Bhargavastra: ఆకాశంలో శత్రు డ్రోన్‌లను నాశనం చేసే స్వదేశీ 'భార్గవాస్త్ర' పరీక్ష సక్సెస్..
ABN , Publish Date - May 14 , 2025 | 04:53 PM
ఒకేసారి బహుళ డ్రోన్‌లను ఢీకొట్టగల డ్రోన్ వ్యవస్థ 'భార్గవాస్త్ర'ను భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని గోపాల్‌పూర్ నుంచి ప్రయోగించిన దీని స్పెషల్ ఏంటి, ఎలా పనిచేస్తుందనే తదితర వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

దేశంలో పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ఉగ్రవాదుల స్థావరాలపై దాడి చేసిన క్రమంలో పాకిస్తాన్ కూడా డ్రోన్లు, క్షిపణులను ఉపయోగించి దాడులు చేసింది. ఈ క్రమంలో భారతదేశం అన్ని రకాల దాడులను భగ్నం చేసింది. ఈ నేపథ్యంలో మే 13, 2025న ఒడిశాలోని గోపాల్‌పూర్‌లో స్వదేశీ డ్రోన్ నిరోధక వ్యవస్థ 'భార్గవాస్త్ర(Bhargavastra)ను భారతదేశం విజయవంతంగా పరీక్షించింది. సోలార్ డిఫెన్స్ అభివృద్ధి చేసిన ఈ వ్యవస్థ 2.5 కి.మీ. దూరం ఉన్న డ్రోన్ సమూహాలను సులభంగా నాశనం చేయగలదు. మైక్రో రాకెట్లు, క్షిపణులతో కూడిన ఈ వ్యవస్థ భారతదేశ వైమానిక రక్షణను బలోపేతం చేస్తుందని ఆయా వర్గాలు చెబుతున్నాయి.
సముద్ర మట్టానికి..
మే 13న గోపాల్‌పూర్‌లో సీనియర్ ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ (AAD) అధికారుల సమక్షంలో ఈ రాకెట్‌కు మూడు పరీక్షలు జరిగాయి. ఒక్కొక్క రాకెట్‌ను ప్రయోగించడం ద్వారా రెండు పరీక్షలు నిర్వహించారు. 2 సెకన్లలోపు సాల్వో మోడ్‌లో రెండు రాకెట్లను ప్రయోగించడం ద్వారా ఒక పరీక్ష నిర్వహించబడింది. నాలుగు రాకెట్లు అంచనా వేసిన విధంగా పనిచేశాయి. ఆ క్రమంలో అవసరమైన ప్రయోగ పారామీటర్లను సాధించాయి. దీనిని సముద్ర మట్టానికి 5,000 మీటర్ల పైన ఉన్న ప్రాంతాలతో సహా విభిన్న భూభాగాలలో సజావుగా మోహరించడానికి రూపొందించారు.
'భార్గవాస్త్ర' లక్షణాలు
'భార్గవాస్త్ర' అనేది యాంటీ డ్రోన్ వ్యవస్థ. ఇది వేగంగా వచ్చే డ్రోన్‌లను గుర్తించి నాశనం చేయగలదు.
ఇది 6 నుంచి 10 కి.మీ. దూరంలో ఉన్న చిన్న డ్రోన్‌లను గుర్తించగలదు. ఇందులో రాడార్, ఎలక్ట్రో-ఆప్టికల్/ఇన్‌ఫ్రారెడ్ (EO/IR) సెన్సార్, RF రిసీవర్ ఉంటాయి. ఇది 2.5 కి.మీ. దూరంలోని డ్రోన్‌లను నాశనం చేయగలదు. 20 మీటర్ల ప్రాణాంతక వ్యాసార్థం ఉంటుంది.
మొదటగా డ్రోన్ సమూహాలను నాశనం చేయడానికి సిద్ధం చేశారు.
రెండో దశలో ఖచ్చితమైన దాడి కోసం ఇప్పటికే పరీక్షించబడింది.
డ్రోన్‌లను నాశనం చేయకుండా వాటిని నిలిపివేయగల జామింగ్, స్పూఫింగ్ వంటి సౌకర్యాలు కూడా దీనిలో ఉన్నాయి.
ప్రత్యేకమైన వ్యవస్థ..
భార్గవాస్త్రను దీని డెవలపర్లు ప్రపంచ స్థాయిలోనే ఒక ప్రత్యేకమైన వ్యవస్థగా అభివర్ణించారు. అనేక అభివృద్ధి చెందిన దేశాలు సూక్ష్మ క్షిపణి వ్యవస్థలపై పనిచేస్తున్నప్పటికీ, తక్కువ ఖర్చుతో డ్రోన్ సమూహాలను నాశనం చేయగల ఇలాంటి వ్యవస్థ ఇంకా రాలేదన్నారు. ఈ వ్యవస్థ 64 గైడెడ్ మైక్రో క్షిపణులను ఒకేసారి ప్రయోగించగలదు. C4I (కమాండ్, కంట్రోల్, కమ్యూనికేషన్స్, కంప్యూటర్స్, ఇంటెలిజెన్స్) సాంకేతికతతో కూడిన ఈ వ్యవస్థ, సింగిల్ డ్రోన్లు లేదా మొత్తం సమూహాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. EO/IR సెన్సార్లు తక్కువ రాడార్ క్రాస్ సెక్షన్ (LRCS) లక్ష్యాలను కచ్చితంగా గుర్తించేలా చేస్తుంది. భారత సైన్యం త్వరలో దీనిని తన వాయు రక్షణ వ్యవస్థలో చేర్చాలని యోచిస్తోంది.
ఇవి కూడా చదవండి
Penny Stock: ఈ స్టాక్‌పై రూ.4 లక్షల పెట్టుబడి..ఏడేళ్ల లోనే రూ.56 లక్షల లాభం..
Investment Tips: ఒకేసారి రూ.3.5 లక్షల పెట్టుబడి..కానీ వచ్చేది మాత్రం కోటి, ఎలాగంటే..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి