Share News

Viral Video: ఇంట్లో పనులు చకచకా చేస్తూ.. కాఫీ అందిస్తున్న రోబో..

ABN , Publish Date - Feb 24 , 2025 | 07:16 PM

చిట్టి చిట్టి రోబో తెలుసుగా, రోబో సినిమాలో అనేక పనులను చకచకా చేసి చూపిస్తుంది. ఇప్పుడు కూడా అచ్చం అలాంటి రోబోను ఓ కంపెనీ తయారు చేసింది. ఇది ఇంట్లో పనులను చేయడంతోపాటు ఓనర్లకు కాఫీని కూడా అందిస్తుంది. దాని వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

Viral Video: ఇంట్లో పనులు చకచకా చేస్తూ.. కాఫీ అందిస్తున్న రోబో..
Norway Humanoid Robot NEO GAMA

ఏఐ వాడకంతోపాటు పలు దేశాల్లో రోబోల వినియోగం కూడా క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే టెలి కాలింగ్ నుంచి మొదలుకుని పలు ప్రాంతాల్లో అగ్నిమాపక ప్రమాద సమయాల్లో కూడా రోబోలను వినియోగిస్తున్నారు. ఈ క్రమంలోనే నార్వే(Norway)కు చెందిన రోబోటిక్స్ సంస్థ 1X.. ఓ హ్యూమనాయిడ్ రోబోట్‌ను అభివృద్ధి చేసింది. దాని పేరు "నియో గామా(NEO GAMMA)" కాగా, ఇది ఇంటి పనులను చకచకా చేసేస్తుంది. అంతేకాదు ఇది ఇంట్లో ఉన్న ఓనర్లకు కాఫీని కూడా అందిస్తుంది. అందుకు సంబంధించిన వీడియోను సంస్థ విడుదల చేయగా, ప్రస్తుతం వీడియో వైరల్‌గా మారింది.


వీడియోలో 1X నియో బీటా రోబో నలుపు, బూడిద రంగుతో ప్రత్యేకంగా కనిపిస్తుంది. స్కాండినేవియన్ మినిమలిస్ట్ డిజైన్‌తో ఉన్న ఈ రోబోట్ ఇంట్లో సౌకర్యవంతంగా తిరుగుతుంది. ఈ క్రమంలో రోబోట్‌ ఇంటి సహాయకుడిగా అనేక పనులను నిర్వహిస్తుంది. వాక్యూమ్ చేయడం, లాండ్రీ చేయడం, ఇంటి అద్దాలను తుడవడం వంటి ఎన్నో పనులను ఈజీగా చేసేస్తుంది. ఈ రోబోట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో రూపొందించారని, దీనివల్ల ఇది మానవ శరీర భాషను, ప్రసంగాన్ని కూడా అర్థం చేసుకుంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం 1X సంస్థ నియో గామాను ఇంటి వాతావరణంలో పరీక్షించామని తెలిపారు.


ఈ రోబోట్ చాలా నిశ్శబ్దంగా పనిచేస్తుందని కంపెనీ తెలిపింది. నియో గామా చేతులు మానవ కదలికల మాదిరిగా మోటార్లతో కూడిన బహుళ జాయింటెడ్ మెకానిజం ద్వారా పనిచేస్తాయన్నారు. ఈ చేతులు మృదువైన ఉత్పత్తులతో తయారు చేశారని, అలా చేయడం ద్వారా రోబోట్ పని సామర్థ్యం పెరుగుతుందన్నారు. అంతేకాదు ఈ రోబోలో AI ఆధారిత చాట్‌బాట్ ChatGPT వ్యవస్థ కూడా ఉందన్నారు. దీనికి ముందు 2023లో OpenAI నుంచి పెట్టుబడులు వచ్చిన తర్వాత, 1X సంస్థ ఈ రోబోట్‌కు సహజ సంభాషణను ప్రారంభించడానికి ఓ ప్రత్యేక లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (LLM)ను రూపొందించినట్లు చెప్పారు.


రోబోట్ మాట్లాడినప్పుడు "ఇయర్ రింగ్స్" వెలిగిపోతాయని, తద్వారా రోబో మాట్లాడుతున్నట్లుగా మనకు అర్థం అవుతుందన్నారు. ఇది సాంకేతిక పరంగా అమెజాన్ అలెక్సా మాదిరిగా ఉంటుందన్నారు. దీనిలో నాలుగు మైక్రోఫోన్లను ఇన్‌స్టాల్ చేశామని, అవి వినోదం, కమ్యూనికేషన్, వాయిస్ ఇంటరాక్షన్ సౌకర్యాన్ని అందిస్తాయన్నారు. నియో గామా సహజంగా నడుస్తుందని, కుర్చీలో లేదా సోఫాలో కూడా కూర్చుంటుందని తెలిపారు. ఫిగర్, బోస్టన్ డైనమిక్స్, టెస్లా వంటి ప్రముఖ సంస్థలు ప్రస్తుతం హ్యూమనాయిడ్ రోబోట్స్‌ను అభివృద్ధి చేస్తున్నాయి. అయితే వారి ఫోకస్ మాత్రం పరిశ్రమలల్లో వాటిని వినియోగించడంపై ఉంది. కానీ 1X సంస్థ ఇంటి వాతావరణంలో రోబోట్లు పని చేసే సామర్థ్యాన్ని మరింత మెరుగుపరిచే లక్ష్యంతో నియో గామాను రూపొదించింది.


ఇవి కూడా చదవండి:

Apple iPhone: మార్కెట్లోకి కొత్త ఐఫోన్ మోడల్.. ఈనెల 28 నుంచి సేల్, 10 వేలు తగ్గింపు ఆఫర్


OpenAI: ఓపెన్ ఏఐ నుంచి కొత్తగా ఏఐ ఏజెంట్.. దీని స్పెషల్ ఏంటంటే..


Bank Holidays: మార్చి 2025లో బ్యాంకు సెలవులు.. ఈసారి ఎన్ని రోజులంటే..

Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్

Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 24 , 2025 | 07:19 PM