Pocharam Project: పోచారం ప్రాజెక్టు పైనుంచి ఉప్పొంగిన ప్రవాహం
ABN , Publish Date - Aug 29 , 2025 | 03:57 AM
నిజాం హయాంలో నిర్మించిన పోచారం ప్రాజెక్టు మీద నుంచి నీరు ప్రవహించడం... తీవ్ర ఆందోళనకు గురి చేసింది. ప్రాజెక్టు సామర్థాన్ని మించి రెండున్నర రెట్ల మేర అధికంగా వరద రావడంతో సమీప గ్రామాల ప్రజలు హడలిపోయారు.
103 ఏళ్లనాటిదైనా తట్టుకొని నిలిచిన వైనం
గరిష్ఠ వరద సామర్థ్యం 72 వేల క్యూసెక్కులే
బుధవారం 1.82 లక్షల క్యూసెక్కుల రాక
కట్ట కొట్టుకుపోతుందేమోనని ప్రజల ఆందోళన
వరద తగ్గడంతో ఊపిరి పీల్చుకున్న జనం
రాష్ట్రవ్యాప్తంగా 120 చెరువులకు గండ్లు
నష్టపోయిన రైతులను ఆదుకుంటాం: పొంగులేటి
ప్రజలకు వైద్య సాయం అందించాలి: దామోదర
కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా వర్షాలు, వరదలు
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్): నిజాం హయాంలో నిర్మించిన పోచారం ప్రాజెక్టు మీద నుంచి నీరు ప్రవహించడం... తీవ్ర ఆందోళనకు గురి చేసింది. ప్రాజెక్టు సామర్థాన్ని మించి రెండున్నర రెట్ల మేర అధికంగా వరద రావడంతో సమీప గ్రామాల ప్రజలు హడలిపోయారు. అయితే, ఇంత వరదను సైతం పోచారం ప్రాజెక్టు తట్టుకోగలిగింది. కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డిపేట మండలం పోచారం గ్రామంలో మంచిప్ప చెరువుపై 103ఏళ్ల కిందట ఈ ప్రాజెక్టును నిర్మించారు. 1917లో అప్పటి నిజాం శంకుస్థాపన చేయగా.. రూ.27.11లక్షలు వెచ్చించి.. 1922లో పూర్తి చేశారు. వందేళ్లుగా నిజామాబాద్, మెదక్ జిల్లాల సాగు, తాగునీటి అవసరాలు తీరుస్తున్న ఈ ప్రాజెక్టును సున్నపురాయితో కట్టారు. పూర్తి నిల్వ సామర్థ్యం 2.42 టీఎంసీలు కాగా...పూడికతో 1.82 టీఎంసీలకు తగ్గిపోయింది. ప్రాజెక్టు గరిష్ఠ వరద సామర్థ్యం 70 వేల క్యూసెక్కులు కాగా... బుధవారం ఏకంగా 1.82 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది.
ఓ దశలో కట్టపై నుంచి నీరు ఉప్పొంగింది. వరద తాకిడికి ప్రాజెక్టు కట్ట కోతకు గురికావడం ఆందోళన గురి చేసింది. కట్ట కొట్టుకుపోతుందేమోనని దిగువన ఉన్న సమీప గ్రామాల ప్రజలు ఆందోళన చెందారు. యంత్రాంగం సైతం ఉరుకులు పరుగులు చేపట్టింది. చివరకు వరద తగ్గడంతో ప్రజలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈసందర్భంగా మంత్రి ఉత్తమ్ స్పందిస్తూ... ‘103సంవత్సరాల ప్రాజెక్టు 1.82 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకొని నిలబడడం.. నీటిపారుదల శాఖ అధికారులకు ఉపశమనాన్ని కలిగించింది. ఇది గర్వించదగ్గ భావోద్వేగ సమయం’ అని తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 30వేలక్యుసెక్కుల వరద వస్తోందని, ఎలాంటి ప్రమాదం లేదని కామారెడ్డి జిల్లా నీటిపారుదలశాఖ సీఈ శ్రీనివాస్ తెలిపారు. కోతకు గురైన కట్టను పునరుద్ధరిస్తామని చెప్పారు.