Share News

ఆర్‌అండ్‌బీలో ఏఈఈలకు పదోన్నతులు!

ABN , Publish Date - Jan 20 , 2025 | 04:47 AM

రోడ్లు, భవనాల శాఖలోని అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీరు (ఏఈఈ)హోదాలో ఉన్న 118 మందికి డిప్యూటీ ఇంజనీర్లు (డీఈ)గా పదోన్నతులు కల్పించేందుకు రంగం సిద్ధమైంది.

ఆర్‌అండ్‌బీలో ఏఈఈలకు పదోన్నతులు!

  • 118 మందితో జాబితా.. త్వరలో ఉత్తర్వులు

  • మంత్రి కోమటిరెడ్డి చొరవతో మార్గం సుగమం

హైదరాబాద్‌, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): రోడ్లు, భవనాల శాఖలోని అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీరు (ఏఈఈ)హోదాలో ఉన్న 118 మందికి డిప్యూటీ ఇంజనీర్లు (డీఈ)గా పదోన్నతులు కల్పించేందుకు రంగం సిద్ధమైంది. పదోన్నతులకు సంబంధించిన కసరత్తును ఉన్నతాధికారులు పూర్తిచేసి ఇప్పటికే జాబితాను సిద్ధం చేశారు. త్వరలోనే పదోన్నతుల ఉత్తర్వులు విడుదలకానున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే.. ప్రస్తుతం పదోన్నతి పొందుతున్న 118 పోస్టులకు సంబంధించి కొత్త వారితో భర్తీకి చర్యలు తీసుకోవాలంటూ ఆర్‌ అండ్‌ బీ అధికారులు టీజీపీఎస్సీకి లేఖ రాయాలని నిర్ణయించినట్టు తెలిసింది. అయితే ఏఈఈ నుంచి డీఈలుగా కొంతమందికి పదోన్నతులు దక్కుతుండగా.. డీఈ నుంచి ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీరు (ఈఈ), ఈఈ నుంచి సూపరింటెండెంట్‌ ఇంజనీరు (ఎస్‌ఈ) పోస్టుల్లో పదోన్నతుల కోసం మాత్రం ఎదురు చూడాల్సిన పరిస్తితులున్నాయి.


ఇందుకు ఆంధ్రప్రదేశ్‌ నుంచి రావాల్సిన సీనియారిటీ జాబితా రాకపోవడమే కారణంగా కనిపిస్తోంది. అక్కడి నుంచి సీనియారిటీ జాబితా వస్తే.. మరి కొంతమందికి పదోన్నతులు లభించనున్నాయి. కాగా, గత ప్రభుత్వం ఏళ్ల తరబడి శాఖ సర్వీస్‌ రూల్స్‌ను ఖరారు చేయకుండా పెండింగ్‌లో పెట్టడంతో.. అప్పట్నుంచి పలు హోదాల్లోని ఉద్యోగులకు పదోన్నతులు దక్కలేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడగానే ఆర్‌ అండ్‌ బీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉద్యోగుల పదోన్నతులు, సర్వీస్‌ రూల్స్‌పై దృష్టి సారించారు. ఇదే విషయంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో మాట్లాడారు. సర్వీస్‌ రూల్స్‌ ఖరారుకు సీఎం ఆమోదం తెలపడంతో.. పదోన్నతులకు మార్గం సుగమమైంది.

Updated Date - Jan 20 , 2025 | 04:47 AM