Share News

Manus: చైనా మరో అద్భుతం.. స్వతంత్రంగా పనిచేసే ఏఐ ఏజెంట్ సృష్టి

ABN , Publish Date - Mar 09 , 2025 | 11:52 AM

ప్రస్తుత ఏఐ ఏజెంట్లకు భిన్నంగా స్వతంత్ర ప్రతిపత్తితో పనిచేసే ఓ ఏఐ ఏజెంట్‌ను చైనా స్టార్టప్ సంస్థ రూపొందించింది. ప్రస్తుతం శాస్త్రప్రపంచంలో ఇదో సంచలనంగా మారివంది.

Manus: చైనా మరో అద్భుతం.. స్వతంత్రంగా పనిచేసే ఏఐ ఏజెంట్ సృష్టి

ఇంటర్నెట్ డెస్క్: ఏఐ ప్రపంచంలో మరో విప్లవానికి చైనా నాంది పలికింది. మనుషుల సాయం లేకుండానే పూర్తి స్వతంత్రంగా పనిచేసే ఏఐ ఏజెంట్ మానస్‌ను రూపకల్పన చేసింది. షెంజెన్‌లోని మోనికా.ఐమ్ అనే స్టార్టప్ సంస్థ దీని రూపొందించింది. డీప్‌సీక్ తరువాత ప్రస్తుతం ఏఐ ప్రపంచంలో ఇది అతిపెద్ద సంచలనంగా మారింది.

ఏమిటీ మానస్?

ఇప్పటివరకూ ఏఐ అంటే మనకు చాట్‌జీపీటీ, జెమెనై, కోపైలట్ వంటివి గుర్తుస్తాయి. మనం అడిగిన ప్రశ్నలకు అవి మనకు అర్థమైయ్యే భాషలో సమాధానాలు ఇస్తుంటాయి. కోడింగ్ మొదలు, షెడ్యూల్ వరకూ మనం అడిగిన పనులను చాలా వరకూ చేసిపెడతాయి. కానీ, మనుషుల సూచనలు లేనిదే ఇవి అస్సలు పనిచేయలేవు. స్వతంత్రంగా ఆలోచించే సామర్థ్యం ఉండదు. అయితే, ఏఐ శాస్త్రవేత్తలు అసలు లక్ష్యం మాత్రం వేరు. మనుషులతో సమానంగా పూర్తి స్వతంత్ర ప్రతిపత్తితో పనిచేయగలిగే ఏఐ ఏజెంట్లను రూపొందించడమే అసలు గమ్యం.


రష్యా శాస్త్రవేత్తల ఘనత.. నెల రోజుల్లో అంగారకుడిని చేరేలా రాకెట్ ఇంజెన్ రూపకల్పన

ఏఐ రంగంలో దూసుకుపోతున్న అమెరికా సిలికాన్ వ్యాలీ కంపెనీలు కూడా ఇలాంటి ఏఐ ఏజెంట్‌లకు సంబంధించి ప్రణాళిక దశకే పరిమితమయ్యాయి. అయితే, చైనా స్టార్టప్ సంస్థ మాత్రం స్వతంత్రత ప్రదర్శించ గలిగిన ఏఐ ఏజెంట్‌తో ముందుకొచ్చింది. అదే మానస్. దీన్ని లాంచ్ చేయగానే ఏఐ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కి పడింది.

మనుషుల అవసరం లేకుండానే పనులను చక్కబెట్టే శక్తి మానస్‌కు ఉందని అంతర్జాతీయ మీడియా చెబుతోంది. డిజిటల్ ప్రపంచంలో మనుషుల మాదిరి వ్యవహరిస్తూ అన్నీ చకచకా చేసేస్తుంది. ఎటువంటి మానవ పర్యవేక్షణ, మార్గదర్శకత్వం లేకుండానే అత్యంత కచ్చితత్వంతో పనులు చేసిపెట్టగలిగే సామర్థ్యం దీని సొంతం.

ChatGPT 4.5: చాట్‌జీపీటీ కొత్త మోడల్‌ను ఆవిష్కరించిన ఓపెన్ ఏఐ.. ఫీచర్లు ఏంటంటే..

ఉదాహరణకు మీరు మానస్‌కు ఉద్యోగార్థుల రెజ్యూమేలను ఇచ్చారనుకోండి. ఆ తరువాత మీరు మరో సూచన చేయకుండానే మానస్ మీరు మెచ్చే రీతిలో ఆ సమాచారాన్నంతా క్రోడీకరిస్తుంది. ఉద్యోగార్థుల రెజ్యూమేలో నైపుణ్యాలను బట్టి వారికి ర్యాంకులు కేటాయిస్తుంది. ఒక్కో అభ్యర్థి కీలక నైపుణ్యాలు, సామర్థ్యాలతో కూడిన మరో లిస్టు సిద్ధం చేస్తుంది. వారి స్కిల్స్ ప్రస్తుత జాబ్ మార్కెట్‌కు ఏమేరకు సరిపోతాయో చెబుతుంది. ఇవన్నీ ఓ ఎక్సెల్ ఫార్మాట్‌లో మీకు ఇచ్చి మీరు సులువుగా నిర్ణయం తీసుకునేలా సమాచారాన్ని అందిస్తుంది. నాకో అపార్ట్‌మెంట్ వెతికిపెట్టు అని అడిగారంటే కేవలం ఖాళీ అపార్ట్‌మెంట్‌ల జాబితా ఇచ్చి అక్కడితో సరిపెట్టదు. దీనికి బదులు ఖాళీ అపార్ట్‌మెంట్‌లు ఉన్న ప్రాంతాల్లోని నేరాల శాతం ఎంత, అక్కడి వాతావరణం, అద్దెలు ఎలా ఉన్నాయి ఇత్యాది వివరాలు ఇస్తుంది. యూజర్ల అభిరుచికి తగ్గ అపార్ట్‌మెంట్‌లను కూడా ఎంపిక చేస్తుంది. ఒక్క వాక్యంలో చెప్పాలంటే.. ఇది మనుషుల్లాగే కంప్యూటర్‌ను వినియోగించే అదృశ్య సహాయకుడన్నమాట.


ఇదెలా సాధ్యమైందంటే..

మానస్‌ను నిర్మించిన తీరులోనే ఈ శక్తి సామర్థ్యాలన్నీ దాగున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సాధారణ ఏఐ చాట్‌బాట్‌లు ఒక న్యూరల్ నెట్వర్క్ ఆధరంగా పనిచేస్తాయి. కానీ మానస్‌ది మాత్రం మల్టీ ఏజెంట్ ఆర్కిటెక్చర్. అంటే.. ఇతర ఏఐ చాట్‌‌బాట్‌లకు స్వతంత్రంగా పనులు అప్పగించి ఫలితాలు రాబట్టగలిగే డిజిటల్ మేనేజర్. మానస్‌కు ఏదైనా పని అప్పగించినప్పుడు అది దాన్ని చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి వాటిని తగిన ఏజెంట్లకు అప్పగిస్తుంది. ఆ తరువాత వాటి పనిలో పురోగతిని పర్యవేక్షిస్తుంది. ఇలా చేయాలంటే గతంలో బహుళ ఏఐ ఏజెంట్లను ఇంజినీర్లు జాగ్రత్తగా ఒకదానితో మరొకదాన్ని అనుసంధానం చేయాల్సి వచ్చేది.


Samsung Unveils A series Phones: శాంసంగ్ కొత్త మోడల్స్.. వీటి ఏఐ ఫీచర్స్ చూస్తే..

మానస్‌ ఇవన్నీ తానే చేసుకుపోతుంది. మానస్ కార్యకలాపాలు అన్నీ క్లౌడ్ ఆధారితమైనవి కావడం మరో ప్రత్యేకత. దీన్ని ఇటీవల ఓ టెక్ రైటర్ పరీక్షించారు. తన గురించి ఓ ఆటోబయోగ్రఫీ రాసి, ఓ వెబ్‌సైట్ కూడా సిద్ధం చేయమన్నారు. వెంటనే రంగంలోకి దిగిన మానస్.. అతడి సోషల్ మీడియా ఖాతాలను జల్లెడపట్టి నైపుణ్యాలు, విజయాలు, అభిరుచులతో కూడిన ఓ బయోగ్రఫీ రాసిపెట్టింది. ఈ వివరాలతో ఓ అందమైన వెబ్‌సైట్ డిజైన్ చేసి దాన్ని హోస్ట్ (ఆన్‌లైన్‌లో అందరికీ అందుబాటులో ఉంచడం) కూడా చేసింది. హోస్టింగ్‌లో సమస్యలను కూడా యూజర్‌ను అడగకుండానే పరిష్కరించింది. దీంతో, ఏఐపై చర్చ పతాకస్థాయికి చేరింది. మనుషుల అవసరం లేకుండా పనిచేయగలిగిన ఏఐ ఏజెంట్లు చివరకు మనుషుల అనుమతి లేకుండా నచ్చినట్టు వ్యవహరిస్తే పరిస్థితి ఏమిటన్న సైద్ధాంతిక అంశాలు తెరపైకి వచ్చాయి. దీంతో, ఏఐ భవిష్యత్తు, మానవ సమాజంపై ప్రభావాలు, నైతికతకు సంబంధించి అనేక ప్రశ్నలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

Read More Technology News and Latest Telugu News

Updated Date - Mar 09 , 2025 | 11:56 AM