మందిని అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచారు. మరో 11 మంది పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గెల్లు శ్రీనివాస్ సహా.. మిగతా వారికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కాగా.. పోలీసు స్టేషన్లో గెల్లు శ్రీనివాస్, ఇతరులను కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంపత్ పరామర్శించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బీఆర్‌ఎస్వీ నాయకులపై పోలీసులు ఉద్దేశపూర్వకంగా కేసు పెట్టారని ఆరోపించారు. మరోవైపు గెల్లు శ్రీనివాస్ అరెస్టు సందర్భంగా.. తెలంగాణ భవన్ వద్ద పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ పోలీసులు ఆరోపించారు. దీంతో గెల్లు శ్రీనివాస్, బాల్క సుమన్, మదుసూదనాచారి, తాత మధు, అభిలా్‌షరావు, మన్నె గోవర్ధన్‌రెడ్డి, సునీత, పావని తదితరులపై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. అటు మహాటీవీ కార్యాలయంపై దాడిని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, కాంగ్రెస్ నేత డాక్టర్‌సింగిరెడ్డి రోహిన్‌రెడ్డి, ఎస్సీ సెల్ నేత కాటూరి రమేశ్ తదితరులు ఖండించారు. ఆదివారం వారు మహాటీవీ కార్యాలయానికి చేరి, పరిస్థితిని పరిశీలించారు.