Share News

Open AI Atlas Browser: ఓపెన్ ఏఐ అట్లాస్ బ్రౌజర్.. టాప్ ఫీచర్స్ ఇవే

ABN , Publish Date - Nov 03 , 2025 | 12:20 PM

ఇటీవల ఓపెన్ ఏఐ సంస్థ లాంఛ్ చేసిన ఏఐ ఆధారిత అట్లాస్ బ్రౌజర్‌లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. మరి ఇందులోని టాప్ 5 ఫీచర్స్ ఏవో ఈ కథనంలో తెలుసుకుందాం.

Open AI Atlas Browser: ఓపెన్ ఏఐ అట్లాస్ బ్రౌజర్.. టాప్ ఫీచర్స్ ఇవే
Openai Atlas Browser-Top Features

ఇంటర్నెట్ డెస్క్: చాట్‌జీపీటీ రూపకర్త అయిన ఓపెన్ ఏఐ సంస్థ ఇటీవల ఏఐ ఆధారిత అట్లాస్ బ్రౌజర్‌ను లాంచ్ చేసింది. ఏఐ పవర్డ్ బ్రౌజర్‌లకు ఆదరణ పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఏఐ సాయంతో నేరుగా నెట్టింట సెర్చ్ చేసే అవకాశాన్ని ఈ బ్రౌజర్ అందిస్తోంది. మరి ఇందులోని టాప్ ఫీచర్స్ ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం (Openai Atlas Browser-Top Features).

చాట్‌జీపీటీ సైడ్ బార్

ఈ బ్రౌజర్‌లో ‘ఆస్క్ చాట్‌జీపీటీ’ ఆప్షన్‌ను క్లిక్ చేస్తే పక్కనే ఓ చాట్‌జీపీటీ సైడ్‌ బార్ ఓపెన్ అవుతుంది. దీని ద్వారా మీరు చూస్తున్న ట్యాబ్‌లోని సమాచారాన్ని సంక్షిప్త రూపంలోకి మార్చడం, చాట్‌జీపీటీని అడిగి సందేహాలను నివృత్తి చేసుకోవడం వంటివి చేయొచ్చు. బ్రౌజర్‌ను వీడకుండానే ఇవన్నీ చేసుకోవచ్చు.

బ్రౌజర్ మెమరీ

మీరు గతంలో చూసిన వెబ్ పేజీలను బ్రౌజర్ మెమరీ ఫీచర్‌తో చాట్‌జీపీటీ గుర్తుపెట్టుకుంటుంది. అవసరమైన సమయంలో వీటిని జల్లెడ పట్టి మీరు కోరుకున్న సమాచారాన్ని ముందుంచుతుంది.


ఏఐ ఆధారిత సెర్చెస్

యూజర్ నెట్టింట వెతికే సమాచారం అట్లాస్ బ్రౌజర్‌లో ఏఐ ద్వారా అందుతుంది. అంటే.. మీ ప్రశ్నలను ఏఐ ముందుగా అర్థం చేసుకుని నెట్టింట వెతికి లోతైన సమాచారాన్ని అందిస్తుంది. యూజర్ల కోరిక మేరకు కచ్చితమైన, విశ్వసనీయమైన సమాచారాన్ని అట్లాస్ బ్రౌజర్ అందిస్తుంది.

ఏజెంట్ మోడ్

బ్రౌజర్‌లోని ఏఐ మోడ్‌ యూజర్లకు సహాయకారిగా ఉంటుంది. యూజర్లకు కావాల్సిన ఆన్‌లైన్ పనులు చిటికెలో చేసి పెడుతుంది. ఉదాహరణకు, రెస్టారెంట్‌ బుకింగ్, కార్యక్రమాల ప్లానింగ్, అపాయింట్‌మెంట్ బుక్ చేయడం వంటివి యూజర్ కోసం చేసి పెడుతుంది.

ఇన్ లైన్ టెక్స్ట్ ఎడిట్స్

యూజర్లు ఏదైనా రాసేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు మెరుగైన సూచనలు ఇచ్చే ఇన్ లైన్ టెక్ట్స్ ఫీచర్ కూడా అద్భుతమైనదే. ఈమెయిల్స్ రాసేటప్పుడు లేదా ఏదైనా అంశాన్ని ఎడిట్ చేసేటప్పుడు ఈ ఫీచర్ అక్కరకు వస్తుంది. మెరుగు పరచాలనుకుంటున్న వాక్యాలను సెలక్ట్ చేసి చాట్‌జీపీటీ ఐకాన్‌ను క్లిక్ చేస్తే వాక్య నిర్మాణం యూజర్‌ల అభిరుచికి తగ్గట్టు మారుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఇన్ని ఫీచర్లు ఉన్న ఈ బ్రౌజర్‌ను మీరూ ఓసారి ట్రై చేయండి.


ఇవి కూడా చదవండి

భారీ స్థాయిలో హ్యాకింగ్.. 183 మిలియన్‌లకు పైగా పాస్‌వర్డ్స్ లీక్!

సూపర్ ఇంటెలిజెంట్ ఏఐపై నిషేధం విధించాలి: ప్రముఖ శాస్త్రవేత్త జాఫ్రీ హింటన్ డిమాండ్

Read Latest and Technology News

Updated Date - Nov 03 , 2025 | 12:51 PM