నెట్టింటి కీ ఇవ్వొద్దు..
ABN , Publish Date - Jul 13 , 2025 | 10:57 AM
నెట్‌లో మీరు ఏం వెతుకుతున్నారు? సోషల్ మీడియాలో ఏం పోస్టు పెట్టారు? ఆన్‌లైన్ పోర్టల్‌లో ఏం కొనుగోలు చేశారు? ఎన్నిసార్లు క్రెడిట్‌కార్డు వాడారు? మీరు వాడిన యూపీఐ ఐడీలు ఎన్ని? ఇవన్నీ ఎవరికీ తెలియవు అనుకుంటే పొరబడినట్లే! ఆన్‌లైన్‌లో మీ ప్రతీ క్లిక్‌ని గూగుల్ చూస్తుంది.
నెట్‌లో మీరు ఏం వెతుకుతున్నారు? సోషల్ మీడియాలో ఏం పోస్టు పెట్టారు? ఆన్‌లైన్ పోర్టల్‌లో ఏం కొనుగోలు చేశారు? ఎన్నిసార్లు క్రెడిట్‌కార్డు వాడారు? మీరు వాడిన యూపీఐ ఐడీలు ఎన్ని? ఇవన్నీ ఎవరికీ తెలియవు అనుకుంటే పొరబడినట్లే! ఆన్‌లైన్‌లో మీ ప్రతీ క్లిక్‌ని గూగుల్ చూస్తుంది. మీ ఆసక్తులు ఏంటో మరొకరికి చెబుతుంది. మీ సెర్చ్ హిస్టరీని ట్రాక్ చేస్తుంది. ఇవన్నీ సైబర్ నేరగాళ్లకు వరంగా మారుతున్నాయి. అయితే మీ ఫోన్‌లో సెట్టింగ్స్ మార్చుకుంటే గూగుల్ మీ డేటాను సేవ్ చేయకుండా ఉంటుంది. అందుకే ఆన్‌లైన్‌లో మీ ఆనవాళ్లు కూడా ఉండకూడదంటే ఇలా చేయాల్సిందే.
సోషల్ మీడియాలో మీరు పెట్టిన ఒక కామెంట్ మిమ్మల్ని సైబర్ నేరగాళ్ల ఉచ్చులోకి లాగొచ్చు. ఆన్‌లైన్ పోర్టల్‌లో మీరు నమోదు చేసిన కార్డు వివరాలతో మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావచ్చు. ఇంటర్నెట్‌లో మీరు వెతికిన ప్రతీ అంశాన్ని సెర్చ్ ఇంజన్ గుర్తు పెట్టుకుంటుంది. ఇవన్నీ ఎప్పుడో ఒకప్పుడు మీకు తలనొప్పి అంశాలుగా మారే ప్రమాదం ఉంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆన్‌లైన్ ఆర్థిక మోసాలు పెద్ద సమస్యగా మారుతున్నాయి.
మనదేశంలో 39 శాతం మంది సైబర్ మోసాలకు లోనయ్యారని ఒక సర్వేలో వెల్లడయింది. అందులో 23 శాతం మంది క్రెడిట్, డెబిట్ కార్డుల మోసానికి గురయ్యారనేది ఆందోళన కలిగించే విషయం. ఇటీవల 1600 కోట్ల పాస్‌వర్డ్‌లు ఆన్‌లైన్‌లో లీక్ అయినట్టు తేలింది. కొన్ని లక్షల యూజర్ల అకౌంట్లను ప్రమాదంలోకి నెట్టింది. ఇందులో పర్సనల్ ఈమెయిల్ అకౌంట్లు, సోషల్‌మీడియా అకౌంట్ల లాగిన్ సమాచారం ఉన్నట్లు తేలింది. ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్న ప్రతీ ఒక్కరి వ్యక్తిగత సమాచారం ఎక్కడో ఒక చోట ఆన్‌లైన్‌లో లీక్ అవుతూనే ఉంది. ఇలా జరగకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి.

స్ట్రాంగ్ పాస్‌వర్డ్
ఆన్‌లైన్ లావాదేవీలు పెరిగాక ఒక్కొక్కరు ఇరవైకి పైగా అకౌంట్లు నిర్వహిస్తున్నారు. రెండు మూడు ఈమెయిల్ అకౌంట్‌లు, నాలుగైదు బ్యాంక్ అకౌంట్‌లు, పీఎఫ్ అకౌంట్, ఇన్స్యూరెన్స్ అకౌంట్‌లు, ఫేస్‌బుక్, ఇన్‌స్టా, ఎక్స్, వైఫై, అమెజాన్, స్టాక్ ట్రేడింగ్ అకౌంట్లు... ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే తయారవుతుంది. ఈ అకౌంట్లకు పాస్‌వర్డ్ పెట్టుకోవడం అందరూ చేసేదే. అయితే చాలా మంది గుర్తుండదని, ఏం కాదులే అని ఒకే పాస్‌వర్డ్‌ని అన్ని అకౌంట్లకు వాడేస్తుంటారు. మరి కొంతమంది పుట్టిన రోజు తేదీలను, భాగస్వామి లేక పిల్లల పేర్లను పాస్‌వర్డ్‌లకు వాడుతుంటారు. ఇలా చేస్తే సైబర్‌క్రిమినల్స్‌కు పని సులువు చేసినట్టే. మీ అకౌంట్‌లు సైబర్ నేరగాళ్ల చేతిలో పడకూడదంటే ఒక్కో అకౌంట్‌కి ఒక్కో పాస్‌వర్డ్ ప్రత్యేకంగా ఉండేలా చూసుకోవాలి. స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌ను ఎంచుకోవాలి. అప్పుడే మీ డబ్బుకు, సమాచారానికి భద్రత లభిస్తుంది.
పాస్‌వర్డ్ మేనేజర్
ఒక్కో అకౌంట్‌కు ఒక్కో రకమైన పాస్‌వర్డ్ ఎంచుకోవడం బాగానే ఉంటుంది. కానీ ఇరవైకి పైగా అకౌంట్ల పాస్‌వర్డ్‌లను గుర్తుంచుకునేదెలా? అందరికీ ఎదురయ్యే సమస్యే ఇది. అయితే ఈ సమస్యకు పాస్‌వర్డ్ మేనేజర్ పరిష్కారం చూపుతుంది. పాస్‌వర్డ్ మేనేజర్ సహాయం తీసుకుంటే ఒక్క పాస్‌వర్డ్ గుర్తుంచుకుంటే సరిపోతుంది. పాస్‌వర్డ్ మేనేజర్ మీ పాస్‌వర్డ్‌లన్నింటినీ గుర్తుపెట్టుకుంటుంది. ఆండ్రాయిడ్ ఫోన్లలో ఇన్‌బిల్ట్‌గా గూగుల్ పాస్‌వర్డ్ మేనేజర్ ఉంటుంది. ఈ ఆప్షన్‌ని ఎంచుకుంటే మీ పాస్‌వర్డ్‌లన్నీ సేఫ్‌గా ఉంటాయి.

డేటా క్రిమినల్స్ చేతుల్లో ఉందా?
సైబర్ నేరగాళ్ల బారినపడకుండా అప్రమత్తంగా ఉండాలనే ఆలోచన బాగుంది. కానీ ఇప్పటికే లీక్ అయిన డేటాలో అకౌంట్‌ల వివరాలు, పాస్‌వర్డ్‌లు ఉండి ఉంటే ఎలా? అసలు సైబర్ క్రిమినల్స్ చేతుల్లో మన డేటా ఉందా? లేదా? తెలుసుకునే అవకాశం ఉందా? అంటే జ్చిఠ్ఛిజీఛ్ఛ్ఛుఽఞఠీుఽ్ఛఛీ.ఛిౌఝ ఈ వెబ్‌సైట్‌ను చూడొచ్చు. సైబర్‌నేరగాళ్లకు అందుబాటులో ఉన్న డేటాబేస్‌లో మీ అకౌంట్స్, పాస్‌వర్డ్‌లు ఉన్నాయా అనే విషయాన్ని ఇందులో తెలుసుకోవచ్చు.
పాత అకౌంట్లను డిలీట్ చేయండి
ఒక్కొక్కరికి రెండు మూడు ఫేస్‌బుక్ అకౌంట్లు, నాలుగైదు ఈమెయిల్ అకౌంట్లు ఉండి ఉంటాయి. ఇతర సోషల్‌మీడియా అకౌంట్లు కూడా అంతే. వీటిలో చాలా వరకు ఉపయోగంలో లేనివే ఉంటాయి. గతంలో క్రియేట్ చేసి మరిచిపోయి ఉంటారు. కానీ అలాంటి వాటిలో కూడా మీ వ్యక్తిగత సమాచారం ఉండి ఉంటుంది. కాబట్టి అలాంటి ఉపయోగంలోని లేని అకౌంట్లను గుర్తించి డిలీట్ చేయాలి.

డేటా డౌన్‌లోడ్
పాత అకౌంట్లను డిలీట్ చేయాలంటే కొందరికి మనసొప్పదు. అందులో కూడా కొంత డేటా ఉంది. అది పోతుంది కదా! అని వెనకడుగు వేస్తారు. అయితే డిలీట్ చేయకముందే అకౌంట్‌లో డేటా ఏమైనా ఉంటే చెక్ చేసుకుని డౌన్‌లోడ్ చేసుకుంటే సరిపోతుంది. ఫేస్‌బుక్, గూగుల్ అకౌంట్‌తో అనుసంఽధానమైన ఏ అకౌంట్ డేటా అయినా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ముఖ్యమైనవి అనుకుంటే బ్యాకప్ కాపీలు తీసుకుని భద్రపరుచుకుంటే సరిపోతుంది.
పాత మెయిల్స్ ఎందుకు?
కొంతమంది ఇన్‌బాక్స్ చూస్తే మెయిల్స్‌తో నిండిపోయి ఉంటుంది. అయినా కూడా పాత మెయిల్స్‌ను డిలీట్ చేయరు. పాత మెయిల్స్‌లో ముఖ్యమైన సమాచారం ఉండి ఉంటుంది. ఒకవేళ మీ అకౌంట్ హ్యాక్ అయితే ఆ మెయిల్స్‌తో మీ వ్యక్తిగత డేటా మొత్తం సైబర్‌నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది. అందుకే పాత మెయిల్స్‌ని ఎప్పటికప్పుడు డిలీట్ చేయాలి. ముఖ్యమైన సమాచారం ఉంటే డౌన్‌లోడ్ చేసుకోవాలి.
ఆన్‌లైన్‌లో వెతకాలి
యూజర్‌నేమ్‌లు ఆన్‌లైన్‌లో కనిపిస్తున్నాయేమో ఒకసారి చెక్ చేసుకోవాలి. పబ్లిక్‌వెబ్‌లో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవాలి. సోషల్‌మీడియా ప్రొఫైల్స్ మీ పేరుని చూపిస్తుంటాయి. అంటే ఎవరు సెర్చ్ చేసినా మీ యూజర్‌నేమ్స్ ఆన్‌లైన్‌లో కనిపిస్తాయి. ఒకవేళ మీ యూజర్‌నేమ్ కనిపించకపోతే మీ డేటా భద్రంగా ఉన్నట్టే !.
ప్రైవసీ సెట్టింగ్స్
ఎవరైనా ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసినా మీ ఐడెంటిటీ తెలియకూడదు. సెర్చ్ ఇంజన్స్‌లో మీ సోషల్‌మీడియా ప్రొఫైల్స్‌ని హైడ్ చేయాలి. ఇంటర్నెట్‌లో వ్యక్తిగత సమాచారం కనిపించకూడదు. సోషల్‌మీడియా అకౌంట్లు సెర్చ్ రిజల్ట్స్‌లో రాకూడదు అంటే....ప్రైవసీ సెట్టింగ్స్‌ని మార్చుకోవాలి. ఈ విధానం ఒక్కోసైట్‌కి ఒక్కో విధంగా ఉంటుంది.
సోషల్‌మీడియా సైట్లపై నియంత్రణ
సోషల్ మీడియాలో ఏదైనా పోస్టు పెడితే అందరూ చూస్తారు. అలా కాకుండా మీ పోస్టులు ఎవరు చూడాలో మీరే డిసైడ్ చేయవచ్చు. నియంత్రణ విధించడం ద్వారా ఎంపిక చేసుకున్న వారికి మాత్రమే పోస్టు అందుబాటులో ఉండేలా చేయవచ్చు. ఉదాహరణకు ఫేస్‌బుక్ ప్రొఫైల్ పేజ్‌లోకి వెళ్లి కుడివైపు పైభాగంలో ఉన్న అకౌంట్ బటన్‌పై క్లిక్ చేసి, సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ ఆప్షన్‌ని ఎంచుకుంటే సరిపోతుంది.
సెర్చ్ ఇంజన్‌ను మార్చండి
ఇంటర్నెట్ ఉపయోగించే వారందరూ దాదాపుగా గూగుల్ సెర్చ్ ఇంజన్‌నే వాడుతుంటారు. అయితే మీ డేటా సురక్షితంగా ఉండాలంటే ప్రైవసీకి ప్రాధాన్యం ఇచ్చే ‘డక్‌డక్‌గో’ వంటి సెర్చ్ ఇంజన్‌ని ఉపయోగించండి. మీ అన్ని డివైజ్‌లకి డిఫాల్ట్ సెర్చ్ ఇంజన్‌గా దీన్ని పెట్టుకోండి. స్మార్ట్‌ఫోన్‌లో యాప్‌ని కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. గూగుల్, ఇతర పేరున్న సెర్చ్ ఇంజన్ల వలే ‘డక్‌డక్‌గో’ మీ సెర్చ్ హిస్టరీని ట్రాక్ చేయదు. వ్యక్తిగత సెర్చ్ రిజల్ట్స్ ఆధారంగా టార్గెట్ యాడ్స్‌ని చూపించదు.
ట్రాక్ చేయకుండా...
గూగుల్‌ని తప్ప ఇతర సెర్చ్ ఇంజన్‌లను ఉపయోగించడానికి చాలామంది ఇష్టపడకపోవచ్చు. అలాంటప్పుడు గూగుల్‌లో మరిన్ని ప్రైవసీ సెట్టింగ్స్‌ని యాక్టివేట్ చేసుకోవాలి. అంతేకాకుండా గూగుల్, యూట్యూబ్‌లో మీ హిస్టరీని ట్రాక్ చేయవద్దని గూగుల్‌ని అడగొచ్చు. వినియోగదారుల సెర్చ్ హిస్టరీని ట్రాక్ చేయడం ఆప్షనల్ మాత్రమే. వినియోగదారులు అడిగితే గూగుల్ ట్రాక్ చేయకుండా ఉంటుంది. భవిష్యత్తులో డేటాని కలెక్ట్ చేయవద్దని కోరడమే కాకుండా ఇప్పటికే సేకరించిన డేటాను డిలీట్ చేయమని కూడా అడగొచ్చు. ఇందుకోసం గూగుల్ ప్రొఫైల్ ఫొటోపై క్లిక్ చేసి, మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్‌లోకి వెళ్లాలి. తరువాత ఎడమ వైపు నావిగేషన్ ప్యానల్‌లో ఉన్న డేటా అండ్ ప్రైవసీపై క్లిక్ చేసి హిస్టరీ సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. ఆ తరువాత ‘మై యాక్టివిటీ’పై క్లిక్ చేసి టర్నాఫ్‌ను ఎంచుకోవాలి.
యాడ్స్ రాకుండా ...
ఆన్‌లైన్‌లో మీరు ఏదైనా వస్తువు కోసం సెర్చ్ చేసినప్పుడు, కాస్త సమయం తరువాత దానికి సంబంధించిన ప్రకటనలు రావడం గమనించే ఉంటారు కదా! ‘టాపిక్స్ ఏపీఐ’ అనే టెక్నాలజీ ఆన్‌లైన్‌లో మీ యాక్టివిటీని, ఆసక్తులను గమనించి అందుకు అనుగుణంగా ప్రకటనలు వచ్చేలా చేస్తుంది. 2022లో గూగుల్ సంస్థ ‘మై యాడ్ సెంటర్’ను ప్రారంభించింది. ఈ ఫీచర్‌ను ఉపయోగించుకుంటే ప్రకటనలకు అడ్డుకట్ట పడుతుంది. గూగుల్ అకౌంట్‌లో ‘డేటా అండ్ ప్రైవసీ’ ఆప్షన్‌ను ఎంచుకున్న తరువాత ‘మైయాడ్ సెంటర్’పై క్లిక్ చేయాలి. దీని ద్వారా పర్సనలైజ్డ్ యాడ్స్ రాకుండా చేసుకోవచ్చు.
ప్రైవసీని కాపాడే యాప్స్
వెబ్‌సైట్ల వలే ఫోన్, టాబ్లెట్, కంప్యూటర్‌లలో ఉన్న రకరకాల యాప్స్ డేటాను సేకరిస్తూ ఉంటాయి. ఏయే యాప్స్ మీ డేటాను యాక్సెస్ చేస్తున్నాయో తెలుసుకోవడం కష్టం. అయితే గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్‌స్టోర్‌లను ఎంచుకుంటే ప్రైవసీ సమాచారాన్ని అందిస్తాయి. లొకేషన్, కెమెరా, మైక్రోఫోన్‌తో డేటాను యాప్స్ ఎన్నిసార్లు యాక్సెస్ చేస్తున్నాయో సమాచారం తెలుసుకునేందుకు యాపిల్ ప్రైవసీ రిపోర్టు అనుమతినిస్తుంది. డివైజ్ సెట్టింగ్స్‌లో ‘ప్రైవసీ అండ్ సెక్యూరిటీ’పై క్లిక్ చేసి ‘యాప్ ప్రైవసీ రిపోర్టు’ని ఆన్ చేసి పెట్టుకోవాలి. యూజర్స్ డేటాను ఎలా వాడుతున్నారు? ఽథర్డ్‌పార్టీస్‌తో షేర్ చేస్తున్నారా? ఎలా స్టోర్ చేస్తున్నారు? వంటి అంశాలను గూగుల్ ప్లేస్టోర్ చూపిస్తుంది.
పాత పోస్టులు
ఫేస్‌బుక్ 2004లో ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో పోస్టులు చేసి ఉంటారు. అలాంటి పోస్టులను ఇప్పుడు తొలగించే పని పెట్టుకోండి. ఇన్‌స్టాలో పెట్టిన పోస్టులు, ఎక్స్‌లో చేసిన ట్వీట్లు... ఇలా సోషల్ మీడియాలో ఉన్న పాత పోస్టులను డిలీట్ చేయండి.
ఇన్‌కాగ్నిటొ మోడ్
బ్రౌజింగ్ హిస్టరీ సేవ్ కాకుండా ఇంటర్నెట్ బ్రౌజ్ చేయాలంటే ఇన్‌కాగ్నిటొ మోడ్ ఎంచుకోవాలి. దీన్ని ప్రైవేట్ బ్రౌజింగ్ అని కూడా అంటారు. ఈ మోడ్‌లో బ్రౌజింగ్ హిస్టరీ, కుకీస్, సైట్ డేటా వంటివి ఏవీ సేవ్ కావు. బ్రౌజింగ్ యాక్టివిటీ ప్రైవేటుగా జరగాలని కోరుకునేవారు ఎంచుకోదగిన ఆప్షన్ ఇది. క్రోమ్‌లో కుడివైపు పైభాగంలో మూలన ఉన్న మూడు నిలువు చుక్కలపై క్లిక్ చేస్తే న్యూ ఇన్‌కాగ్నిటో విండో ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్‌ని ఎంచుకుంటే కొత్త ప్రైవేట్ విండో ఓపెన్ అవుతుంది.
వీపీఎన్‌ను వాడండి
వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్(వీపీఎన్)ను ఎంచుకుంటే ఇంటర్నెట్‌లో సెక్యూర్ టన్నెల్‌ను క్రియేట్ చేస్తుంది. కనెక్షన్‌ను ఎన్‌క్రిప్ట్ చేయడం ద్వారా మీకు, మీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్‌కు నడుమ మధ్యవర్తిగా వ్యవహరిస్తుంది. వీపీఎన్ ఉపయోగిస్తే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ మీరుచూస్తున్న వెబ్‌సైట్ల సమాచారాన్ని వీపీఎన్ ఐపీ అడ్రస్ ద్వారా మాత్రమే చూడగలుగుతారు. మీ ఐపీ అడ్రస్ ద్వారా చూడలేరు.
ప్రైవసీ కావాలంటే ...
ఆన్‌లైన్‌లో ప్రైవసీ కావాలంటే ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఎంచుకోవాలి. ఈ తరహా సెక్యూరిటీతో డేటాను మీతో పాటు, ఎవరితోనైతే కమ్యునికేట్ చేస్తున్నారో వాళ్లు మాత్రమే చూడగలరు. వాట్సప్‌లో ఈ తరహా సెక్యూరిటీ ఉంటుంది. ‘వన్ కమ్యునికేషన్’ యాప్ ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను సిగ్నల్‌లా వాడుతుంది. దీన్ని యాపిల్, ఆండ్రాయిడ్ డివైజ్‌లలో వాడుకోవచ్చు.
కార్డు వివరాలు సేవ్ చేస్తే...
ఆన్‌లైన్‌లో ఏదైనా వస్తువు కొనుగోలు చేసి, పేమెంట్ చేసే సందర్భంలో కార్డు సమాచారాన్ని ఎంటర్ చేస్తారు. ఆ సమయంలో కార్డు వివరాలను సేవ్ చేయడం కోసం ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఒకవేళ మీరు సేవ్ ఆప్షన్ ఎంచుకుంటే కార్డు వివరాలు వెబ్‌లో సేవ్ అవుతాయి. అలా సేవ్ అయిన వివరాలు సైబర్ నేరగాళ్ల చేతికి సులువుగా వెళతాయి. అందుకే ఆన్‌లైన్ షాపింగ్ సైట్లలో పేమెంట్ వివరాలు సేవ్ చేయకూడదు. రెండోసారి కొనుగోలు చేసినప్పుడు ఈజీగా ఉంటుందని చాలా మంది సేవ్ చేస్తారు, కానీ కార్డు సమాచారాన్ని తస్కరించడం సైబర్ నేరగాళ్లకు సులువవుతుంది.
షేర్ చేసేముందు...
ఆన్‌లైన్‌లో వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేసేముందు ఒక్కక్షణం ఆలోచించండి. పుట్టిన తేదీ, పుట్టిన ప్రదేశం, మీకిష్టమైన ఫుడ్, వ్యక్తులు... ఇలాంటి సమాచారం షేర్ చేసే సమయంలోనూ ఒకటికి రెండుసార్లు చెక్ చేయాలి. సెక్యూరిటీ ప్రశ్నలుగా వీటిని మీరు ఎంచుకుని ఉండొచ్చు. అవి సైబర్ క్రిమినల్స్ చేతిలో పడితే మీ అకౌంట్స్‌ని సులువుగా హ్యాక్ చేస్తారు.
స్మార్ట్‌గా కాదు... స్ట్రాంగ్‌గా
ఇప్పుడంతా స్మార్ట్‌యుగం నడుస్తోంది. ఇంట్లో స్మార్ట్ పరికరాల వినియోగం సర్వసాధారణం అయిపోయింది. స్మార్ట్ స్పీకర్స్, స్మార్ట్‌టీవీ, స్మార్ట్ ఫ్రిజ్, సీసీ టీవీ కెమెరాలు, స్మార్ట్‌లాక్స్, స్మార్ట్‌ఏసీ... ఇలా అన్నీ ఇంటర్నెట్‌తో అనుసంధానమై పనిచేస్తున్నాయి. ఒకవేళ వీటికి సరైన సెక్యూరిటీ లేకపోతే హ్యాకర్స్ సులువుగా మీ నెట్‌వర్క్‌లోకి చొరబడతారు. కొన్ని డివైజ్‌లకు డీఫాల్ట్‌గా ‘0000’ పాస్‌వర్డ్ వస్తుంది. అలాంటి పాస్‌వర్డ్‌లను మార్చి స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌లు పెట్టుకోవాలి. ఒకవేళ డివైజ్‌కు మల్టీఫ్యాక్టర్ అథంటికేషన్ ఉంటే ఆన్ చేసుకోవాలి.
సాఫ్ట్‌వేర్ అప్‌డేట్
ఎప్పటికప్పుడు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. డివైజ్ ఏదైనా సరే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్‌ని నిర్లక్ష్యం చేయవద్దు. యాప్స్ కూడా అప్‌డేట్ చేసుకోవాలి. నిపుణులు బగ్స్‌ని గుర్తించినప్పుడు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ ఇస్తుంటారు. ఈ అప్‌డేట్స్ వల్ల సైబర్ క్రిమినల్స్ చొరబడకుండా చూసుకోవచ్చు.
- పన్యాల నరేందర్ రెడ్డి
ఈ వార్తలు కూడా చదవండి.
సినిమా ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత
రేవంత్‌రెడ్డీ.. దమ్ముంటే అసెంబ్లీ పెట్టు
Read Latest Telangana News and National News