Share News

Shubhanshu Shukla: అంతరిక్షంలోకి వెళ్లే ముందు.. శుభాంశు శుక్లా ఏం పాటలు విన్నారంటే

ABN , Publish Date - Jun 25 , 2025 | 02:05 PM

భారత వ్యోమగామి శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) కెనేడీ స్పేస్ నుంచి అంతరిక్షానికి విజయవంతంగా బయలుదేరారు. ఆ క్రమంలో శుక్లా ఓ పాటను విన్నారు. తర్వాత తన ప్రయాణంలో భాగంగా ప్రజలకు ఓ ఆసక్తికర సందేశాన్ని కూడా పంపించారు.

Shubhanshu Shukla: అంతరిక్షంలోకి వెళ్లే ముందు.. శుభాంశు శుక్లా ఏం పాటలు విన్నారంటే
Shubhanshu Shukla

కెనెడీ స్పేస్ నుంచి అంతరిక్షానికి విజయవంతంగా ప్రయాణించిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) సరికొత్త యుగానికి నాంది పలికారు. ఇది కేవలం వ్యక్తిగత విజయమే కాదు. భారత అంతరిక్ష పరిశోధనలో కీలకమైన ఘట్టం. యాక్సియం-4 (Ax-4) మిషన్‌లో భాగంగా అంతరిక్షం వెళ్లిన శుభాంశు శుక్లా, 41 ఏళ్ల తరువాత అంతరిక్షాన్ని సందర్శించిన తొలి భారతీయుడిగా నిలిచారు. 1984లో స్క్వాడ్రన్ లీడర్ రాకేష్ శర్మ అనంతరం భారత్ తరఫున ఇది రెండో ప్రయోగం.


ఏ పాటలు విన్నారంటే..

ఈ చారిత్రాత్మక ప్రయాణాన్ని ప్రారంభించడానికి ముందు అంటే స్పేస్ సెంటర్‌ లాంచ్ ప్యాడ్‌‎‎కు వెళ్లే సమయంలో శుభాంశు శుక్లా తన మనసును నిలకడగా ఉంచుకునేందుకు సంగీతాన్ని విన్నారు. అందుకోసం ఆయన ఎంచుకున్న పాటలు ఏఆర్ రెహ్మాన్ స్వరపరిచిన ప్రేరణాత్మక గీతం స్వదేశ్ మూవీలోని ‘యూన్ హీ చలా చల్’. ఈ పాట ఆయనకు అంతరిక్ష యాత్రకు ముందు శాంతిని, ప్రేరణను అందించింది. దీంతోపాటు ఆయన హృతిక్ రోషన్ ఫైటర్ మూవీలోని వందే మాతరం సాంగ్ వినడం ద్వారా దేశభక్తి చాటుకున్నారు. ఇది కేవలం వ్యక్తిగత భావోద్వేగం మాత్రమే కాదు, భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న బాధ్యతను గుర్తు చేస్తుంది.


త్రివర్ణ పతాకంతో అంతరిక్షంలో

శుభాంశు శుక్లా అంతరిక్షానికి వెళ్లిన వెంటనే.. నమస్తే నా ప్రియ దేశీయులారా అంటూ ప్రజలతో ఒక సందేశం పంచుకున్నారు. 41 సంవత్సరాల తర్వాత మళ్లీ మనం అంతరిక్షంలో అడుగుపెట్టాం. ఇది కేవలం నా ISS ప్రయాణ ఆరంభం మాత్రమే కాదు. భారత మానవ అంతరిక్ష యాత్ర ప్రారంభం కూడా. భూమి చుట్టూ సెకనుకు 7.5 కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్నాం. నా భుజాలపై భారత త్రివర్ణ పతాకం ఉంది. ఈ త్రివర్ణం, నేను ఒక్కడిని కాదని, మీరు అందరూ కూడా ఈ ప్రయాణంలో ఉన్నారని చెబుతోందని అన్నారు.


14 రోజుల కార్యక్రమాలు

యాక్సియం-4 మిషన్‌లో శుభాంశు శుక్లా సహా నలుగురు వ్యోమగాములు 14 రోజులపాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో ఉంటారు. అక్కడ వారు అనేక శాస్త్రీయ ప్రయోగాలు, విద్యా కార్యక్రమాలు, వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించనున్నారు. శుభాంశు శుక్లా ప్రత్యేకంగా ISRO రూపొందించిన 7 ప్రయోగాలు నిర్వహిస్తారు. అలాగే NASA Human Research Programలో భాగంగా ఉన్న 5 అంతర్జాతీయ సహకార అధ్యయనాల్లో పాల్గొంటారు. ఇది శాస్త్రీయంగా, సాంకేతికంగా భారత్‌కు గొప్ప అవకాశంగా నిలవనుంది.


ఇవీ చదవండి:

జూన్ 25 నుంచి 30 వరకు వర్షాలు.. ఏ ప్రాంతాల్లో ఉన్నాయో తెలుసా..


ఈ యాప్ 20 లక్షల పోయిన ఫోన్‌లను గుర్తించింది.. ఎలాగంటే..

మరిన్ని ఏపీ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 25 , 2025 | 02:06 PM